Friday, April 26, 2024
Friday, April 26, 2024

మురికినీరు పారుతున్నా అధికారులకు పట్టదా..?

సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్

విశాలాంధ్ర- రాప్తాడు : అనంతపురం రూరల్ మండలంలోని పంగల్ రోడ్డు సమీపంలో ఉన్న శిల్పా లేపాక్షి నగర్ లో గత మూడు నెలల నుండి మురికినీరు పారుతున్నా ఏ ఒక్క అధికారికీ పట్టకపోవడం అత్యంత దయనీయమని సీపీఐ జిల్లా కార్యదర్శి సి.జాఫర్ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం సీపీఐ నాయకులతో కలిసి లేపాక్షి నగర్ లోని వీధుల్లో పారుతున్న నీటిలో నడుస్తూ నిరసన తెలిపారు. అధిక వర్షాలు కురవడం వల్ల పై ప్రాంతాల నుండి వస్తున్న నీటి వల్ల పాములు, తేళ్లు సంచరిస్తున్నాయన్నారు. ఇళ్లలో నుండి బయటకి రావాలంటే మురికి నీరు దాటుకుని రావాల్సిందేనని…ఇదేనా వైసీపీ అభివృద్ధి అని ప్రశ్నించారు. గతంలో అధికారుల దృష్టికి తీసుకుపోయినా సమస్యను పరిష్కరించలేదంటే ఎంత నిర్లక్ష్యం వహిస్తున్నారో తెలుస్తోందని నిట్టూర్చారు. శిల్ప లేపాక్షి నగరలో డ్రైనేజీ వ్యవస్థను పునరావృతం చేయాలని డిమాండ్ చేశారు. అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ అనంతపురం-చెన్నై జాతీయ రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. గ్రామాలు, కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ట్రాఫిక్ స్తంభించడంతో ఇటుకలపల్లి సీఐ మోహన్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని సీపీఐ నాయకులను అరెస్టు చేసి రాప్తాడు పోలీసు స్టేషనుకు తరలించారు. ప్రజా సమస్యలపై పోరాడుతుంటే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం దుర్మార్గమని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి పద్మావతి, గిరిజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు, అనంతపురం రూరల్ రాప్తాడు మండల కార్యదర్శులు రమేష్, రవీంద్ర, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి సంతోష్ కుమార్ ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కుళ్లాయిస్వామి, వంశీ, నాయకులు ఎర్రపోతన్న, దేవ, లిఖిత్, అంజి, సిద్ధప్ప, రామంజినేయులు, రాముడు, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img