Friday, April 26, 2024
Friday, April 26, 2024

యుగపురుషుడు ఎన్టీఆర్‌

పేదల కష్టాలు తెలిసిన నేత
ఘనంగా శతజయంతి వేడుకలు
హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు

విశాలాంధ్ర`హైదరాబాద్‌ : రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారనీ, పేదల కష్టాలు తెలిసిన నిజమైన నాయకుడని వక్తలు కొనియాడారు. సామాజిక న్యాయం కోసం తపించేవారనీ, ఆయన్ను అందుకే అందరూ యుగపురుషుడు అంటారని చెప్పారు. ఎన్టీఆర్‌ అందరి అభిమాన నటుడనీ, అటువంటి మహానటుడికి భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. తెలుగు దేశం పార్టీ స్థాపించి ఎన్టీఆర్‌ ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారనీ, కళకు, భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారన్నారు. ఆయనను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు మూలస్తంభంగా పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్‌) శత జయంతి వేడుకలు హైదరాబాద్‌లోని కైత్లాపూర్‌ మైదానంలో శనివారం ఘనంగా జరిగాయి. పది ఎకరాల్లో సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనపై రచించిన ‘ఎన్టీఆర్‌ శకపురుషుడు’ పుస్తకాన్ని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ ఆవిష్కరించారు. సీపీఐ, సీపీఎం ప్రధాన కార్యదర్శులు డి.రాజా, సీతారాం ఏచూరి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాట్లాడుతూ రాజకీయాల్లో ఎన్టీఆర్‌ తనదైన ముద్ర వేశారని కొనియాడారు.‘‘ పేదల కష్టాలు తెలిసిన నిజమైన నాయకుడు ఎన్టీఆర్‌. సామాజిక న్యాయం కోసం తపించేవారు. ఆయన్ను అందుకే అందరూ యుగపురుషుడు అంటారు. గొప్ప నటుడిని స్మరించుకోవడం ఆనందంగా ఉంది. నటనలో ఎన్టీఆర్‌ ఆయనకు ఆయనే సాటి. గొప్ప నటనతో ప్రజల మనసులు దోచుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంస్కరణలు తెచ్చిన నాయకుడు. ఎన్టీఆర్‌ చాలా సున్నిత మనస్తత్వం కలిగిన నాయకుడు. రాజకీయ నేతగా ఆయనది ప్రత్యేకశైలి.. ముందు చూపు ఉన్న నేత. ప్రాంతీయ పార్టీలకు గౌరవం, గుర్తింపు తెచ్చిన ఘనత ఎన్టీఆర్‌దే’’ అని అన్నారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మాట్లాడుతూ, దేవుడి పేరు తలచుకుంటే ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారని అన్నారు. ‘‘మోహన్‌ కందా మా మేనమామ.. ఆయన ఎన్టీఆర్‌ గురించి ఎన్నో విషయాలు చెప్పేవారు. ఎన్టీఆర్‌ ప్రభుత్వాన్ని ఇందిరాగాంధీ నిరంకుశంగా రద్దు చేసింది. రాష్ట్రపతి ముందు 153 మంది ఎమ్మెల్యేలతో పరేడ్‌ చేయించడం నాకు బాగా గుర్తు. చిన్నప్పటి నుంచి దేవుడు ఎలా ఉంటాడు అని గుర్తు చేసుకుంటే ఎన్టీఆర్‌ గుర్తుకు వస్తారు. రాజ్యాంగం హక్కుల్ని కాపాడేందుకు ఎన్టీఆర్‌ చివరి వరకు కృషి చేశారు’’ అని ఏచూరి అన్నారు.దత్తాత్రేయ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ శతజయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. సినీ రంగానికి ఎనలేని సేవ చేశారని, నీతికి, నిజాయితీకి, క్రమశిక్షణకు మారు పేరు ఎన్టీఆర్‌ అని కొనియాడారు.‘‘ రాజకీయాల్లో ఎంతో క్రమశిక్షణ తెచ్చిన నాయకుడు. పటేల్‌ పట్వారీ వ్యవస్థను రద్దు చేసిన నాయకుడు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దిల్లీకి తెలుగుదనం గురించి చాటిచెప్పిన నేత ఎన్టీఆర్‌. రాజకీయాల్లో మచ్చలేని నాయకుడు. రాజకీయాల్లో భేదాభిప్రాయం ఉండొచ్చుకానీ, శత్రుత్వం పనికిరాదు’’ అని దత్తాత్రేయ అన్నారు.
నటుడు మురళీ మోహన్‌ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ అందరి అభిమాన నటుడు. తెలుగువారు ఉన్న ప్రతిచోట ఆయన శత జయంతి జరుగుతున్నది’ అని అన్నారు. తనను ఎన్టీఆర్‌ తమ్ముడిగా పిలిచేవారని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వకపోవడం బాధాకరమని, కేంద్రం ఎన్టీఆర్‌కు భారతరత్న ప్రకటించాలన్నారు. ఎన్టీఆర్‌తో కలిసి ఎన్నో సినిమాల్లో నటించానని, ఆయన నుంచి క్రమశిక్షణను నేర్చుకున్నానని, చివరి చిత్రంలోనూ ఆయనతో కలిసి నటించే అవకాశం లభించిందని నటి జయసుధ తెలిపారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘తెలుగు చలన చిత్ర పరిశ్రమకు ఎన్టీఆర్‌ మూలస్తంభం. ఆయన అందం, క్రమశిక్షణ, వాక్చాతుర్యం అందరికీ తెలుసు. రాముడు, కృష్ణుడు అంటే నాకు గుర్తుకువచ్చేది ఆయనే. ఎన్టీఆర్‌ గురించి తాతయ్య గౌరవంగా మాట్లాడేవారు. వాళ్ల స్నేహం గురించి విని స్ఫూర్తి పొందాను. తెలుగు దేశం పార్టీ స్థాపించి.. ప్రజల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కళకు, భాషకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చారు’ అని అన్నారు.
హీరో వెంకటేశ్‌ మాట్లాడుతూ ‘ఎన్టీఆర్‌ సినీ పరిశ్రమకు చేసిన సేవ గురించి మాట్లాడాలి అంటే అర్హత ఉండాలి. శత జయంతి వేడుకల్లో ఆ మహనీయుడిని తలచుకునే అదృష్టం రావడం గొప్ప విషయం. భౌతికంగా మన మధ్యలేక పోయినా ఆయన ప్రజల గుండెల్లో ఉన్నారు. నాది తెలుగు భాష అని చెప్పినప్పుడు ఉండే గర్వం పేరే ఎన్టీఆర్‌. ఒక జాతి కథే ఆయన చరిత్ర. ఆయనతో నటించలేకపోవడం బాధాకరం’ అని అన్నారు. నటుడు అడవి శేషు మాట్లాడుతూ ‘నేను చూసిన మొదటి తెలుగు సినిమా ‘మిస్సమ్మ’. ఆ సినిమా చూసి నటుడిని కావాలనుకున్నా. ఎన్టీఆర్‌ సినిమాలు స్ఫూర్తిదాయకం’ అని తెలిపారు. కార్యక్రమంలో బాలకృష్ణ, పురందేశ్వరి, భువనేశ్వరి, లోకేశ్వరి, వసుంధర, బ్రహ్మాణి, దేవాన్ష్‌తోపాటు సినీ ప్రముఖులు రామ్‌ చరణ్‌, బాబు మోహన్‌, విజయేంద్ర ప్రసాద్‌, అల్లు అరవింద్‌, అశ్వినీదత్‌, ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, అనిల్‌ రావిపూడి, శ్రీలీలతోపాటు కన్నడ నటుడు శివరాజ్‌కుమార్‌, నాగచైతన్య, సుమంత్‌, సిద్ధు జొన్నలగడ్డ, అడివిశేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img