Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

సీఎం పదవి దక్కలేదని బాధలేదు : నితిన్‌

గాంధీనగర్‌ : గుజరాత్‌ నూతన సీఎంగా భూపేంద్ర పటేల్‌ ప్రమాణస్వీకారానికి ముందుగా రాష్ట్ర బీజేపీలో నెంబర్‌ 2గా ఉన్న పార్టీ సీనియర్‌ నేత నితిన్‌ పటేల్‌ కన్నీళ్ల పర్యంతమయ్యారు. సీఎం పదవికి విజయ్‌ రూపానీ రాజీనామా చేయడంతో తదుపరి అవకాశం తనకే దక్కుతుందని భావించిన నితిన్‌ పటేల్‌ను పక్కన పెడుతూ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయంతో ఆయన తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. రూపానీ అనంతరం సీఎంగా నితిన్‌ పటేల్‌ పేరు విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. నితిన్‌ సీఎంగా పోస్టర్లు సైతం వెలిశాయి. శక్తివంతమైన పటీదార్‌ వర్గానికి చెందిన నితిన్‌ పటేల్‌ ఆ మేరకు తన అనుచరులకు ముందస్తుగానే సమాచారం ఇచ్చి భంగపడ్డారు. నూతన సీఎంగా భూపేంద్ర ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన్ను కలసిన మీడియాతో నితిన్‌ మాట్లాడుతూ సీఎంగా తనకు అవకాశం దక్కకపోవడంపై కలత చెందడం లేదని చెప్పుకొచ్చారు. తాను 18 ఏళ్లుగా బీజేపీలో పనిచేస్తున్నానని, ఇకపైనా పనిచేస్తూనే ఉంటానని వ్యాఖ్యానించారు. తనకు పదవులు లభించినా, లేకపోయినా పార్టీకి సేవ చేస్తూనే ఉంటానని కన్నీటి పర్యంతమయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నానని, ఓటర్ల మద్దతుతోనే ఈ స్థితికి చేరుకోగలిగానని చెప్పారు. అనేక ఒడిదుడుకులు చూశానని, ప్రజల హృదయాల్లో ఉన్నంత వరకూ తనను ఎవరూ బయటకు నెట్టలేరని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. బస్సు మిస్‌ అయిన వారు చాలామందే ఉన్నారని, ఈ పరిణామాలను అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పుకొచ్చారు. తనపై వస్తున్న ఊహాగానాల గురించి బాధపడటం లేదన్నారు. భూపేంద్ర పటేల్‌ తనకు మంచి స్నేహితుడని, నూతన సీఎంగా తన కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆహ్వానించారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img