Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అందరికీ నేతన్న నేస్తం

కోత విధించవద్దని డిమాండు
రాష్ట్రవ్యాప్తంగా ఎమ్మెల్యేలకు వినతిపత్రాల అందజేత
రైతు భరోసా వంటి సాకులు వద్దు : జింకా చలపతి

చేనేత కార్మికుల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని, వైఎస్‌ఆర్‌ నేతన్న నేస్తం అందరికీ వర్తింప చేయాలని, చేనేత సొసైటీల వద్ద గల వస్త్రాలను ఆప్కో కొనుగోలు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం డిమాండు చేసింది. రైతు భరోసా తదితర సాకులు చూపి నేతన్నల ప్రయోజనాలను దెబ్బతీయొద్దని విజ్ఞప్తి చేసింది. సంక్షేమ పథకాల మాదిరిగానే నేతన్న నేస్తం సాయాన్ని నేరుగా లబ్ధిదారులకు అందించాలని విన్నవించింది. చేనేత కార్మికుల సమస్యల పరిష్కారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మికసంఘం రాష్ట్రసమితి పిలుపులో భాగంగా సంఘం నాయకులు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా శాసనసభ్యులకు వినతిపత్రాలు అంద జేశారు. నేత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని, సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళతామని ప్రజాప్రతినిధులు హామీఇచ్చారు.
విశాలాంధ్రధర్మవరం టౌన్‌ : అనంతపురం జిల్లా ధర్మవరం నియోజకవర్గ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామి రెడ్డికి ఏపీ చేనేత కార్మికసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింకా చలపతి నాయకత్వంలో నాయకుల బృందం వినతిపత్రం అందజేసింది. కార్మికుల సమస్యలను ఎమ్మెల్యేకు వివరించింది. అనంతరం జింకా చలపతి మాట్లాడుతూ మరమగ్గాల ఉత్పత్తుల నుండి వస్తున్న పోటీకి ధీటుగా చేనేత మగ్గాలను ఆధునీకరించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సొంతమగ్గం ఉన్న ప్రతి కుటుంబానికి ఏటా రూ.24వేలు ఇచ్చే నేతన్న నేస్తం పథకం తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల సిల్క్‌ సబ్సిడితో పాటు చేనేత రంగంలోని అన్ని సంక్షేమ పథకాలు నిలిపివేసిందన్నారు. రైతుభరోసా పేరుతో ఈ పథకం లబ్ధిదారులను కుదించడం అన్యాయమని, చేనేత కార్మికులను ఎంతగానో ఆందోళనకు గురిచేస్తోందని చెప్పారు. కరోనాతో చేనేత పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందని, 15 నెలలుగా చేతి నిండా పనిలేక కార్మిక కుటుంబాలు ఆకలితో అలమటిస్తున్నాయని చలపతి వివరించారు. అలాంటి కార్మికులను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలని డిమాండు చేశారు. చేనేత కార్మికుల ఆత్మహత్యలు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాని దేనన్నారు. నేతన్న నేస్తానికి ఇతర సంక్షేమ పథకాలతో ముడిపెట్టవద్దని, చేనేత ఉపవృత్తులు, నేత కార్మికులకు జీవనభృతిసాయం ఏటా రూ.24వేలు ఇవ్వాలని, ఉచిత కరెంట్‌ను 200 యూనిట్ల వరకు పెంచాలని డిమాండు చేశారు. ఇళ్లులేని కార్మికులకు ప్రభుత్వమే ఇళ్లు కట్టిం చాలని, లక్షరూపాయల వరకు ముద్రారుణం ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు వెంకట నారాయణ, శివశంకర, రామకృష్ణ, నాగార్జున, రమణ, నారాయణ స్వామి, శ్రీధర్‌, నాగరాజు పాల్గొన్నారు. ఆప్కో ద్వారా చేనేత వస్త్రాల కొనుగోలు : పిల్లలమర్రి విశాలాంధ్రమంగళగిరి : నేతన్న నేస్తం పథకం మగ్గాల షెడ్లలో నేత నేసేవారికి, ఉపవృత్తుల వారికి వర్తింపచేయాలని, ఆప్కో చేనేత వస్త్రాలను మాత్రమే కొనుగోలు చేయాలని డిమాండు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ చేనేత కార్మిక సంఘం నాయకులు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు. అనంతరం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిల్లలమర్రి నాగేశ్వరరావు మాట్లాడుతూ జీఎస్టీ నుంచి చేనేతను మినహాయించాలని కోరారు. సహకార సంఘాలలో పేరుకుపోయిన వస్త్రాలను కొనుగోలు చేయాలని, బోగస్‌ సొసైటీల పేరుతో అక్రమాలకు పాల్పడిన వారిపై చట్టపర చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు. కరోనా కష్టకాలంలో ప్రతి చేనేత కుటుంబానికి నెలకు రూ.10 వేలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. కరోనా వలన మరణించిన కుటుం బాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ప్రతి చేనేత కార్మిక కుటుంబానికి ముద్రా రుణాలు లక్ష వరకు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. మరమగ్గాల బట్టలు కొనుగోలు చేయాలన్న ఆప్కో నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఏపీ చేనేత కార్మిక సంఘం మంగళగిరి నియోజక వర్గ కార్యదర్శి బత్తురి మోహనరావు, ఏఐటీయూసీ పట్టణ కార్యదర్శి అన్నవరపు ప్రభాకర్‌, చేనేత నాయకులు దొడ్డి ఈశ్వరరావు, బత్తుల గిరి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img