Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

టమాట రైతులకు మిగిలింది కన్నీరే!

అనంతపురం మార్కెట్‌లో కిలో రూ.2

రవాణా ఖర్చులు కూడా రాని వైనం
వ్యాపారుల మాయాజాలం
పంట రోడ్లపై పారబోసి… సాగుదారుల నిరసన
ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌

విశాలాంధ్రబ్యూరో – అనంతపురం: ఒక పక్క మార్కెట్‌ లో మిర్చి ధర ఘాటెక్కింది… పత్తి ధర కూడా పైపైకిపోతోంది. అయితే ప్రజలంతా నిత్యం వినియోగించే టమాట మాత్రం రైతులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని అనేక మండలాల్లో ఈసారి ఎక్కువ విస్తీర్ణంలో టమాట పంట సాగు చేయగా దిగుబడి కూడా అమాంతం పెరిగింది. అయితే ధర మాత్రం పాతాళానికి పడిపోయింది. మార్కెట్‌లో టమాట ధర కిలో రెండు రూపాయలే పలకడంతో అవాక్కయిన రైతులు…రోడ్ల వెంబడి పారబోసి, పశువులకు మేతగా వేసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. వందల టన్నుల టమాటాలను రైతులు మార్కెట్టు దగ్గర కుప్పలుగా పోశారు. రవాణా ఖర్చు విపరీతంగా పెరగడంతో దూర ప్రాంతాలల్లోని మార్కెట్‌కు సరుకు తరలించలేక పోతున్నారు. కంబదూరు మండలం నుండి రెండు మినీ ట్రక్కుల్లో హైదరాబాద్‌ మార్కెట్‌కు టమాటాలను పంపితే…బండి బాడుగ రూ.18000 అయిందని, సరుకు కొన్నవారు రూ.12000 ఇచ్చి పంపారని రైతులు చెబుతున్నారు. గత మూడేళ్ల నుంచి ధరల స్థిరీకరణ అనేది లేదు, రెండు సంవత్సరాలుగా వ్యవసాయ పనులు రెట్టింపు అయ్యాయి. గతంలో టమాటా నారు వంద మొక్కలకు రూ.60 ఉండగా ఇప్పుడు రూ.100. గతంలో దుక్కి చేయడానికి, గట్లు చేయడానికి ఎకరాకు రూ.1200 వ్యయం వచ్చేది. ఇప్పుడు రూ.3వేలు. రవాణా, టోల్‌ చార్జీలు, కూలీల రేట్లు విపరీతంగా పెరిగాయి. ఏ పంట ఎక్కడెక్కడ పండిస్తున్నారో తెలిపే నాథుడే లేడు. వ్యవసాయ అధికారులు గణాంకాలు పూర్తిగా మరచి పోయారు. వ్యవసాయం జూదంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని రాప్తాడు, కల్యాణదుర్గం, కంబదూరు, ఆత్మకూరు, బత్తలపల్లె మండలాలతో పాటు పక్కనే ఉన్న కూడేరు, గార్లదిన్నె, సింగనమల, కదిరి, హిందూపురం ప్రాంతంలోని గ్రామాల్లో చాలా మంది రైతులు టమాటాను సాగు చేస్తున్నారు. నిత్యం టమాట, పచ్చిమిర్చిని వేకువ జామున చిన్న వాహనాల్లో అనంతపురం బహిరంగ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తుంటారు. అయితే టమాటాకు వస్తున్న ధర రైతులకు ఏమాత్రం గిట్టుబాటు లేక రైతులు లబోదిబోమంటున్నా పట్టించుకొనే దిక్కేలేదు. దీంతో టమాటా రైతుల బాధలను గుర్తించిన సీపీఐ, టీడీపీ నాయకులు టమాటా మార్కెట్ల వద్ద నిరసనలు, ఆందోళనలు చేపట్టారు. టమాటా రైతులను అడుకోవాలని, ధరలు పడిపోకుండా చూడాలని సీపీఐ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. గురువారం కూడా టమాట పెద్ద మొత్తంలో మార్కెట్‌ కు రావడంతో వ్యాపారులు సిండికేట్‌గా మారిపోయారు. దీంతో టమాట ధర ఒకే సారి కిలో రెండు రూపాయలకు పడిపోయింది. 35 కిలోల క్యారెట్‌ ధర 80 నుంచి 100 రూపాయల వరకు పలికింది. నిన్న, మొన్నటి వరకు క్యారెట్‌ ధర రూ.200 నుంచి రూ.300 పలకగా, ఏకంగా సగానికి పైగా ధర తగ్గించేశారని క్యారెట్‌ రైతులు సైతం దిగాలు పడుతున్నారు. పంటకు పెట్టిన పెట్టుబడులు, రవాణా చార్జీలు కూడా రాని పరిస్థితి రావడంతో రైతులు… వ్యాపారులకు అమ్మే బదులు రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో కష్టాలు పడి టమాటా సాగు చేస్తే మార్కెట్లో వ్యాపారులు మాయజాలం ప్రదర్శించడం సరికాదని వాపోతున్నారు. రైతు నిర్ణయించాల్సిన ధరను వ్యాపారులు నిర్ణయం తీసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తాం అని చెప్పిన రాజకీయ పెద్దలు, ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి పట్టించుకోకుండా ఆజాదికా అమృత్‌ మహోత్సవాల పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారంటూ ప్రభుత్వ తీరుపై టమాటా రైతులు మండిపడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img