Sunday, May 5, 2024
Sunday, May 5, 2024

బీజేపీపై వీడుతున్న భ్రమలు

నారాయణ విమర్శ
విశాలాంధ్ర`తిరుపతి : మోదీ సర్కారుపై ప్రజల్లో భ్రమలు తొలుగు తున్నాయని, ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు అందుకు అద్దం పడుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ చెప్పారు. ప్రధాని తనపై వ్యతిరేకతను చెరిపేసు కోవడానికే విదేశీ పర్యటనలు చేస్తున్నారని విమర్శించారు. తిరుపతిలోని గంధంనేని శివయ్య భవన్‌లో ఎస్‌.నాగరాజు అధ్యక్షతన శనివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ప్రభుత్వరంగ సంస్థలను కారుచౌకగా అదానీకి కట్టబెట్టడం, డీజిల్‌, పెట్రోల్‌ ధరలు విపరీతంగా పెంచడం, మూడు సాగుచట్టాలతో రైతాంగాన్ని తీవ్రంగా నష్టపరిచే చర్యల వల్ల మోదీకి వ్యతిరేక పవనాలు వీస్తు న్నాయని నారాయణ చెప్పారు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి విభజన రాజకీయాలు నడపడం ద్వారా ఎంతోకాలం పబ్బం గడుపుకో లేరని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా ప్రజల్లో చైతన్యం వస్తున్నదని, వచ్చే ఎన్నికల నాటికి విపక్షాలు బలమైన శక్తిగా మారి…మోదీని అధికారం నుంచి దింపడం ఖాయమన్నారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అవకాశవాద రాజకీయాలను ప్రోత్సహిస్తోందని, కేంద్రంతో గట్టిగా పోరాడేందుకు సిద్ధపడటం లేదని విమర్శించారు. రాజధాని విషయంలో, విశాఖ ఉక్కును కాపాడేందుకు, ప్రత్యేక హోదా సాధనలో సైతం రెండు నాలుకల ధోరణి కొనసాగిస్తున్నదన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పి.హరినాథ్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా నవంబరు నెలలోపు పార్టీ శాఖలు సమావేశం కావాలని, స్థానిక సమస్యలపై ఉద్యమాలకు సమాయత్తం కావాలని కోరారు. జిల్లా కార్యదర్శి రామానాయుడు పార్టీ కార్యక్రమాలను వివరించారు. జిల్లా కార్యవర్గ సభ్యులు టి.జనార్ధన్‌, చిన్నం పెంచలయ్య, నరసింహులు, జె.రామచంద్రయ్య, పి.మురళి, జనమాల గురవయ్య, యం.నదియ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img