Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

అధిష్ఠానంతో మాట్లాడిన తర్వాతే…

కేబినెట్‌ విస్తరణపై సీఎం బొమ్మై
బెంగళూరు: కర్ణాటక వ్యవహారాలపై పార్టీ పెద్దలతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రత్యేకంగా సమావేశమవుతారని, ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రాష్ట్ర కేనెబిట్‌ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణపై దిల్లీలో నిర్ణయం తీసుకున్న తర్వాత తనను పిలుస్తారని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సోమవారం చెప్పారు. నడ్డా ఆదివారం విజయనగర జిల్లా హాస్పెట్‌లో జరిగిన బీజేపీ కార్యవర్గ సమావేశానికి హాజరయ్యారు. సోమవారం హింపీలోని అనేక దేవాలయాలు, ప్రపంచ వారసత్వ సంపద గల ప్రాంతాలు, పురావస్తుశాఖకు సంబంధించిన ప్రదేశాలలో పర్యటించారు. ‘దిల్లీ వెళ్లిన తర్వాత ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత మీకు సమాచారం ఇస్తాను, అప్పుడు మీరు దిల్లీకి రండి’ అని నడ్డా చెప్పినట్లు బొమ్మై విలేకరులకు చెప్పారు. కేబినెట్‌ విస్తరణా లేక పునర్వ్యవస్థీకరణ ఉంటుందా అని విలేకరులు అడుగగా అధిష్ఠానంతో సమావేశం తర్వాత నిర్ణయం ఉంటుందని సీఎం తెలిపారు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే కేబినెట్‌ విస్తరణ లేదా పునర్వ్యవస్థీకరణకు సంబంధించి ముఖ్యమంత్రిపై ఒత్తిడి పెరిగింది. గుజరాత్‌ తరహా కేబినెట్‌ త్వరగా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు కొంతమంది శాసనసభ్యులు భావిస్తున్నారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కేబినెట్‌లోకి అందరినీ కొత్తవారిని తీసుకోవాలని వారు కోరుతున్నారు. ముఖ్యమంత్రి సహా కర్ణాటకలో ఇప్పుడు 29 మంది మంత్రులు ఉన్నారు. అవినీతి ఆరోపణలపై మంత్రి కేఎస్‌ ఈశ్వరప్పను ఇటీవల కేబినెట్‌ నుంచి తొలగించారు. వాస్తవంగా రాష్ట్రానికి 34 మంది మంత్రులు ఉండటానికి అవకాశం ఉంది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున కేబినెట్‌ విస్తరణ ఇప్పుడు సీఎం బొమ్మైకి కత్తిమీద సామే. మరోసారి కర్ణాటకలో అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ ఆరాటపడుతుంది. 225 అసెంబ్లీ సీట్లకుగాను 150 గెలుచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img