Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఇక సుప్రీంకోర్టే దిక్కు

నాలుగు రాష్ట్రాలకు గవర్నర్‌గా పనిచేసిన సత్యపాల్‌ మాలిక్‌ మచ్చలేని వాడు కాకపోవచ్చు. కానీ ‘‘ది వైర్‌’’ వెబ్‌ పోర్టల్‌లో ఆయన కరణ్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనేక విషయాలతోపాటు పుల్వామా సంఘటనకు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానిదే బాధ్యత అని చెప్పారు. ప్రధానమంత్రికి అవినీతి అంటే అంత ద్వేషం ఏమీలేదని కూడా చెప్పారు. రిలయన్స్‌కు మేలుచేస్తే తనకు 300 కోట్ల రూపాయలు లంచం ఇవ్వడానికి ఎర వేశారని కూడా అన్నారు. అదే సందర్భంలో చాలాకాలం ఆర్‌.ఎస్‌.ఎస్‌.లో పనిచేసి ప్రస్తుతం బీజేపీ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్‌ ఒక అక్రమం చేయించడానికి తన దగ్గరకు వచ్చారని కూడా చెప్పారు. సత్యపాల్‌ మాలిక్‌ పరిశుద్ధాత్ముడు అని చెప్పడానికి వీలులేక పోవచ్చు. ఆయన మాట జారిన సందర్భాలూ ఉండొచ్చు. కానీ కరణ్‌ థాపర్‌కు ఇంటర్వ్యూ ఇవ్వకముందే ఆయన దేశబంధు అనే యూట్యూబ్‌ చానల్‌కు చెందిన పత్రికా రచయిత ప్రశాంత్‌ టాండన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా ప్రధాన మంత్రి మోదీని, ప్రస్తుతం కేంద్రమంత్రి, ఇదివరకు హోంశాఖ మంత్రిగా ఉన్న రాజ్‌నాథ్‌సింగ్‌ను పుల్వామా ఘటనపై బోనులో నిలబెట్టారు. సి.ఆర్‌.పి. జవాన్లను తరలించడానికి కేంద్ర హోంశాఖ విమానాలు ఇవ్వనందువల్లే 40 మంది జవాన్లు నిష్కారణంగా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చింది. దీనికి పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సత్యపాల్‌ మాలిక్‌ చెప్పిన మాట సామాన్య మైందిగానో వెనుకా ముందూ చూసుకోకుండా మాట్లాడే ఆయన తత్వానికి సంబంధించిన వ్యవహారంగానో చూడలేం. ఇందులో రెండు ప్రధాన అంశాలు ఇమిడి ఉన్నాయి. ఒకటి దేశ భద్రత, రెండు పుల్వామా ఘటనను ప్రధానమంత్రి మోదీ బీజేపీ రాజకీయ ప్రయోజనాలకు వినియోగించుకున్న తీరు. సత్యపాల్‌ మాలిక్‌ పుల్వామా గురించి చెప్పిన మాటలను మాజీ సైనికాధిపతి శంకర్‌ రాయ్‌చౌదరి కూడా అంగీకరించారు. మాలిక్‌ వెల్లడిరచిన అంశాలను, వాటిని మాజీ సైన్యాధిపతి సమర్థించడంచూస్తే దేశభద్రతను పణంగా పెట్టి భావో ద్వేగాల ఆసరాగా బీజేపీ ఓట్లు దండుకున్నదని నిర్ధారించవచ్చు. కేంద్ర ప్రభుత్వ అసమర్థత లేదా పనిగట్టుకుని చేసిన పనివల్లే 40 మంది సి.ఆర్‌.పి. జవాన్లు బలికావలసి వచ్చిందన్న వాదనను తేలికగా తీసుకోవడం దేశ భక్తులం అన్న ముద్ర వేసుకు తిరిగే మోదీ భక్తులకు చెల్లుతుందేమో కానీ ఈ దేశవాసులు విస్మరించదగిన అంశం అయితే కాదు. సరిహద్దుకు దగ్గరగా ఉన్న రహదారిమీద రోడ్డుమార్గంలో 78 వాహనాల్లో వేలాదిమంది జవాన్లను తరలించడం దిగ్భ్రాంతికరం. జవాన్లను పేల్చేయడానికి 300 కిలోల ఆర్‌.ది.ఎక్స్‌ తో ఒక వాహనం దాదాపు పదిరోజులు యదేచ్ఛగా ఆ ప్రాంతంలో తిరిగింది. ఈ అంశాన్ని పసిగట్టకపోవడం గూఢచారశాఖ ఘోర వైఫల్యమే. అదీ కాక జవాన్లు వెళ్తున్న దారిని కలిపే ఇతర దారుల దగ్గర ఎలాంటి కాపలా లేదు. ఈ సంఘటన జరిగిన తరవాత కూడా ప్రధానమంత్రి మోదీ కనీసం ఆ సమయంలో కశ్మీర్‌ గవర్నరుగా ఉన్న మాలిక్‌కు కూడా అందుబాటులో లేరు. ఆ సమయంలో ఆయన డిస్కవరీ చానల్‌ కోసం ‘‘మాన్‌ వర్సెస్‌ వైల్ద్‌’’ డాక్యుమెంటరీ చిత్రీకరణ కోసం కార్బెట్‌ పార్కులో షూటింగ్‌లో ఉన్నారు. ఆ సమయంలో ఆయనకు ఫోన్‌ కూడా అందుబాటులో లేదని చెబుతున్నారు. ఇంతకన్నా కాకమ్మ కబుర్లు ఊహాతీతం. షూటింగ్‌ పూర్తి అయిన తరవాత మోదీ ఒక దాబా నుంచి సత్యపాల్‌ మాలిక్‌కు ఫోన్‌ చేశారని అంటున్నారు. ఈ మాటను నమ్మడానికి దేశమంతా వెర్రిలో కూరుకుపోలేదుగా! జవాన్లను తరలించడానికి విమానాలు ఇవ్వకపోవడం కేవలం నిర్లక్ష్యం అనుకోవడానికీ ఆస్కారం లేదు. బాధ్యతా రాహిత్యం అని కూడా సరిపెట్టుకోలేం. విమానాలు ఇవ్వక పోవడం ఎవరి ఆజ్ఞ ప్రకారం జరిగిందో తేలాల్సిందే. వారికి విమానాలు కావాలని తనకెవరూ చెప్పలేదని, చెప్పి ఉంటే సమకూర్చే వాడినని మాలిక్‌ అంటున్నారు. 

మాలిక్‌ బయటపెట్టిన అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం జారీ చేయాలని కాంగ్రెస్‌ సహా కొన్ని పార్టీలు కోరుతున్నాయి. మరో ఇద్దరు సైనికాధికారులు సైతం మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేసి ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. ఈ శ్వేత పత్రంలో జవాన్లకు విమానాలు ఇవ్వడానికి నిరాకరించడం, గూఢచారశాఖ వైఫల్యం, హోం మంత్రిత్వ శాఖ పాత్ర, జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ దోబాల్‌, చివరగా ప్రధానమంత్రి పాత్రపై వివరాలు తెలియజేయాలని ఈ సైనికాధికారులు కోరారు. మోదీ సర్కారు తత్వాన్నిబట్టి చూస్తే శ్వేతపత్రం విడుదల చేయడానికి అంగీకరించరు. ఈ ఇద్దరు మాజీ సైనికాధికారుల మీద బీజేపీ ప్రచార యంత్రాంగం ఇప్పటికే ‘‘జాతి వ్యతిరేకులు’’ అన్న ముద్ర వేసేసింది. వెన్నులో వణుకుపుట్టించే ఈ అంశాలు సత్యపాల్‌ మాలిక్‌ గత వారం వెల్లడిస్తే మోదీ ఆత్మరక్షణ కోసమైనా నోరు మెదపక పోవడానికి ఆయన నిస్సహాయత కారణంకాదు. ఏ ప్రధాన సంఘటన జరిగినా ఆయన మౌన ముద్రలోనే ఉంటారు. పుల్వామా లాంటి ఘోరకలిని కూడా తన వ్యక్తిగత ప్రతిష్ఠ పెంచుకోవడానికి, బీజేపీకి ఓట్ల పంట పండిరచడానికి బలాదూరుగా వినియోగించుకుంటారు.
మోదీ దృష్టిలో ప్రచారాన్ని మించిన ఆయుధం లేదు. ‘‘మన వైఫల్యం వల్లే పుల్వామా సంఘటన జరిగింది’’ అని సత్యపాల్‌ మాలిక్‌ చెప్తే ఈ విషయాన్ని ఇక మీదట ప్రస్తావించకూడదని మోదీ ఆదేశించారట. జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోబాల్‌ కూడా అదే మాట చెప్పారట. దోబాల్‌ మునుపటి కశ్మీర్‌ గవర్నర్‌కు సహాధ్యాయి కూడా. కరణ్‌ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాలిక్‌ మాట్లాడిన ఒక్కో మాట మోదీ కాపట్యాన్ని ఛిద్రం చేసేది కనకే ఆయన మాలిక్‌ నోరు మూయించారు. మాలిక్‌ చెప్పిన ప్రతి అంశం నిగ్గు తేలాల్సిందే. వాస్తవం తెలుసుకునే హక్కు ఈ దేశ ప్రజలకు ఉంది. దానికి శ్వేత పత్రం లాంటివి సరిపోవు. అయినా మోదీ అందుకు అంగీకరిస్తారనుకోవడం అమాయకత్వం. సంయుక్త పార్లమెంటరీ కమిటీ దర్యాప్తుకూడా వాస్తవం బైటపడడానికి ఉపయోగపడదు. అదానీ వ్యవహారాన్నే పార్లమెంటులో ప్రస్తావించనివ్వని అధికార పక్షం ఈ అంశాన్ని చర్చించడానికి ఎటూ అనుమతించదు. పైగా అధికార పక్షమే పార్లమెంటు కార్యకలాపాలకు అడ్డు తగిలే దుష్ట సంప్రదాయాన్ని బీజేపీ నిస్సిగ్గుగా అమలులోకి తెచ్చింది. మిగిలిన దిక్కల్లా సుప్రీంకోర్టే. అందుకే సుప్రీంకోర్టు పర్యవేక్షణలో ఈ మొత్తం వ్యవహారంపై దర్యాప్తు జరిపించడమే మార్గం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img