Friday, April 26, 2024
Friday, April 26, 2024

అనంతపురంలో రూ.200 కోట్ల విలువైన సీఎస్‌ఐ స్థలాన్ని కాపాడండి

సీఎం జగన్‌కు రామకృష్ణ లేఖ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: అనంతపురంలో దాదాపు రూ.200 కోట్ల విలువగల మిస్సమ్మ కాంపౌండ్‌ (సీఎస్‌ఐ) స్థలాన్ని కబ్జాదారుల నుండి కాపాడేందుకు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ సీఎం జగన్‌కు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శుక్రవారం లేఖ రాశారు. అనంతపురం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి వెనుక భాగంలో చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా (సీఎస్‌ఐ)కి దాదాపు 200 కోట్ల విలువగల 7.67 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమిని సీఎస్‌ఐ నుండి కొనుగోలు చేశామంటూ మాజీ శాసనసభ్యులు బి. నారాయణరెడ్డి, గురునాథరెడ్డి, వారి సోదరులు ఎర్రిస్వామి రెడ్డి, రెడ్డప్పరెడ్డి ముందుకొచ్చారు. అక్కడ నివాసం ఉంటున్న పేదలను, విద్యాసంస్థలను ఖాళీ చేయించేందుకు 2007 నుండి విశ్వ ప్రయత్నం చేస్తూ దౌర్జన్యాలకు, దాడులకు తెగబడుతున్నారు.
లండన్‌కు చెందిన లూయిస్‌ క్రిస్‌ లిబ్‌ (మిస్సమ్మ) అనే మహిళ లండన్‌ మిషనరీ కార్పొరేషన్‌(ఎల్‌ఎంసీ) ప్రతినిధిగా ఉన్నారు. 1910లో అనంతపురం సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి వెనుక భాగంలోని భూమిని పేద విద్యార్థుల విద్య, వసతి గృహాల నిర్మాణం, సంక్షేమం కోసం, బలహీన వర్గాలకు వైద్య సేవలు కల్పించేందుకు స్థలం కేటాయిం చాలని అప్పటి కలెక్టర్‌కు అర్జీ పెట్టుకోగా, ఆమెకు 26 ఎకరాల 54 సెంట్లు మంజూరు చేశారు. ఆ భూమిని లండన్‌ మిషనరీ కార్పొరేషన్‌ పేరుపై అప్పటి జిల్లా అధికారులు మార్పు చేశారు. 1932లో మిస్సమ్మ తిరిగి లండన్‌ వెళ్లి… అనారోగ్యంతో అక్కడే మరణించింది. ఆ తర్వాత ఆయా ఆస్తులు చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా వారి పర్యవేక్షణలో ఉన్నాయి. 2007లో ఫోర్జరీ సంతకాలతో జనరల్‌ పవర్‌ ఆఫ్‌ అటార్నీ (జీపీఏ) పత్రాలు సృష్టించి, బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్‌ పేరుతో సీఎస్‌ఐ నుండి 7.67 ఎకరాలు కొన్నామని మాజీ శాసనసభ్యులు నారాయణరెడ్డి సోదరులు ప్రచారంలోకి తీసుకొచ్చారు. అందుకు అవసరమైన పత్రాలు సృష్టించారు. అక్కడ నుంచి ఖాళీ చేయాలని పేదలకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేసే ప్రయత్నం చేశారు. పేదవారి పక్షాన ప్రభుత్వ ఆస్తులను కాపాడటం కోసం అఖిలపక్ష కమిటీగా అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన ఆనాటి కలెక్టర్‌ శ్రీధర్‌తో చేత విచారణ చేయించి, ఇది క్రైస్తవ మైనారిటీ భూమి అయినందున ప్రభుత్వం నుండి ఎన్‌ఓసీ లేకుండా కొనడం చెల్లదని ఆ పత్రాలను సీజ్‌ చేశారు. 2009 సెప్టెంబర్‌ 2న రాజశేఖర్‌రెడ్డి ఆకస్మిక మరణాన్ని అనుకూలంగా మలచుకున్న బీఎన్‌ఆర్‌ సోదరులు తిరిగి దొంగ ఎన్‌వోసి సృష్టించి, రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. 2013లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌. కిరణ్‌కుమార్‌రెడ్డి చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా భూమిని పరిరక్షించడంలో భాగంగా మెడికల్‌ కళాశాల విస్తరణ కోసం మిస్సమ్మ స్థలాన్ని భూసేకరణ చట్టం ద్వారా కొనుగోలు చేయడానికి గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేశారు. ఈ ప్రక్రియ ముందుకు కొనసాగనీయకుండా బీయన్‌ఆర్‌ సోదరులు కోర్టులో న్యాయపరమైన చిక్కులు సృష్టించారు. 2015లో సీఎం చంద్రబాబు మిస్సమ్మ స్థల కబ్జాదారులు బీయన్‌ఆర్‌ సోదరులు సృష్టించిన నకిలీ పత్రాల వ్యవహారంపై, భూ కబ్జాలపై సీబీసీఐడీ విచారణకు అదేశించి, వారి అక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌కు తాము ఎలాంటి భూమి అమ్మలేదని చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా అనేక దఫాలుగా రాతపూర్వకంగా జిల్లా కలెక్టర్‌లకు లేఖలు రాయడమేగాక, వారి నకిలీ డాక్యుమెంట్‌ పత్రాలు రద్దు చేయాలని కోరుతూ ఇప్పుడు ఓఎస్‌ నెంబర్‌ 44/2023గా 4వ జిల్లా అదనపు కోర్టులో కేసు వేశారు. ప్రభుత్వ భూమిని కాపాడాలని స్థానికంగా నివసిస్తున్న వారు జిల్లా కోర్టుతో పాటు హైకోర్టులోనూ చాలా కేసులు వేశారు. అవి ప్రస్తుతం విచారణ దశలో ఉన్నాయి. అయినప్పటికీ లెక్కచేయకుండా 3 మాసాల నుండి ఎర్రిస్వామిరెడ్డి సోదరులు, వారి అను చరులు పోలీసుల అండదండలతో ఆ స్థలానికి ప్రహరీగోడ నిర్మాణం చేసేందుకు…అక్కడి పేదవారిపై దౌర్జన్యం చేస్తూ, ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తున్నారు. 16 ఏళ్ల నుండి ముగ్గురు ముఖ్యమంత్రులు ఆ భూమిని కాపాడేందుకు పటిష్ట చర్యలు తీసుకుని బీఎన్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ఆగడాలకు, అక్రమాలకు అడ్డుకట్ట వేయగా, 3 నెలల నుండి మరలా ఆ భూమిని చట్ట విరుద్ధంగా ఆక్రమించుకోవడానికి స్థానికంగా ఉండే ప్రజలపై, విద్యాసంస్థలపై దౌర్జన్యాలకు పాల్పడుతూ దాడులు చేస్తున్నారు. బీయన్‌ఆర్‌ సోదరులు సృష్టించిన నకిలీ రిజిస్ట్రేషన్‌ పత్రాలు రద్దు చేయాలని చర్చ్‌ ఆఫ్‌ సౌత్‌ ఇండియా వారు వేసిన కేసు పెండిరగ్‌లో ఉండగా బీఎన్‌ఆర్‌ సోదరులు దాడులకు తెగబడటం, పోలీసులు అందుకు సహకరించడం దుర్మార్గం. కోర్టు కేసు తుది తీర్పు వెలువడే వరకు ఆయా భూమిలో ఎలాంటి చట్టవిరుద్ధమైన అక్రమ కట్టడాలు జరపకుండా యధాతథ స్థితిని కొనసాగిం చేందుకు, స్థానిక పేదలకు, విద్యాసంస్థలకు రక్షణ కల్పించేందుకు రెవెన్యూ, పోలీసు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని రామకృష్ణ కోరారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img