Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఓటర్ల జాబితాతో ఆధార్‌ అనుసంధానం

‘ప్రవాస’ భారతీయులకూ ఓటు హక్కు
పరిశీలిస్తున్నామన్న కేంద్ర మంత్రి రిజిజు
నిర్బంధ ఓటింగ్‌ ప్రతిపాదన ఏదీ లేదు

న్యూదిల్లీ : మోసపూరిత ఓటింగ్‌ను నిరోధించేందుకు ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం, విదేశాల్లో పని చేస్తున్న భారతీయులకు ఆన్‌లైన్‌లో ఓటు హక్కును వినియోగించుకునే ప్రతిపాదనలను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరెన్‌ రిజిజు శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. దేశంలో నిర్బంధ ఓటింగ్‌ను అమలు చేయడానికి చట్టం తీసుకురావడానికి ఎటువంటి ప్రతిపాదన లేదని, ఎన్నికల మోసం అనేది తీవ్రమైన విషయమని, మోసపూరిత ఓటింగ్‌ను ఎలా నిరోధించాలనే విషయాన్ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి స్థాయిలో ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర మంత్రి చెప్పారు. ‘ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం ఒక మార్గం. ఇప్పటి వరకు ఓటర్ల జాబితాతో ఆధార్‌ను అనుసంధానం చేయడం స్వచ్ఛందం. అయితే ఓటర్ల జాబితాలో రెండేసి పేర్లను, మోసపూరిత ఓట్లను తనిఖీ చేయడం, స్వచ్ఛమైన ఓటింగ్‌ ప్రక్రియను నిర్ధారించడం కోసం ‘ఒక దేశం, ఒకే ఓటర్ల జాబితా’ను నిర్ధారించడం మా లక్ష్యం’ అని ప్రశ్నోత్తరాల సమయంలో రిజిజు అన్నారు. ‘ప్రవాస’ భారతీయులకు ఓటు హక్కు కల్పించాలనే ప్రతిపాదనపై అనుబంధ ప్రశ్నకు సమాధానమిస్తూ, విదేశాలలో పని చేస్తున్న భారతీయులకు ఓటు హక్కును ఎలా ఇవ్వాలో లేదా ఆన్‌లైన్‌ ఓటింగ్‌ను అనుమతించాలా అనే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం ఎన్నికల సంఘానికి సూచించినట్లు మంత్రి తెలిపారు. ‘కానీ ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు, ప్రక్రియ భద్రత, పారదర్శకతను నిర్ధారించుకోవాలి. అది పనిచేయకుండా ఉంటుంది’ అని అన్నారు. ఈవీఎంల సోర్స్‌ కోడ్‌ ఈవీఎంలను తయారు చేసే కంపెనీ వద్ద ఉందా లేదా అది ఈసీకి పంపుతున్నారా అని కాంగ్రెస్‌ సభ్యుడు మనీశ్‌ తివారీ ప్రశ్నించగా, ఇది న్యాయమూర్తుల నియామకం లాంటిదని రిజిజు తెలిపారు. ‘న్యాయమూర్తుల నియామకాన్ని ప్రభుత్వం చేపడుతుంది. కానీ వారు నియమితులైన తర్వాత, వారు స్వతంత్రులు అవుతారు. ఈవీఎంలను ఎవరూ ప్రశ్నించకూడదు.. ఎలాంటి అనుమానాలు కూడా ఉండకూడదు’ అని ఆయన అన్నారు. తన ప్రశ్నకు సరైన సమాధానం రాలేదని తివారీ పట్టుబట్టడంతో స్పీకర్‌ ఓం బిర్లా జోక్యం చేసుకుని భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియపై ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయని తెలిపారు. ఇంత పెద్ద దేశంలో ఇంత మంచి వ్యవస్థ పని చేయడం తాము చూడలేదని ప్రజలు అంటున్నారని, ఈ వ్యవస్థను అందరూ మెచ్చుకోవాలని అన్నారు. కేంద్ర మంత్రి రిజిజు మాట్లాడుతూ ‘గరిష్ఠ ఓటింగ్‌, ఆరోగ్యకరమైన వ్యవస్థను కోరుకుంటున్నాం. భారతదేశ ఎన్నికల వ్యవస్థ ప్రపంచంలోనే అత్యుత్తమ వ్యవస్థ’ అని అభివర్ణించారు. అయితే దేశంలో నిర్బంధ ఓటింగ్‌ను అమలు చేసేందుకు ఎలాంటి చట్టాన్ని రూపొందించే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో లేదని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జైళ్లలో ఉన్నవారు కోర్టుల పరిధిలో ఉన్నందున వారిని ఓట్లు వేయమని ప్రభుత్వం కూడా ఒత్తిడి చేయదని ఆయన అన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img