Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

10వ తరగతి పరీక్షలకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు

జిల్లాలో హాజరు కానున్న 29575 విద్యార్థులు
పరీక్షా కేంద్రాలు నో మొబైల్ జోన్
జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్

విశాలాంధ్ర – శ్రీకాకుళం : ఏప్రిల్ నెల 3 నుండి 18 వ తేదీ వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరిగేలా కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.నవీన్ ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో కలెక్టరెట్ సమావేశ మందిరంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 30 మండలాల్లో 149 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ పరీక్షలకు 28,855 మంది రెగ్యులర్ అభ్యర్ధులు, 720 ప్రైవేటు అభ్యర్ధులు మొత్తం 29,575 మంది హాజరుకానున్నారని తెలిపారు. ఉదయం 9.30 గంటల నుండి 12.30 గంటల వరకు పరీక్ష నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి కేంద్రం వద్ద 144 సెక్షన్ అమలు జరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. 7 ఫ్లైయింగ్ స్క్వాడ్లను తహాసిల్దార్ల ఆధ్వర్యంలో వేస్తున్నట్లు వివరించారు. ప్రశ్నాపత్రాలు డిఆర్ఓ కస్టోడియంలో ఉంటాయన్నారు.
పోలీస్ శాఖ బందోబస్త్ ఏర్పాట్లను పటిష్టంగా ఉండేలా చూడాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా శాంతి యుతంగా నిర్వహించాలన్నారు. స్పాట్ వాల్యుయేషన్ పూర్తి అయ్యేవరకు స్ట్రాంగ్ రూమ్ వద్ద పోలీస్ బందోబస్త్ ఉండాలన్నారు. ప్రతి కేంద్రం వద్ద తాగు నీటి సరఫరా ఉండాలని, వైద్య శాఖ వారు ప్రధమ చికిత్సా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, విద్యుత్ శాఖ నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. పరీక్షా సమయాలలో అభ్యర్ధులకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక బస్సులను నడపాలని ఆర్.టి.సి అధికారులకు ఆదేశించారు. అలాగే పరీక్షా కేంద్రాలు నో మొబైల్ జోన్ గా పరిగణించడం జరిగిందన్నారు.
ఈ సమావేశంలో జిల్లా విద్యా శాఖాధికారి పగడాలమ్మ , వైద్య ఆరోగ్య శాఖ అధికారిణి డా. బి. మీనాక్షి, ఎ.ఎస్.పి విఠలేశ్వరరావు, పరీక్షల అసిస్టెంట్ కమీషనర్ అలీఖాన్, ఆర్.టి.సి ఆర్.ఎం, ఎ. విజయకుమార్, విద్యుత్ శాఖ ఎస్.ఈ. డిప్యూటీ డి.ఈ.ఓలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img