Friday, April 26, 2024
Friday, April 26, 2024

ముక్కులో గడ్డకు కిమ్స్‌ సవీరలో అరుదైన చికిత్స

అరుదైన రైనోస్పోరిడియోసిస్‌ సమస్యకు ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స
విశాలాంధ్ర-అనంతపురం వైద్యం : తీరప్రాంతాల్లో.. ముఖ్యంగా నీళ్లలో ఎక్కువగా ఉండేవారికి రైనోస్పొరిడియోసిస్‌ అనే ఇన్ఫెక్షన్‌ వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటి ఇన్ఫెక్షన్‌తో ముక్కులో గడ్డ ఏర్పడి, ఊపిరి తీసుకోవడం కూడా కష్టమైన ఒక వ్యక్తికి అనంతపురంలోని కిమ్స్‌ సవీరా ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్‌ ఈఎన్‌టీ సర్జన్‌ డాక్టర్‌ రాఘవేంద్రరెడ్డి ఎండోస్కొపిక్‌ విధానంతో శస్త్రచికిత్స చేసి ఊరట కల్పించారు. ఆయన ఆ వివరాలను వెల్లడిరచారు. ‘‘అనంతపురం జిల్లా కంబదూరు మండలం అందెపల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌ అనే వ్యక్తి తనకు మూడేళ్లుగా ముక్కు పూడిపోయినట్లుగా ఉంటోందని (బ్లాక్‌ అవుతోందని) మా వద్దకు వచ్చాడు. అతడిని పరీక్షిస్తే ముక్కులో ఒక గడ్డ ఏర్పడినట్లు తెలిసింది. రోగి బాగా పేదవాడు కావడంతో ఆరోగ్యశ్రీ కిందే అతడిని చేర్చుకుని, శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించాం. ఎండోస్కొపిక్‌ విధానంలో అత్యంత జాగ్రత్తగా ఆ గడ్డను తొలగించి, దాన్ని హిస్టోపాథాలజీ పరీక్షకు పంపాం. అందులో ఇది అరుదైన రైనోస్పోరిడియోసిస్‌ అని తేలింది. సాధారణంగా ఇలాంటి ఫంగల్‌ ఇన్ఫెక్షన్లు తీరప్రాంతాల్లో ఉండేవారికి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. ఈత కొట్టేవారు, నీరు నిల్వ ఉండేచోట పనిచేసేవారు, తీరప్రాంతాల వారికి ఎక్కువగా వస్తుంది. పొలాల్లో నీళ్లలో పనిచేసేవారికి ఈ సూక్ష్మజీవి ముక్కు, కన్ను, గొంతు.. ఇలా ఎక్కడైనా గడ్డలను తయారుచేస్తుంది. కొన్నిసార్లు ఒకేచోట ఉండొచ్చు, కొన్నిసార్లు వేర్వేరు ప్రాంతాల్లోకి.. అంటే కాలు, చేతి ఎముకల్లోకి కూడా వెళ్లి గడ్డలను తయారుచేయొచ్చు. అరుదుగా మెదడులోకి కూడా వెళ్తుంది. ఈ రోగి కొన్నాళ్ల క్రితం అనంతపురానికి వచ్చారు. గతంలో కోస్టల్‌ ఏరియాలో ఈ ఇన్ఫెక్షన్‌ మొదలై ఉండాలి. అయితే ఆర్థిక పరిస్థితి కారణంగా ఆస్పత్రికి వెళ్లకపోవడంతో అది బాగా పెద్దదైంది. ఇక ఊపిరి అందని పరిస్థితి రావడంతో ఇప్పుడు కిమ్స్‌ సవీరా ఆస్పత్రికి వచ్చారు. ముక్కులో గడ్డ చూడగానే ఇది రైనోస్పోరిడియోసిస్‌ అయి ఉండొచ్చని ఊహించి, ఎండోస్కొపిక్‌ విధానంలో, మళ్లీ తిరిగి రాకుండా ఉండేలా మంచి పరికరాలను ఉపయోగించి విజయవంతంగా తీసేశాం. అనంతపురం, కర్నూలు ప్రాంతాల్లో గత 20 ఏళ్లలో ఎక్కడా ఇలాంటి సర్జరీ జరగలేదు. పైపెచ్చు, ఇలాంటి అరుదైన సమస్యకు ఆరోగ్యశ్రీలో శస్త్రచికిత్స చేయడం మరో ప్రత్యేకత. భవిష్యత్తులో ఇతనికి ఎలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మాత్రలు కూడా ఇచ్చాం’’ అని డాక్టర్‌ రాఘవేంద్రరెడ్డి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img