Friday, May 3, 2024
Friday, May 3, 2024

ఎర్ర కెరటం

ఎర్ర రంగు పులుముకున్న లక్ష వెలుతురు పిట్టలు ఒక్కసారిగా విజయవాడ మీద వాలిపోయాయి. బెజవాడ ఎర్ర సముద్రమైంది. భారత కమ్యూనిస్టు పార్టీ 24వ జాతీయ మహాసభల సందర్భంగా శుక్రవారం తొలిరోజున నిర్వహించిన భారీ ర్యాలీలో రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి జనం తరలివచ్చారు. పొరుగున ఉన్న తెలంగాణ నుంచి కూడా దాదాపు 15 జిల్లాల జనం కదిలివచ్చారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల నుంచే 120 బస్సుల్లో జనం కిక్కిరిసి వచ్చారు. ఏపీ, తెలంగాణ నుంచి ఆరు ప్రత్యేక రైళ్లలో వచ్చి విజయవాడను అరుణార్ణవం చేశారు. ఒడిశా, కర్ణాటక, తమిళనాడు నుంచి వచ్చిన వారూ ఈ మహాప్రదర్శనలో కలిసి నడిచారు. అనేక రాష్ట్రాల నుంచి జనం ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రదర్శన పొడవునా నినాదాలతో విజయవాడ నగరం హోరెత్తింది. మహాప్రదర్శనను చూడటానికి వచ్చిన జనం కూడా నినాదాలకు స్పందించి గొంతు కలపడంతో కమ్యూనిస్టు పార్టీ మీద అభిమానం ఉప్పొంగిన నూతనోత్సాహం రేకెత్తించింది. వయస్సుపైబడ్డ వారు సైతం మహోత్సాహంతో నృత్యాలు చేయడం యువతలో సత్తువ నింపింది. జనసేవాదళ్‌ కవాతు ప్రదర్శనను ఆకర్షణీయంగా మలిచింది. విజయవాడ నగరంలోని కమ్యూనిస్టు పార్టీ శ్రేణులంతా ఈ మహాప్రదర్శనలో భాగస్వాములయ్యారు. 117 మీటర్ల పొడవైన ఎర్ర జెండా ఈ ప్రదర్శనలో ప్రధాన ఆకర్షణ. దీనిని ఉమ్మడి విశాఖ జిల్లా కమ్యూనిస్టు పార్టీ శ్రేణులు పట్టుకొని నడిచాయి. ఆ తరువాత జరిగిన బహిరంగ సభ చివరిలో పాఠశాల విద్యార్థుల చలోరే…చలో చలో… కామ్రేడ్‌ నృత్య రూపం సభికులను ఆకర్షించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img