Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

బెయిల్‌పై ఉన్న జగన్‌… ప్రజలకు భవిష్యత్తా?

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – తిరుపతి: బెయిల్‌ రద్దయితే ఏ జైలుకు వెళతాడో తెలియని జగన్‌ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు ఎలా అవుతారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ ఎద్దేవా చేశారు. జగన్‌ బెయిల్‌ రద్దయితే తమ భవిష్యత్తు ఏమిటో ముందుగా ఇళ్లకు స్టిక్కర్లు అతికిస్తున్న ఎమ్మెల్యేలు చూసుకోవాలని హితవు పలికారు. గురువారం తిరుపతి సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలో వ్యవసాయం, పరిశ్రమలు, ఐటీ, ఇరిగేషన్‌తోపాటు ఏ రంగంలోనూ అభివృద్ధి జరగలేదన్నారు. ఒక కొత్త పరిశ్రమను కూడా నెలకొల్పోలేదని రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రి బహిరంగ చర్చకు రావాలని సవాల్‌ విసిరారు. దేశంలో ఉద్యోగాలు రాని పట్టభద్రుల శాతం 17 శాతం ఉంటే ఆంధ్రప్రదేశ్‌లో 35% ఉన్నారన్నారు. ప్రతి ఇంటికి తాము ఎంతో చేశామని ప్రజలంతా 80% తమవైపే ఉన్నారని చెబుతున్న ముఖ్యమంత్రి… ప్రతిపక్షాలు ఏకమవుతున్నాయని పదేపదే చెప్పడం ఓటమి భయంతోనే అన్నారు. రాష్ట్రంలో విపక్షాలు అంతా ఒక్కటైతే మీకెందుకు? అని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని ప్రశ్నించారు. ఓటమి భయంతోనే పదే పదే విపక్షాలపై ఎదురు దాడి చేస్తున్నారన్నారు. రానున్న ఎన్నికలలో రాష్ట్రంలో వైసీపీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాలను ఓడిరచడమే ధ్యేయంగా విపక్షాలన్నీ కలిసి పనిచేస్తాయని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సీఎం జగన్మోహన్‌ రెడ్డి పనితీరు దొంగే, దొంగ అన్న ట్లుందని ఎద్దేవ చేశారు. వివేకా హత్యకేసు, కోడి కత్తి కేసులను పక్కదారి పట్టించేందుకే పరిపాలనంత సెప్టెంబర్‌ నుంచి విశాఖకు వెళ్లనున్నట్లు సిఎం ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. అయితే సెప్టెంబర్‌ దాకా ఎందుకని ఇప్పుడే ముఖ్యమంత్రి విశాఖలో క్యాంప్‌ కార్యాలయం పెట్టుకోవచ్చునని అయితే రాజధాని మాత్రం అమరావతే అన్నారు. కోర్టులన్నా, చట్టాలన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి లెక్కలేనితనంతో వ్యవహరిస్తున్నారన్నారు. విశాఖలో వైసీపీ నాయకులు రూ.40 వేల కోట్ల భూముల కుంభకోణానికి పాల్పడ్డారని రామకృష్ణ ఆరోపించారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ… జిల్లాలో కోట్లాది రూపాయల విలువైన భూములను వైసీపీ నాయకులు ఆక్రమిస్తున్నారన్నారు. ముత్యాల రెడ్డి పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎదురుగా ఉన్న భూములను ఎమ్మెల్యేలు, ఎంపీ, మంత్రులు, పోలీసులు సిండికేటయ్యి ఆక్రమించారని ఆరోపించారు. ప్రభుత్వ భూముల రక్షణ కోసం పోరాటాలు సాగిస్తూ అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. ఈ సమా వేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి మురళి, జిల్లా కార్యవర్గ సభ్యులు చిన్నం పెంచలయ్య, రాధాకృష్ణ,నగర కార్యదర్శి విశ్వనాథ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img