Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కల్పలతారెడ్డీ… రాజీనామా ఏదీ ?

మేనిఫెస్టో బుట్టదాఖలు: వామపక్ష పార్టీల ఆగ్రహం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ‘ఉపాధ్యాయ లోకానికి కలగా మిగిలిన యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ను సాధించడం నా మొదటి ప్రాధాన్యత…దీనిని ఆర్నెళ్లలోపు సాధించకుంటే పదవికి రాజీనామా చేస్తాను…’ ఇది వైసీపీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి రెండేళ్ల క్రితం ఎన్నికల సమయంలో ఇచ్చిన వ్యక్తిగత హామీ. కల్పలతారెడ్డి ఎమ్మెల్సీగా ఎన్నికై మార్చి 31 నాటికి రెండేళ్లు పూర్తవుతుంది. దీని ఆధారంగా ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంది. దీంతోపాటు అనేక హామీలను ఎన్నికల ముందు ప్రకటించి, ఆ మొత్తం రెండేళ్లలోపు అమలు చేయకుంటే పదవిని తృణప్రాయంగా వదిలేస్తానని ఆమె ప్రచార కరపత్రం ద్వారా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం మహిళా ఉద్యోగులకు పిల్లల సంరక్షణ సెలవుగా రెండేళ్లు ఇస్తోందని, రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏడాది పాటు ఆ సెలవు వర్తించేలా కృషి చేస్తానని చెప్పారు. మహిళా ఉద్యోగులకు నెలసరి సమయంలో ఇప్పుడున్న ఐదు ప్రత్యేక సెలవులకు అదనంగా మరో ఐదు ప్రత్యేక క్యాజువల్‌ సెలవులు అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠశాల విద్య, ఉన్నత విద్య, సాంకేతిక విద్య, జూనియర్‌ కళాశాల విభాగాల్లోని అన్నిస్థాయి పోస్టుల భర్తీకి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వంచే నడుపుతున్న వివిధ రకాల సంక్షేమ వసతి గృహాల సమస్యల్ని పరిష్కరిస్తానని నమ్మబలికారు. ఎయిడెడ్‌ పాఠశాలల్లోని పోస్టుల భర్తీ, పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటానని, మున్సిపల్‌ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని చెప్పుకొచ్చారు. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావిస్తానని చెబుతూ వాటిని రెండేళ్లలోపు అమలు చేయకుంటే తాను రాజీనామా చేస్తానన్నారు. ఆమె ఇచ్చిన ప్రకారమే నిర్ణీత సమయానికి హామీలు అమలు చేయనందున తక్షణమే కల్పలతారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని సీపీఐ, సీపీఎం నేతలు డిమాండ్‌ చేస్తున్నారు.
శాసనమండలిలో ప్రస్తావన అంతంత మాత్రమే
తాను ఇచ్చిన హామీలను గాలికొదిలేసిన కల్పలతారెడ్డి…ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ మద్దతు ఉపాధ్యాయ, పట్టభద్రుల అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం చేయడం విమర్శలకు తావిస్తోంది. ఇప్పటివరకు జరిగిన శాసనమండలి సమావేశాల్లోనూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా తాను ఇచ్చిన హామీలపై గట్టిగా నిలదీసిన సందర్భాలు లేవు. కేవలం ప్రభుత్వానికి మద్దతుగా అరకొరగా ప్రశ్నించారు. సహచర ఉపాధ్యాయ, స్వతంత్ర, పట్టభద్రుల ఎమ్మెల్సీలు నిత్యం జీరో అవర్లోను, ప్రశ్నోత్తరాలలోనూ విద్యారంగ సమస్యలపైనా, ఉపాధ్యాయ సమస్యలపైనా నిరంతరం మాట్లాడారు. స్వతంత్ర ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల్ని లేవనెత్తి…వాటి పరిష్కారం దిశగా కృషి చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. యేటా జంబో డీఎస్సీ ఇస్తామన్న సీఎం జగన్‌ హామీని అమలు చేయాలంటూ మండలిలో పీడీఎఫ్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు చాలాసార్లు పట్టుపట్టగా, దానిపై కల్పలతారెడ్డి మౌనం వహించారు. వీటన్నింటినీ మరచిన కల్పలతారెడ్డి….ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయడం విడ్డూరంగా ఉంది.
వేతనాల జాప్యంపై ప్రశ్నించరేం?
ప్రతినెలా ఉద్యోగ, ఉపాధ్యాయుల వేతనాల జాప్యంపై పీడీఎఫ్‌, స్వతంత్ర ఎమ్మెల్సీలు ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పటికీ…కల్పలతారెడ్డి ఆ దిశగా కృషి చేయలేదు. వేతనాల కోసం రాష్ట్ర ప్రభుత్వంపై పెద్దగా ఒత్తిడి చేయలేదు. కల్పలతారెడ్డి భర్త ప్రతాప్‌రెడ్డి కడప ఆర్జేడీ(పాఠశాల విద్య)లో విధులు నిర్వహిస్తున్నారు.
ఆమెకు తోడుగా ప్రతాప్‌రెడ్డి వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల గెలుపు కోసం ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచుతూ, ప్రలోభాలకు గురిచేస్తూ ప్రచారం చేస్తున్న ఘటనలు వెలుగుచూశాయి. ఆర్జేడీపై ఎన్నికల సంఘానికి, గవర్నరుకు ఫిర్యాదులు వెళ్లాయి. అయినా వెనక్కి తగ్గకుండా వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ఆయన ముందుకుపోతున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు రాజీనామా చేయకుండా వైసీపీ అభ్యర్థుల విజయానికి ఎలా ప్రచారం చేస్తారని వామపక్ష పార్టీల నేతలు నిలదీస్తున్నారు. తక్షణమే కల్పలతారెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img