Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

ముఖ్యమంత్రి జగన్ కు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధం

ఏలూరు:
రాష్ట్రంలో ప్రాంతాల మధ్య, ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్న ముఖ్యమంత్రి జగన్ కు రాజకీయ సమాధి కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ టి.డి.పి ఇంఛార్జి బడేటి చంటి విమర్శించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రజలను చైతన్యపరిచేందుకు ఆయన ప్రజా చైతన్యం పేరుతో చేపట్టిన పాదయాత్ర శనివారం స్థానిక 3వ డివిజన్ సత్యనారాయణ పేట రేవు లింగేశ్వర స్వామి గుడి వద్ద నుంచి ప్రారంభమైంది. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను వివరించటంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగడుతూ ముద్రించిన కరపత్రాలను బడేటి చంటి పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కులాలు, ప్రాంతాల ప్రాతిపదికన ప్రజలను చీల్చి రాజ్యాధికారాన్ని కొనసాగించాలని కుట్రలు పన్నిన ఎంతోమంది కాలగర్భంలో కలసిపోయారని హెచ్చరించారు. సంక్షేమం పేరిట ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు నిర్మిస్తానంటే ప్రజలు నమ్మరని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రాన్ని సమూలంగా దివాలా తీయించిన ఘనత జగన్ కే దక్కుతుందని బడేటి చంటి ఎద్దేవా చేశారు. దళితులను మోసం చేసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది వైసిపి ప్రభుత్వమేనని విమర్శించారు. ఎస్ సి కార్పొరేషన్ ను నిర్వీర్యం చేసి దళితులను నిలువునా మోసం చేసారని, ఏ ఒక్కరికి కూడా ఉపాధి అవకాశాలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధిని మరచిన ముఖ్యమంత్రి జగన్ తన వైఫల్యపాలనతో ప్రజల నెత్తిన పన్నుల భారం మోపారన్నారు. వైసిపి కి ఓటు వేసినందుకు జనం బాధపడుతున్నారని, సరైన బుద్ధి చెప్పేందుకు ఎన్నికలు ఎపుడొస్తాయా అని ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇంచార్జ్ అమరావతి అశోక్ , మామిళ్ళపల్లి పార్థసారధి,4వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జాల సుమతి ,మూడో డివిజన్ ఇన్చార్జి జాలా బాలాజీ ,చలపతి వెంకటరమణ,దాల్ త్రిమూర్తులు,పెద్దిరాజు,చలపతి వెంకటరమణ,మర్రి ఏసురత్నం , టి. వెంకటరమణ, పొందూరు శంకర్రావు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img