Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నిప్పుల కొలిమిలో ప్రపంచదేశాలు

అసాధారణ ఉష్ణోగ్రతలు, దీర్ఘకాలం కొనసాగుతున్న వడగాలులు, తీవ్రమైన వాతావరణ మార్పులతో ప్రపంచ మానవాళి, ప్రాణి కోటి నిప్పుల కొలిమిలో నివసించాల్సిన అగత్యం ఏర్పడుతున్నదని పర్యావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావరణ ప్రతికూల మార్పులతో ప్రతి వేసవిలో దేశాల గరిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. కార్చిచ్చులు, హరికేన్లు, వరదలు లాంటి విపత్తులతో అధిక ఆస్తి, ప్రాణ నష్టాలు నమోదు అవుతున్నప్పటికీ నేడు వాతావరణ ఉష్ణోగ్రతలు పెరగడం, వడగాడ్పులు వీచడంతో సకల ప్రాణికోటి ఉనికి ప్రమాదంలో పడనుందని తీవ్రంగా హెచ్చరిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాల ప్రకారం 20302050 మధ్య కాలంలో ప్రతికూల వాతావరణ మార్పులతో పోషకాహారలోపం, మలేరియా, డయేరియా, ఉష్ణోగ్రత ఒత్తిడుల కారణంగా అదనంగా 2.5 లక్షల మరణాలు నమోదు కావచ్చనే భయానక వార్తలను వెల్లడిస్తున్నారు. ‘‘వాతావరణ మార్పులపై ఐరాస అంతర్‌ ప్రభుత్వం బృందం’’ (ఐసిసి) నివేదిక ప్రకారం భారతదేశం, అమెరికా, స్పెయిన్‌ దేశాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పైపైకి పెరుగుతున్నాయి. వేసవి కాలంలో స్పెయిన్‌లో గరిష్ట ఉష్ణోగ్రతలు 47.2 డిగ్రీ సెంటిగ్రేడ్‌, భారత్‌లో 45.8 డిగ్రీలకు చేరడం, అమెరికాలో 40డిగ్రీలు తరుచుగా దాటడం సర్వసాధారణమైంది. ఉష్ణోగ్రతలతో పాటు వడగాడ్పులు తోడై ప్రజాజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆసియా దేశాల్లో వడగాడ్పులు, నీటి, తేమ సమస్యలతో రాజస్థాన్‌, గుజరాత్‌, యూపీ, దిల్లీ రాష్ట్రాల్లో గత 122 ఏండ్లలో ఎన్నడూ చూడని వడగాడ్పులను 2022, మార్చిలో చూసాం. 72 ఏళ్ళలో అత్యధికంగా 2022, ఏప్రిల్‌ 9న దిల్లీలో 42.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఏప్రిల్‌-1941లో దిల్లీలో 45.6 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదుకాగా రాజస్థాన్‌లో గరిష్టంగా 45.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అమెరికాలో వడగాలులతో ఏడాది సగటున 702 మంది మరణించగా, 2004-18 మధ్య కాలంలో 10,527 మంది వేడి గాలులకు మృతిచెందినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. 1880 నుంచి ప్రతి దశాబ్దకాలంలో భూ ఉష్ణోగ్రతలు 0.08 డిగ్రీలు పెరుగుతుండగా, గత నాలుగు దశాబ్దాల్లో సగటున 0.18 డిగ్రీలు పెరగడం ప్రమాదకర భవిష్యత్తును సూచిస్తున్నది. ప్రతి ఏట మార్చిజూన్‌ వరకు ఉష్ణోగ్రతలు, వడగాడ్పులు మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.
అతిచలి, అత్యధిక వేసవి ఉష్ణోగ్రతలు, కరువులు, కార్చిచ్చులు, తుఫాన్లు, వరదలు అసాధారణ వాతావరణ ప్రతికూల మార్పుల వల్ల జరుగుతున్నాయని నిర్థారణ అయ్యింది. భూతాపంతో ఆర్కిటిక్‌, అంటార్కిటిక్‌ ధృవాల్లో మంచుకరగడంతో సముద్రమట్టాలు క్రమంగా పెరుగుతూ తీరప్రాంతాలను సముద్ర నీరు ముంచనుందని ఐపిసిసి నివేదిక వివరిస్తున్నది. 1990-2019 కాలంలో మానవ ప్రేరేపిత గ్రీన్‌ హౌజ్‌ వాయువుల (కార్బన్‌ డై ఆక్సైడ్‌, ఓజోన్‌, హైడ్రో కార్బన్లు, నైట్రోజన్‌ ఆక్సైడ్లు, నీటి ఆవిరి) కారణంగా ఉష్ణోగ్రతలు 45 శాతం పెరుగుతున్నాయి. వీటిలో కార్బన్‌ డై ఆక్సైడ్‌ ప్రభావంతో 36 శాతం హరిత గృహ ప్రభావం పెరిగిందని తెలుస్తున్నది. హరిత గృహ వాయువులు పెరగడంతో ఉష్ణోగ్రతలు అధికం కావడంతోపాటు వాతావరణం, నేల, సముద్ర జలాలు ప్రతికూల మార్పులకు లోనవు తున్నాయి. 2030 నాటికి భూతాపంతో మొక్కజొన్న లాంటి ధాన్య దిగుబడులు 24శాతం తగ్గే అవకాశం ఉందని అంచనా. ఆఫ్రికాలోని సొమాలియా, ఇథియోపియా లాంటి దేశాల్లో అత్యంత పొడి గాలులతో అసాధారణ వాతావరణం నెలకొంటున్నట్లు తేలింది.
ఐపిసిసి హెచ్చరిక ప్రకారం శిలాజ ఇంధనాల విచక్షణా రహిత వినియోగం, మానవ ప్రమేయ పర్యావరణ కాలుష్యాలతో వాతావరణ ప్రతికూల మార్పులతో తీవ్ర వడగాలులు వీస్తున్నాయి. స్విట్జర్లాండ్‌ లోని పిజోల్‌ మంచుకొండలు హరితగృహ వాయువులతో 2006 నుంచి ఇప్పటివరకు 80 శాతం కరిగాయని, రానున్న దశాబ్దాల్లో 90 శాతంవరకు కరిగిపోవడంతో 2100వరకు సముద్రమట్టం 2 మీటర్లు పెరిగి 63కోట్ల ప్రజలు తమనేలను కోల్పోయే ప్రమాదం ఏర్పడ నుంది. ప్రపంచదేశాలు గ్రీన్‌హౌజ్‌ వాయువులను నియంత్రించక పోతే ప్రపంచ మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఐపిసిసి హెచ్చరిస్తున్నది. భూతాపం ఇలాగే పెరిగితే రానున్న దశాబ్దాల్లో మానవ ఆవాసాలు, గ్రామాలు, వ్యవసాయ క్షేత్రాలు, నగరాలు సముద్ర జలాలతో నిండనున్నాయని, నైజీరియా లాంటి కొన్ని దేశాలు తమ తీరప్రాంత రాజధానులను కోల్పోనున్నా యని తెలుస్తున్నది. ప్రపంచ కార్బన్‌ ఉద్గారాల్లో 30 శాతం చైనా బొగ్గు ఆధార పవర్‌ కేంద్రాలు కలిగిస్తున్నాయి. 2060 నాటికి జీరో-కార్బన్‌ ఉద్గారాల దేశంగా చైనా, 2070నాటికి ఇండియాలు మారుస్తామని ప్రకటించాయి.
పారిస్‌ అగ్రిమెంట్‌ సిఫార్సు ప్రకారం 2050 నాటికి కర్బన ఉద్గారాలను తగ్గించాలని, లేనియెడల ప్రస్తుత కార్బన్‌ ఉద్గార రేటు ఇలాగే కొనసాగితే 2100 నాటికి ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు పెరుగుతాయని సూచిస్తున్నారు.
డా. బుర్ర మధుసూదన్‌ రెడ్డి, 9949700037

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img