Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

తెలుగురాష్ట్రాల్లోని పలు రైల్వేస్టేషన్లలో హైఅలర్ట్‌

అగ్నిపథ్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలు మూడో రోజు కొనసాగుతున్నాయి. క్రమంగా ఉత్తరాది నుంచి దక్షిణాదికి నిరసనలు పాకుతున్నాయి. బీహార్‌, తెలంగాణలో తాజాగా రైళ్లకు నిప్పంటించారు.
సికింద్రాబాద్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చినట్టే వచ్చి చేజారుతోంది. పోలీసులు కాల్పులు జరుపుతున్నా ఆందోళనకారులు వెనక్కు తగ్గడం లేదు. ఇక, రైల్వే స్టేషన్‌లో ఆందోళనకారులు విధ్వంసం సృష్టించి మూడు రైళ్లకు నిప్పంటించడంతో అక్కడ పరిస్థితి రణరంగంగా మారిపోయింది. దీంతో సికింద్రాబాద్‌ స్టేషన్‌వైపు వచ్చే రైళ్లను పూర్తిగా రద్దుచేశారు. 71 ప్యాసింజర్‌ రైళ్లు రద్దు కాగా.. మరికొన్ని దారి మళ్లించారు. మరో 44 ఎంఎంటీఎస్‌ సర్వీసులను నిలిపివేశారు. మరోవైపు, ముందు జాగ్రత్తగా నాంపలి రైల్వే స్టేషన్‌ను పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. నాంపల్లి స్టేషన్‌ను మూసివేసిన అధికారులు.. ప్రయాణికులెవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. సికింద్రాబాద్‌లో తీవ్ర ఉద్రిక్తతల ఏపీలో పలు రైల్వేస్టేషన్లలో హైఅలెర్ట్‌ ప్రకటించారు. ప్రధాన స్టేషన్లలో రైల్వే పోలీసులు భద్రత పెంచారు. రైల్వే పరిధిలోని ఆర్పీఎఫ్‌, జీఆర్పీ నుంచి అదనపు బలగాలను రప్పించారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లే పలు మార్గాలను పోలీసులు మూసి వేశారు. ముందు జాగ్రత్తగా ఈ చర్యలు తీసుకున్నారు. కాచిగూడ, విజయవాడ, వరంగల్‌, తిరుపతి, కడప, విశాఖపట్నం తదితర రైల్వేస్టేషన్లలో భద్రత పెంచారు. అదనపు బలగాలను మోహరించి పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. రైల్వే స్టేషన్‌ పరిసరాల్లో ఎవరూ గుమిగూడకుండా చర్యలు చేపట్టారు. గుంటూరు, నరసరావుపేట, బాపట్ల రైల్వేస్టేషన్లలో భద్రతను పెంచారు. ముందుజాగ్రత్తగా స్టేషన్ల వద్ద పోలీసులు మోహరించారు. తిరుపతి రైల్వేస్టేషన్‌ వద్ద రెండు ప్రవేశ ద్వారాలను మూసివేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img