Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్‌మెడల్‌ ఇవ్వాలి

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఎద్దేవా

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఎంపీ గోరంట్ల మాధవ్‌ న్యూడ్‌ వీడియో వ్యవహారంపై ‘కొండను తవ్వి ఎలుకనుపట్టిన చందంగా వ్యవహరించిన అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్పకు గోల్డ్‌ మెడల్‌ ఇవ్వాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ గురువారం ఒక ప్రకటనలో ఎద్దేవా చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్‌ ‘న్యూడ్‌ వీడియో’ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడంతో దేశ వ్యాప్తంగా చర్చ జరిగిందన్నారు. పార్లమెంట్‌లో సైతం ఆంధ్రప్రదేశ్‌ పరువు మంటగలిపే విధంగా ఆ వీడియో వైరల్‌ అయ్యిందని, దీనిపై వెంటనే స్పందించిన రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని, ఫోరెన్సిక్‌ నివేదిక ప్రకారం చర్యలు తీసుకుంటామని ప్రకటించారని గుర్తుచేశారు. ఎంపీ గోరంట్ల అది మార్ఫింగ్‌ వీడియో అని, పోలీసులకు ఫిర్యాదు చేశానని చెప్పారన్నారు. అనంతరం రాష్ట్ర హోంశాఖ మంత్రి కూడా ఫోరెన్సిక్‌ ల్యాబ్‌ నివేదిక ప్రకారం చర్యలుంటాయని ప్రకటించారు. ఈనెల 10వ తేదీన హఠాత్తుగా అనంతపురం జిల్లా ఎస్పీ ఫకీరప్ప ఒరిజినల్‌ వీడియో లేదని, ఆ వీడియో ఫేక్‌ లేదా ఎడిటెడ్‌ అని మాట్లాడాన్ని ఆ ప్రకటనలో తప్పుపట్టారు. గోరంట్ల తాను ఫిర్యాదు చేశానని చెబుతుండగా, ఎస్పీ మాత్రం ఎవ్వరూ ఫిర్యాదు చేయలేదని దాట వేయడం తగదన్నారు. హోంమంత్రి ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపామని చెబుతుండగా, ఎస్పీ అసలు వీడియో లేదని చెబుతున్నారని పేర్కొన్నారు. అసలు ఎంపీ గోరంట్ల వీడియో ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా, ఎస్పీ పకీరప్ప అది ఫేక్‌ అని ఏ విధంగా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. వాస్తవాలను కనిపెట్టకుండా నోటి ప్రకటనలు చేసిన ఎస్పీ పకీరప్పకు గోల్డ్‌మెడల్‌ ఇవ్వాలని, లోక్‌సభ స్పీకర్‌ దృష్టికి కూడా వెళ్లిన వీడియో వ్యవహారంపై అనంతపురం జిల్లా ఎస్పీ స్పందించిన తీరు సరికాదన్నారు. దీనిపై సీఎం జగన్‌ ఇప్పటికైనా ఆ వీడియో వ్యవహారంపై స్పందించాలని, నిజానిజాల నిగ్గు తేల్చాలని డిమాండ్‌ చేశారు. అందుకు కారకులైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని కోరారు.
అనంతపురం ఎస్పీ తపన, ఆరాటం హాస్యాస్పదం: వర్ల రామయ్య
ఎంపీ గోరంట్ల మాధవ్‌ను బూతు భాగోతం నుంచి రక్షించేందుకు అనంతపురం జిల్లా పోలీసు అధికారి ఫక్కీరప్ప పడిన తపన, ఆరాటం, ఆతృత హాస్యాస్పదమని టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు వర్ల రామయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఒక ఎంపీగా తాను చేయకూడని పని చేశారనీ, మసిపూసి మారేడుకాయ చేయాలని చూశారని విమర్శించారు. గోరంట్ల మాధవ్‌ తీరును రెండు రాష్ట్రాలు దుమ్మెత్తిపోస్తున్నాయని, ఎస్పీ ఫకీరప్ప తమకు ఎవరూ గోరంట్లపై ఫిర్యాదు చేయలేదనడమేంటని విమర్శించారు. పార్లమెంట్‌ సైతం ఎంపీ మాధవ్‌ విషయాన్ని సీరియస్‌గా పరిగణించాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img