Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

చేసిన పని ఒక్కటే….?..కోట్ల నిధులు స్వాహా….?

విశాలాంధ్ర -చాట్రాయి: ఒక్క పని చేసి వేరు వేరు పేర్లతో కోట్లాది రూపాయల నిధులు స్వాహా చేస్తున్న ఘటనలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. పనులు మాత్రంఁ ఎక్కడ వేసిన గొంగళి అక్కడేఁ అన్న చందంగా ఉందని పలువురు అంటున్నారు. మండలంలో వైసిపికి కంచుకోట అయిన బూరుగూడెం గ్రామంలో ముఖ్యమంత్రి జగన్ మౌలిక సదుపాయాల కల్పన నిమిత్తం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని పూర్తి స్థాయిలో డ్రైనేజీ నిర్మాణం కోసం రూ.2కోట్ల 70లక్షల అంచనాలతో డిసెంబర్ 27 2019న శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. ఆ పనులను నియోజకవర్గం లోనే ప్రముఖుల ఆధ్వర్యంలో జరుగుతాయని ప్రచారం చేశారు. కాలం గడిచినా పనులు ప్రారంభించకపోవడం వలన ప్రభుత్వం ఆ పనులను నిలిపివేసిందని కొంతకాలం ప్రచారం చేశారు. ఆ తర్వాత కొన్ని పనులు జరిగాయి. కొత్తూరు రామాలయం వద్ద నుంచి బొడ్డు రాయి వరకు డ్రైనేజీ నిర్మాణం చేశారు.దళిత వాడల్లో కొన్నిచోట్ల డ్రైనేజీ నిర్మించారు. అత్యధిక శాతం డ్రైనేజీ నేటికి నిర్మాణం కానేలేదు. ప్రధాన రహదారులన్నీ మండు వేసవిలోనే నీటితో, బురదతో దర్శనమిస్తున్నాయి.ఇధి ఇలా వుండగా 450 మీటర్ల డ్రైనేజీ నిర్మించి రకరకాల పేర్లు తో మండల పరిషత్తు, ఎన్ఆర్ఈజీఎస్,15 వ ఆర్థిక సంఘం నిధులు, జలజీవన్ నిధులు ఎంత మేరకు అవకాశం ఉంటే అంత మేరకు పెద్ద ఎత్తున నిధులు మార్చుతున్నట్లు తెలుస్తోంది. 2019లో మంజూరైన నిధుల దగ్గర నుండి నేటి వరకు ఎన్ని రూపాలలో ఎక్కడెక్కడ ఎంత మార్చారో కూడా ఎవరికీ తెలియకుండా ప్రజా ప్రతినిధులు వ్యూహాత్మకంగా పావులు కదిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.అప్పట్లో పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ అధికారి ఒకరు ఇన్చార్జి బాధ్యతలలో వున్నప్పుడు పెద్ద ఎత్తున ముడుపులు ముట్టజెప్పి
ఇబ్బడి ముబ్బడిగా అంచనాలు వేయించారని పలువురు అంటున్నారు. మండలంలో అతిపెద్ద గ్రామాల్లో సైతం ఎక్కడా ఇవ్వకుండా డ్రైనేజీకి పెద్ద మొత్తంలో బూరుగగూడెంలో నిధులు మంజూరు చేయడంలో ఆంతర్యం ఏమిటని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.దీనిపై మండలంలోనే అసంతృప్తి వుందని పలువురు అంటున్నారు.నిధులు మార్చుకున్నా పనులు చేయలేదని ఎక్కడ ఎక్కడ మురుగు అక్కడే దర్శనమిస్తుందని విమర్శలు ఎక్కు పెడుతున్నారు. గత మూడు నెలలు క్రితం బూరుగగూడెం డ్రైనేజీ నిర్మాణం కోసం విడుదలైన నిధులు వివరాలు తెలియజేయాలని కోరుతూ సమాచార హక్కు చట్టం లో అర్జీ పెట్టిన వారికి మండలం అధికారి కార్యాలయం నేటికీ సమాచారం ఇవ్వకపోవడం తో నిధులు స్వాహా జరుగుతున్నాయనే వాదనకు బలం చేకూరుతుందని పలువురు అంటున్నారు.జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని డ్రైనేజీ నిర్మాణం పూర్తి చేయించాలని పలువురు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img