Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కార్పొరేట్‌ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలు ఉధృతం

సీపీఐ జాతీయ మహాసభల్లో తీర్మానం ఆమోదం

విశాలాంధ్ర బ్యూరో`గురుదాస్‌దాస్‌ గుప్తా నగర్‌, విజయవాడ: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్పొరేట్‌ అనుకూల, ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను ఉధృతం చేయాలని సీపీఐ జాతీయ మహాసభలు నిర్ణయించాయి. అన్ని వ్యవస్థలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నదని, ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అమ్మేస్తున్నదని విమర్శించింది. ఈ విధానాలు దేశ వినాశనానికి దారితీస్తాయని ఆందోళన వ్యక్తం చేసింది. సీపీఐ 24వ జాతీయ మహాసభలలో ఈ మేరకు ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించారు. ఈ తీర్మానాన్ని బ్యాంక్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ జాతీయ నాయకుడు సీహెచ్‌ వెంకటాచలం ప్రవేశపెట్టారు. దేశంలో సరళీకృత ఆర్థిక విధానాలు 1991లో ప్రారంభం కాగా అప్పటి నుంచే ప్రభుత్వరంగం దెబ్బతింటూ వస్తోంది. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధానాలతో పాటు ప్రమాదకర సంస్కరణలు చేస్తూ వాటిని అత్యంత పటిష్టవంతంగా అమలు జరుపుతూ దేశ వినాశనానికి కారణమవుతోందని తీర్మానం పేర్కొంది. 2016 నుండి జీడీపీ క్రమంగా క్షీణిస్తూ వస్తోంది. 2017 నుండి జీఎస్టీ విధిస్తూ ప్రజానీకంపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. కోవిడ్‌ కారణంగా విధించిన లాక్‌డౌన్‌ తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. కోట్లాదిమంది వలస కార్మికులు వందలాది మైళ్లు నడుచుకుంటూ ఇళ్లకు చేరాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రేక్షకపాత్ర పోషించిందని తీర్మానం విమర్శించింది. కరోనా కారణంగా దేశంలో 40 లక్షల మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేసిందని, అయితే కేంద్రప్రభుత్వం మాత్రం పది రెట్లు తగ్గించి లెక్కలు చూపిందని ఆక్షేపించింది. అతి ముఖ్యమైన ఆరోగ్యరంగానికి కేవలం రెండు శాతం నిధులు మాత్రమే కేటాయింపులు చేస్తున్నదని విమర్శించింది. బ్యాంకు రుణాల ఎగవేత పెద్దఎత్తున జరుగుతోందని, దాంతో బ్యాంకులు తీవ్ర నష్టాల్లోకి దిగజారిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రజాధనం దోపిడీకి ప్రభుత్వం అనుసంధానకర్తగా వ్యవహరిస్తుందని మండిపడిరది. పదిశాతం ప్రజల చేతుల్లో 57 శాతం సంపద కేంద్రీకృతమైందని, దాంతో అసమానతలు తీవ్రంగా పెరిగిపోతున్నాయని పేర్కొంది. దాదాపు 80శాతం మంది ప్రజానీకానికి వారి ఆదాయంలో తరుగుదల కనిపిస్తుండగా, 98మంది కుబేరులు మల్టీమిలీయనీర్లుగా మారారు. అదానీ, అంబానీల ఆదాయం విపరీతంగా పెరిగింది. 19 నుండి 28 సంవత్సరాల మధ్య యువతలో నిరుద్యోగం 34 శాతంగా నమోదైంది. అగ్నిపథ్‌ పథకం ద్వారా నిరుద్యోగ యువత తీవ్ర నిరాశకు గురవుతోంది. ఎయిర్‌ ఇండియా సంస్థను టాటాలకు అత్యంత తక్కువ ధరకు విక్రయించారని, బీపీసీఎల్‌, సీసీఐ, షిప్పింగ్‌ కార్పొరేషన్‌, బీఈఎంఎల్‌, నీలాచల్‌ ఇస్పాత్‌ నిగమ్‌, విమానాశ్రయాలు, ఓడరేవులను విక్రయాలకు పెడుతోంది. ఎల్‌ఐసీలో పెట్టుబడులను ఉపసంహరించుకుంటోంది. రెండు ప్రైవేటు రంగ బ్యాంకులను ప్రైవేటీకరిస్తోందని ఆ తీర్మానం విమర్శించింది. 41 ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలను కార్పొరేషన్లుగా మార్చి వాటి ప్రైవేటీకరణకు మార్గాలను సులభతరం చేసుకుంటోందని, రక్షణ రంగంలో కొన్ని విభాగాలను ప్రైవేటీకరిస్తోందని, ఇది దేశ భద్రతకు తీవ్ర ముప్పు కల్గించే అంశమని ఆందోళన వెలిబుచ్చింది. నిత్యావసర ధరలు ఆకాశన్నంటుతున్నాయని, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరుగుతోందని పేర్కొంది. వినాశనానికి దారితీస్తున్న ఆర్థిక విధానాలను తక్షణమే ఉపసంహరించు కోవాలని, పెట్టుబడుల ఉపసంహరణను వెనక్కి తీసుకోవాలని మహాసభ ఆ తీర్మానంలో డిమాండ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img