Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

ఇరకాటంలో జగన్‌

. విశాఖ ఉక్కు బిడ్డింగ్‌కు తెలంగాణ సర్కార్‌
. కేసీఆర్‌ నిర్ణయంతో దిమ్మెరపోయిన వైసీపీ ప్రభుత్వం
. ఆఘమేఘాలపై దిద్దుబాటు చర్యలకు యత్నాలు
. ప్రైవేటీకరణకు వ్యతిరేకమని మంత్రి అమర్నాథ్‌ ప్రకటన

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారం (రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌-ఆర్‌ఐఎన్‌ఎల్‌) ప్రైవేటుపరం కాకుండా అడ్డుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న కీలక నిర్ణయం ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డిని ఇరకాటంలో పడేసింది. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకమంటూ అసెంబ్లీలో మొక్కుబడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకున్న ఏపీ ప్రభుత్వం... అందుకోసం కనీస ప్రయత్నం చేయలేదు. తరచూ దిల్లీ వెళ్లి కలుస్తూ ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌షాలకు సీఎం జగన్‌ ఇచ్చే వినతిపత్రాల్లో సైతం విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశం ప్రస్తావనకు నోచుకోవడం లేదు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు ఆందోళన ప్రారంభించిన తొలిరోజుల్లో విశాఖ వెళ్లిన సీఎం జగన్‌... కర్మా గారానికి సంబంధించిన 7వేల ఎకరాల భూమిని విక్రయిస్తే దానిని ప్రైవేటుపరం కాకుండా కాపాడు కునే అవకాశం ఉందని కార్మికనేతలకు ఉచిత సలహా ఇచ్చారు. ఆ తర్వాత విశాఖ ఉక్కుపై కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకు నేందుకు ఎటువంటి ఒత్తిడి చేసే ప్రయత్నం చేయ లేదు. 2014 ఎన్నికల సందర్భంగా ఎక్కువమంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని ప్రగల్భాలు పలికిన సీఎం జగన్‌... 22 మంది ఎంపీలను గెలిపించినా ఆ వాగ్దానాన్ని అంతటితోనే మర్చిపోయారు. పైగా ఏపీకి అత్యంత కీలకమైన లాభాలతో నడుస్తున్న విశాఖ ఉక్కును కేంద్రం నిర్లజ్జగా ప్రైవేటీకరించే సాహసానికి ఒడిగట్టినా వైసీపీ ప్రభుత్వం పట్టించు కోలేదు. దీంతో విశాఖ ఉక్కు కర్మాగారం నిర్వహ ణకు మూలధనం/ముడి సరుకుల కోసం నిధులు ఇచ్చి, నిబంధనల మేరకు ఉక్కు ఉత్పత్తులను కొనేందుకు యాజమాన్యం నిర్వహిస్తున్న ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంటరెస్టు-ఈవోఐ) ప్రతిపాదనల బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న కీలక నిర్ణయం వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. బిడ్డింగ్‌ను దక్కించుకోగలిగితే ఇటు పాలనాపరంగా... అటు రాజకీయంగా బీజేపీకి గట్టి షాక్‌ ఇవ్వడంతోపాటు ప్రైవేటీకరణను అడ్డుకున్నామని తెలుగు రాష్ట్రాల్లోనే గాక దేశమంతా మైలేజీ వస్తుందని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ యోచన చేసినప్పటికీ, ఈ నిర్ణయం వైసీపీ ప్రభుత్వానికి భారీ షాక్‌ ఇచ్చింది. విశాఖ ఉక్కును ప్రైవేటీకరిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ యంలో వైసీపీ ప్రభుత్వ నిజస్వరూపం తేటతెల్ల మైంది. దీంతో ఆఘమేఘాలపై వైసీపీ అధిష్ఠానం దిద్దుబాటుకు చర్యలు చేపట్టింది. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్‌ మీడియా సమావేశం ఏర్పాటు చేసి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ అమ్మరాదన్నదే తమ విధానమని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వమే ప్లాంట్‌ను నడపాలన్నది వైసీపీ ప్రభుత్వ డిమాండ్‌గా పేర్కొన్నారు. ‘విశాఖ ఉక్కుఆంధ్రుల హక్కు’ సెంటిమెంట్‌ను కాపాడతామని, దానికోసం ఇప్పటికే ప్రభుత్వానికి మూడుసార్లు లేఖలు రాశామని, అసెంబ్లీలో సైతం తీర్మానం చేశామని చెపుతూ వైసీపీ ప్రభుత్వ విశ్వసనీయతను చాటే ప్రయత్నం చేశారు. మరోపక్క బీఆర్‌ఎస్‌ బిడ్‌ వేస్తున్నట్లు చెప్పే వన్నీ గాలి వార్తలేనని కొట్టిపారేశారు. తెలంగాణ ప్రభుత్వ అధికార ప్రకటన ఇప్పటివరకు తమ దృష్టికి రాలేదని చెప్పారు. అయినా బీఆర్‌ఎస్‌ వైఖరిలో స్పష్టత లేదని, ప్రైవేటీకరణ వద్దన్నవారు అదే ప్లాంట్‌ను ఎలా కొంటారని ప్రశ్నించారు. కేసీఆర్‌ నిర్ణయంతో ఏపీలోని విపక్షాలన్నీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. కేంద్రంతో వైసీపీ కుమ్మక్కవడం వల్లే విశాఖ కార్మికులు రెండేళ్లుగా ఆందోళన చేస్తున్నా టెండర్లు ఆహ్వానించే సాహసా నికి కేంద్రం ఒడిగట్టిందని వారు విమర్శించారు. మొత్తానికి తాజా పరిణామాలు వైసీపీ ప్రభుత్వాన్ని తీవ్ర ఇరకాటంలో పడేయడంతో ఈ గండం నుంచి బైటపడే మార్గాలను పాలక పెద్దలు అన్వేషిస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img