Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఐక్యంగానే ముందుకు…

మోదీ ప్రభుత్వ వినాశకర విధానాలపై పోరు ఉధృతం
ఆర్‌ఎస్‌ఎస్‌`బీజేపీకి భిన్నమైన అజెండాకు డి.రాజా సూచన
సీపీఐ 24వ జాతీయ మహాసభ ముసాయిదా రాజకీయ తీర్మానం విడుదల

విపక్షాలకు సీపీఐ పిలుపు

న్యూదిల్లీ : ‘దేశంలో ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాల ఐక్యతకు వామపక్షాలు చొరవ చూపాలి. ఆర్థికంగా, సామాజికంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏదైతే సాధించాలని అనుకుంటుందో అందుకు పూర్తి భిన్నమైన అజెండా సీపీఐ, ప్రతిపక్షానికి ఉండాలి’ అని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా అన్నారు. అక్టోబరు 1418 తేదీల్లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో జరగబోయే పార్టీ 24వ మహాసభలో ప్రవేశపెట్టే రాజకీయ ముసాయిదా తీర్మానాన్ని శుక్రవారం ఆయన ఇక్కడ విలేకరుల సమావేశంలో విడుదల చేశారు. విలేకరుల సమావేశంలో పార్టీ జాతీయ కార్యదర్శులు వినయ్‌ విశ్వం, అమర్‌జిత్‌ కౌర్‌ కూడా పాల్గొన్నారు. ముసాయిదా తీర్మానంలో జాతీయ స్థాయిలో విపక్ష ఐక్యతకు పిలుపునిచ్చారు. అన్ని పార్టీలను ఏకతాటిపైకి తేవడంలో వామపక్షాల పాత్ర కీలకమని అన్నారు. రాజకీయ పార్టీలు, సామాజిక, ప్రజా సంఘాలతో విస్తృత ఐక్యత లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. రాజ్యాంగ పరిరక్షణకు, ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ వినాశకర, విషపూరిత విధానాలకు వ్యతిరేకంగా ఐక్యపోరాటాన్ని ఉధృతం చేయాలన్నారు. దేశం, దేశ ప్రజల ప్రయోజనాల పరిరక్షణలో వామపక్షాల పాత్రపై సీపీఐ స్పష్టమైన విజన్‌తో ఉందని డి.రాజా చెప్పారు. కమ్యూనిస్టు ఉద్యమం ఏకీకరణ, తద్వారా రాజకీయాల్లో వామపక్షాల బలమైన, స్వతంత్ర మూలస్తంభం ఏర్పాటు అవసరమన్నారు. భూమి లేకపోవడం, వలసలు పెరగడం, గృహాలు లేకపోవడం, నిరుద్యోగం సంక్షోభస్థాయికి చేరడం వంటివి సవాళ్లుగా మారాయని, అంతర్జాతీయ ఆకలి సూచీలో భారత్‌ స్థాయి దిగజారిందని, ఇదంతా మోదీ హయాంలో జరిగిందని విమర్శించారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రజారోగ్యం, విద్య, భూమి, ఇల్లు, ఉపాధి, ఆహార భద్రత అంశాలను ప్రాథమిక డిమాండ్లుగా మన అజెండాలో ఉండాలన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం విస్తరించడం వల్ల మరోమారు శ్రామిక వర్గంపై తీవ్ర ప్రభావం పడుతోందని అన్నారు. కోవిడ్‌ విజృంభణ క్రమంలో పని విధానంలో మార్పులు వచ్చాయని గుర్తుచేశారు. తరగతి, కులం, పితృస్వామ్యం, మహిళల పట్ల ద్వేషభావం వంటివాటికి వ్యతిరేకంగా పోరాడాలని, అప్పుడే సామాజిక విముక్తి, ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ ఓటమి దిశగా ముందుకు వెళ్లగలమని డి.రాజా చెప్పారు. స్థూల ఆర్థిక ప్రాధాన్యతలను పునర్నిర్మించడం, పేదరిక నిర్మూలన, ఆర్థిక వ్యవస్థ నిర్మాణాన్ని సరిదిద్దడం, ఉపాధిని సృష్టించడం, సామాజిక రంగంపై దృష్టి పెట్టడం వంటివాటితో ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యక్రమాన్ని భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) ప్రతిపాదించింది. యావత్‌ ప్రపంచం సామ్రాజ్యవాద, పెట్టుడివర్గ దాడులను ఎదుర్కొంటున్న తరుణంలో సీపీఐ 24వ జాతీయ మహాసభ జరుగుతోంది. కోవిడ్‌ సంక్షోభం వల్ల ఉపాధి లేక లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 90శాతం మంది పిల్లల విద్యాభాస్యానికి అంతరాయం కలిగింది. కార్పొరేట్‌ ఫార్మా సంస్థలు లాభపడ్డాయి. తొమ్మిది మంది కొత్త బిలియనీర్లలో ఫార్మా దిగ్గజాలు ఉన్నారు. పక్కదేశాలైన నేపాల్‌, పాకిస్తాన్‌, శ్రీలంక తరహాలోనే మన దేశంలోనూ ఆర్థిక సంక్షోభాలతో అస్థిరత నెలకొనే పరిస్థితి దాపురించింది. కార్మికశక్తిలో 25శాతం తగ్గుదల నమోదు అయింది. ప్రజల వెతలు పెరిగాయి. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హిందూత్వ దేశం ఏర్పాటు దిశగా చకాచకా అడుగులు పడ్డాయి. వివాదాస్పద సాగు చట్టాలు, ఇటీవల అగ్నిపథ్‌ పథకం వంటివి ప్రజాగ్రహానికి కారణమవుతున్నాయి. దళితులు, మైనారిటీలపై దాడులు, మతహింస పేట్రేగిపోతున్న పరిస్థితుల దృష్ట్యా దేశం, ప్రజలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణకు వామపక్షాలతో పాటు ప్రతిపక్షాలు, సామాజికప్రజా సంఘాలు ఏకం కావాల్సిందేనని ముసాయిదా రాజకీయ తీర్మానంలో సీపీఐ పిలుపునిచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img