Friday, April 26, 2024
Friday, April 26, 2024

మన్యం రహదారులు అధ్వాన్నం

పట్టించుకోని పాలకులు, అధికారులు
ప్రయాణికుల ఇక్కట్లు

చింతపల్లి (విశాఖ) : విశాఖ ఏజెన్సీలో రహదారులు మరింత అధ్వాన్నంగా మారాయి. వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమం అంటూ అభివృద్ధిని విస్మరించింది. రహదారుల దుస్థితిపై ప్రభుత్వం గానీ, ప్రజాప్రతినిధులు గానీ, అధికారులుగానీ దృష్టి సారించిన దాఖలాలు లేవు. మన్యంలో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. చింతపల్లి నుండి నర్సీపట్నం, పాడేరు, కృష్ణదేవిపేట, అంతర్రాష్ట్ర రహదారి అయిన సీలేరు…ఇలా అన్ని ప్రధాన రహదారులు దారుణంగా ఉన్నాయి. చింతపల్లి మండలంలో ఆంధ్ర కశ్మీర్‌గా పేరొందిన లంబసింగి మీదుగా నర్సీపట్నం వెళ్లే ప్రధాన రహదారి గతుకులమయంగా మారింది. వంతెన వద్ద గుంతలు ఏర్పడి వర్షాకాలంలో నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి. చింతపల్లి నుండి పాడేరు వెళ్లే ప్రధాన రహదారి బాగా దెబ్బతిన్నది. ఈ మార్గంలో కొత్తపల్లి జలపాతం ఉంది. దీనిని చూసేందుకు పర్యాటకులు అధిక సంఖ్యలో వస్తుంటారు. నర్సీపట్నం నుంచి చింతపల్లి మార్గం మీదుగా జల్లూరు మెట్ట, చిట్రలగొప్పు, రాజుపాకల, మడిగుంట, లోతుగెడ్డ జంక్షన్‌, చింతలూరు వంతెనలు గల ప్రాంతాలలో రహదారిపై గుంతలు ఏర్పడి వర్షపు నీటి భారీగా నిలిచింది. ప్రయాణికులు, వాహనచోదకులకు ప్రత్యక్ష నరకం కనిపిస్తోంది. ఈ రహదారి మీదుగా ప్రయాణం చేయాలంటే ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోవాల్సిందే. దారకొండ దారాలమ్మ తల్లిని దర్శించుకునేందుకు వెళ్లే రహ దారులను సైతం పాలకులు, అధికారులు పట్టించుకున్న దాఖ లాలు కనిపించడం లేదు. మన్యం రహదా రుల్లో ప్రయాణం చేయాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. ఎక్కడ ఏ ప్రమాదం సంభవిస్తుందో అనే భయం వ్యక్తమవుతోంది. ఆశ్చర్యమేమంటే ఈ రహదారుల మీదుగానే పాలకులు, ఉన్నతాధికారులు ప్రయాణాలు చేస్తున్నారు. అయినా వాటి అభివృద్ధికిపైగానీ, మరమ్మతుపై గానీ కనీస శ్రద్ధ కనిపించడం లేదు. కనీసం గుంతలు పూడ్చి ప్రమాదాలు నివారించాలన్న ఆలోచన కూడా పాలకులు, అధికారులకు రావడం లేదు. ప్రధాన రహదారులలో గుంతలకు తాత్కాలిక మరమ్మతులు చేయించి ప్రమాదాలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకోవాలని వాహనచోదకులు, ప్రయాణికులు, ఈ ప్రాంతవాసులు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img