Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదం: సీజేఐ ఎన్వీ రమణ

న్యాయవ్యవస్థపై విశ్వాసం కోల్పోతే ప్రజాస్వామ్య మనుగడకే ప్రమాదమని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ అన్నారు. న్యాయ వ్యవస్థను పరిష్ట పరిచే కార్యక్రమాల్లో ప్రభుత్వాల భాగస్వామ్యం తప్పనిసరని స్పష్టం చేశారు. విజయవాడలో నూతనంగా నిర్మించిన సిటీ సివిల్‌ కోర్ట్స్‌ ప్రాంగణాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, సీఎం వైఎస్‌ జగన్‌, హైకోర్టు ఛీఫ్‌ జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా ఇవాళ ఉమ్మడిగా ప్రారంభించారు. సుప్రీంకోర్టు సీజేగా త్వరలో రిటైర్‌ కాబోతున్న ఎన్వీ రమణ ఈ కార్యక్రమంలో పాల్గొంటుండటంతో ఈ కార్యక్రమానికి ప్రాధాన్యం ఏర్పడిరది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్ర విభజన తర్వాత పూర్తి కావాల్సిన ఈ కోర్ట్స్‌ కాంప్లెక్స్‌ అనేక సమస్యల కారణంగా పూర్తి కాలేదని, కానీ ప్రభుత్వాల్ని, అధికారుల్ని వెంటపడి తాను దీన్ని పూర్తి చేయించాల్సి వచ్చిందన్నారు. చివరికి భవన నిర్మాణం పూర్తయిందన్నారు. ఈ భవనాన్ని ఉపయోగించుకుని ప్రజలకు సత్వర న్యాయం చేయాల్సిన బాధ్యత న్యాయమూర్తులపై ఉందన్నారు. న్యాయమూర్తుల ఖాళీల భర్తీని అజెండాగా పెట్టుకుని తాను ఇప్పటికే చాలా ప్రయత్నాలు చేశానన్నారు. బెంగాల్‌, ఏపీ, తమిళనాడు వంటి ముఖ్యమంత్రులు కోర్టుల భవనాల నిర్మాణానికి సాయం చేయడంపై ధన్యవాదాలు తెలిపారు.
న్యాయవ్యవస్ధపై విశ్వాసం ఉంచాలన్న సీజేఐ రమణ
న్యాయవ్యవస్ధపై విశ్వాసం కాపాడేందుకు న్యాయవాదులు ప్రయత్నించాలని జస్టిస్‌ సీజే రమణ కోరారు. న్యాయవ్యవస్ధపై ప్రజల్లో విశ్వాసం పోతే ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదన్నారు. అందుకే దాన్ని కాపాడేందుకు అందరూ ప్రయత్నించాలని రమణ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జస్టిస్‌ అయ్యపురెడ్డి దగ్గర తన ప్రాక్టీస్‌ చేసిన రోజుల్ని గుర్తు చేసుకున్నారు. సమాజం మీవైపు చూస్తోంది. సమాజంలో మార్పు కోసం సీనియర్‌ న్యాయవాదులు ప్రయత్నించాలని ఎన్వీ రమణ కోరారు. జూనియర్‌ న్యాయవాదుల్ని వారు తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో రిటైర్‌ కాబోతున్నానని, ఇక్కడి బార్‌ అసోసియేషన్‌ లో తనకు సహకరించిన ప్రతీ ఒక్కరిదీ రమణ కృతజ్ఞతలు తెలిపారు. తన ఉన్నతికి, విజయానికీ మీరే కారణమంటూ ధన్యవాదాలు తెలిపారు. విభజన తర్వాత వెనుకబడ్డామన్న ఆవేదన ఇక్కడి ప్రజల్లో ఉందని, అందరూ కష్టపడి పనిచేసి ఈ రాష్ట్రాన్ని దేశంలోనే అభ్యుదయ రాష్ట్రంగా తీర్చిదిద్దుతారన్న ఆశ తనకు ఉందన్నారు. కేంద్రం కూడా ఇందుకు సహకరించారన్నారు. అన్ని కులాలు, మతాలు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పిస్తూ ఎంతోమంది న్యాయమూర్తుల్ని తాను నియమించానన్నారు. సీఎం జగన్‌ కూడా న్యాయవ్యవస్ధకు సహకరిస్తానని హామీ ఇచ్చారని, జగన్‌ సహకారం వల్లే బడ్డెట్‌ ఎక్కువైనా కోర్టు కాంప్లెక్స్‌ పూర్తయిందన్నారు. విశాఖలోనూ కోర్టు కాంప్లెక్స్‌ల నిర్మాణానికి సహకరించాలని జగన్ను కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img