Monday, May 6, 2024
Monday, May 6, 2024

సీఎం అమరావతి పర్యటనపై నిరసన

నల్లబెలూన్లు ఎగురవేసిన రైతులు

విశాలాంధ్ర – తుళ్లూరు : అమరావతిలో సీఎం జగన్‌ పర్యటనను నిరసిస్తూ అమరావతి రైతులు గ్రామాల్లో నల్ల రిబ్బన్లు ధరించి, నల్ల బెలూన్లు ఎగురవేశారు. అమరావతి పరిధిలో జరుగుతున్న శిబిరాల నుంచి రైతులు బయటకు రాకుండా పోలీసులను మోహరించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి వెంకటపాలెం ఇళ్ల పట్టాల పంపిణీ సభలో ప్రసంగం పూర్తవగానే అమరావతి రైతులు తుళ్లూరు శిబిరం వద్ద ఆందోళనకు దిగారు. రహదారిపైకి రాగా పోలీసులకు రైతులకు వాగ్వాదం జరిగింది. రైతులు రోడ్లపై బైఠాయించి నినాదాలు చేశారు. అదే రహదారి వైపు వివిధ మండలాల నుంచి తరలివచ్చిన లబ్ధిదారులతో కూడిన వందలాది బస్సులు సభ ముగించుకుని వస్తుండడంతో పోలీసులు ఆ వాహనాలను కొద్దిసేపు నిలిపివేశారు. అదే సమయంలో పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకరరావు కారు అటువైపు వెళుతుండగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతులు నినాదాలు చేశారు. లాం గ్రామానికి చెందిన వైసీపీ అభిమాని వెంకటపాలెం సభ నుంచి వెళుతూ తుళ్లూరు సెంటర్‌లో ఆగి జై జగన్‌ అంటూ నినాదాలు చేయడంతో ఆవేశంలో అమరావతి రైతులు అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. పోలీసులు అక్కడే ఉండడంతో అతన్ని వెంటనే అదుపులోకి తీసుకుని తుళ్లూరు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సభకు వచ్చిన బస్సులు వెళుతున్నంతసేపు రైతులు రహదారి పక్కనే ఉండి సీఎం గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img