Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

నెల్లూరు వైసీపీలో వర్గ పోరు

. విద్యార్థి విభాగ నాయకుడిపై హత్యాయత్నం
. చర్చనీయాంశంగా వరుస దాడులు
. వేడెక్కుతున్న రాజకీయాలు

విశాలాంధ్ర బ్యూరో-నెల్లూరు : నెల్లూరు వైసీపీలో వర్గ పోరు తారస్థాయికి చేరింది. మాజీ మంత్రి, వైసీపీ నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఆయన బాబాయి, నగర డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ వర్గాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. రూప్‌కుమార్‌ అనుచరుడు, వైసీపీ విద్యార్థి విభాగం నాయకుడు హాజీ అబ్దుల్‌పై శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నం చేయగా, అతనిని నెల్లూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్యం కోసం చేర్పించారని సమాచారం. అయితే దాడికి పాల్పడిరది ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ వర్గం వారేనని ఆరోపణలు ఉన్నాయి. దీంతో ఒక్క సారిగా రాజకీయాలు వేడెక్కాయి. గతంలో ఒక వైసీపీ కార్పొరేటర్‌ ఇంటిపై దాడి తదితర సంఘటనలకు వైసీపీలో వర్గ విభేదాలే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఇటువంటి వరుస సంఘటనలతో నెల్లూరు నగర రాజకీయాలు చర్చనీయాంశంగా మారాయి. కాగా, తన అనుచరుడు హాజీ అబ్దుల్‌పై దాడి విషయం తెలిసిన అనంతరం శనివారం ఉదయం డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ యాదవ్‌ ప్రభుత్వాస్పత్రికి వెళ్లి హాజీని పరామర్శించారు. అలాగే హాజీ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను సంప్రదించగా, అతని పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై శనివారం ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా, నగరంలో ఏ ప్రాంతంలోనైనా దాడులు జరిగితే అవన్నీ తమపై రుద్దుతూ బురద చల్లడం సరికాదన్నారు. నగరంలో ఇటీవల ఒక టీడీపీ నాయకుడి కాలు విరిగితే తానే బాధ్యుడి అని అనేక మంది ఆరోపించారని, అనంతరం దానిపై విచారణ జరిపితే వారి కుటుంబ కలహాలే కారణమని తేలిందని గుర్తు చేశారు. జిల్లాలో జరిగే ప్రతి సంఘటనను తనపై రుద్దడం ఏమిటని ప్రశ్నించారు. తాను ఇటువంటి దాడులకు ఉసిగొల్పే వ్యక్తిని కాదని, తన రాజకీయాలు హుందాగా ఉంటాయన్నారు. తనపై పదే పదే అసత్య ఆరోపణలు చేసేవారి తాట తీస్తానని హెచ్చరించారు. కాగా వరుస దాడుల సంఘటనలపై రూప్‌కుమార్‌ మాట్లాడుతూ ఇటువంటి సంఘటన జరగడం దురదృష్టకరమని అన్నారు. రానున్న ఎన్నికల్లో మరల సీఎంగా జగన్‌మోహన్‌ రెడ్డి గెలుపొందాలని కోరుకుంటున్న హాజీపై దాడి చేయడం సరికాదని తెలిపారు. ఈ నేపథ్యంలో బాబాయి, అబ్బాయి మధ్య జరుగుతున్న ఈ బేధాభిప్రాయాల పోరాటంతో నగరంలో వైసీపీకి తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి కనిపిస్తోందని ఆ పార్టీ జిల్లా నాయకులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. నిన్నమొన్నటి వరకు ఇద్దరు నాయకులు నగరంలో ఒకే కార్యాలయం ఉండగా, ఇటీవల ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ కార్యాలయానికి కూత వేటు దూరంలోనే డిప్యూటీ మేయర్‌ రూప్‌కుమార్‌ మరొక కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్నారు. రూప్‌కుమార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో ఎమ్మెల్యే పర్యటిస్తూ, రూప్‌కుమార్‌కు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని ఆయన వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇటీవల ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి నెల్లూరు జిల్లా కావలి పర్యటనలో ఈ ఇద్దరి నాయకులను ప్రత్యేకంగా పిలిచి కలిసి పని చేయాలని, పార్టీ ప్రతిష్ఠకు భంగం వాటిల్లే విధంగా ప్రవర్తించవద్దని హెచ్చరించినప్పటికీ శుక్రవారం రాత్రి రెండు వర్గాల వారు పరస్పరం దాడులకు దిగారు. దీనిపై వైసీపీ జిల్లా నాయకత్వం, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాలి. ఏదేమైనప్పటికీ, బాబాయి, అబ్బాయి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే విధంగా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img