Friday, April 26, 2024
Friday, April 26, 2024

కేరళ గవర్నర్‌ వింత పోకడ

కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఇస్లామిక్‌ పండితుడు. ఇస్లాం మతంలో సంస్కరణలకోసం పాటుపడ్డ వారు. కేంద్ర మంత్రివర్గంలో ఇంధన శాఖ, పౌర విమానయాన శాఖలను నిర్వహించారు. విద్యార్థి సంఘ నాయకుడిగా రాజకీయ యాత్ర ప్రారంభించిన ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ భారతీయ క్రాంతి దళ్‌, కాంగ్రెస్‌, జనతా దళ్‌, బహుజన సమాజ్‌ పార్టీలను చుట్టబెట్టి చివరకు 2004లో బీజేపీలో చేరి పుణ్యస్నానం ఆచరించారు. 2019 సెప్టెంబర్‌ ఒకటిన కేరళ గవర్నరుగా బీజేపీ ప్రభుత్వం ఆయనను నియమించింది. కేరళలో వామపక్ష ప్రభుత్వం అధికారంలో ఉండడం, తనను నియమించింది బీజేపీ ప్రభుత్వం కనక ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ మొదటి నుంచీ రాజును మించిన రాజభక్తి ప్రదర్శిస్తూనే ఉన్నారు. వామపక్ష ప్రభుత్వ నిర్ణయాలకు అడ్డు చెప్పడమే ఆయన ప్రధాన వ్యాపకం అయిపోయింది. ఏదో ఒక వివాదం రేపకుండా ఆయనకు రోజే గడవడం లేదు. తాజాగా కేరళలోని తొమ్మిది విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లను రాజీనామా చేయాలని ఆదివారం హుకుం జారీ చేశారు. సోమవారం ఉదయం పదకొండున్నరకల్లా వైస్‌ చాన్సలర్లందరూ రాజీనామా చేయాల్సిందేనన్నారు. ఇంతకీ ఆ వైస్‌ చాన్సలర్లను నియమించింది ఆయనే అన్న వాస్తవాన్ని వాటంగా మరిచిపోయినట్టున్నారు. ఆ నియామకాలు సక్రమంగా జరగలేదని ఆయన ప్రస్తుత వాదన. ఒక వేళ ఆ నియామకాలు సక్రమంగా జరగకపోతే బాధ్యత తనదేనని ఆయన ఎందుకు గుర్తించడం లేదో! వైస్‌ చాన్సలర్లు రాజీనామా చేయాలని ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ జారీచేసిన ఆదేశాలు సమగ్రమైన ప్రక్రియ ప్రకారం జరగలేదు కనక ఎవరూ రాజీనామా చేయనవసరం లేదని రాత్రి పొద్దుపోయిన తరవాత కేరళ హైకోర్టు న్యాయమూర్తి దేవన్‌ రామచంద్రన్‌ స్పష్టం చేశారు. దీనితో ఘనత వహించిన గవర్నర్‌ బిత్తర పోవలసి వచ్చింది. ఈ వైస్‌ చాన్సలర్లకు ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ వారిని ఎందుకు తొలగించకూడదో తెలియజేయాలని సంజాయిషీ నోటీసులు జారీ చేశారు. వారు సమాధానాలు ఇవ్వడానికి వచ్చే నవంబర్‌ మూడు దాకా గడువు నిర్దేశించిందీ ఆయనే. కానీ ఈ లోగానే అక్టోబర్‌ 24 ఉదయానికల్లా రాజీనామా చేయాలని ఆదేశించారు. 24 గంటలలోగా వైస్‌ చాన్సలర్లను రాజీనామా చేయాలని కోరడం బేసబబు అని హైకోర్టు తేల్చి చెప్పింది. ఇది చట్ట విరుద్ధమని కూడా స్పష్టం చేసింది. ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఇంత తొందరపాటు ప్రదర్శించడానికి కారణం లేకపోలేదు. ఏ.పి.జె. అబ్దుల్‌ కలాం విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ నియామకం విశ్వవిద్యాలయాల నిధుల సంఘం నిబంధనలకు విరుద్ధం కనక ఆ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. ఈ తీర్పు నేపథ్యంలో గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ అత్యుత్సాహం ప్రదర్శించి అందరు వైస్‌ చాన్సలర్లను తొలగించాలనుకున్నారు. అన్ని రాష్ట్రాలలో అక్కడి విశ్వవిద్యాలయాల చాన్సలర్‌గా గవర్నరే వ్యవహరిస్తారు. అంత మాత్రం చేత ఇష్టారాజ్యంగా చెలాయించడానికి అవకాశంఉండదు. వైస్‌ చాన్సలర్ల నియామకానికి నిర్ణీత ప్రక్రియ ఉంటుంది. మొదట వైస్‌ చాన్సలర్ల ఎంపిక కోసం ఒక కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీ కనీసం ముగ్గురి పేర్లను సూచించాలి. వీటి లోంచి ప్రభుత్వం ఒకరిని ఎంపికచేసి ఆ వ్యక్తిని వైస్‌చాన్సలర్‌గా నియమించాలని గవర్నర్‌కు సిఫార్సు చేస్తుంది. అంటే ఈ నియామకాలకు సిఫార్సు చేయవలసింది రాష్ట్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులపై గవర్నర్‌కు అభ్యంతరాలు ఉంటే ప్రభుత్వాన్ని మరోసారి పరిశీలించమని కోరవచ్చు. అవసరం అనుకుంటే ప్రభుత్వం మార్పులు చేయవచ్చు. లేదా చేయకనూ పోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం కనక ముందుచేసిన సిఫార్సులనే రెండోసారి కూడా పంపితే గవర్నర్‌ ఆమోదించి తీరవలసిందే. మరో మార్గం లేదు.
వైస్‌ చాన్సలర్లను ఎంపిక చేయడానికి ఏర్పాటు చేసిన కమిటీలు కొన్ని సందర్భాలలో ఒక్క పేరే సూచించాయన్నది ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ ఫిర్యాదు. అలాంటప్పుడు నియామకం జరిగిపోయిన తరవాత, ఆ నియామక పత్రాలపై తానే సంతకం చేసిన తరవాత ఇప్పుడు రాజీనామా చేయాలని కోరడంలో ఆంతర్యం ఏమిటో అంతుపట్టదు. విశ్వవిద్యాలయాల వైస్‌ చాన్సలర్లందరినీ గంపగుత్తగా రాజీనామా చేయమని ఆదేశిస్తే విశ్వవిద్యాలయాల నిర్వహణ అస్తవ్యస్తం అవుతుందని ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌కు తెలియదనుకోలేం. వైస్‌ చాన్సలర్లను ఉన్న ఫళాన రాజీనామా చేయమని ఆదేశించే అధికారం గవర్నరుకు లేదు. లేని అధికారాన్ని ఆయన చెలాయించాలనుకుంటున్నారు. పైగా వైస్‌ చాన్సలర్లు హైకోర్టుకు వెళ్లారు. ఆ వ్యవహారం హైకోర్టు పరిశీలనలో ఉన్న సమయంలో ఆయన ఎందుకు తొందరపడ్తున్నారో అర్థం కాదు. పోనీ అబ్దుల్‌ కలాం విశ్వవిద్యాలయం వైస్‌ చాన్సలర్‌ నియామకం చెల్లదని సుప్రీంకోర్టు తేల్చింది కనక ఆ ఆధారంతో మిగతా వారినీ రాజీనామా చేయమని కోరుతున్నారని సరిపెట్టుకుందా మనుకున్నా దానికీ అవకాశం లేదు. సుప్రీంకోర్టు తీర్పును పున: పరిశీలించాలని కోరే అవకాశం ఎప్పుడూ ఉంటుందన్న ధ్యాస ఆరిఫ్‌ మహమ్మ ఖాన్‌కు లేకపోవడం ఆశ్చర్యకరమే. విశ్వ విద్యాలయాల చట్టం ప్రకారం వైస్‌ చాన్సలర్లను తొలగించే అధికారం చాన్సలర్‌గా వ్యవహరించే గవర్నరుకు ఉండదు. ఒక వేళ ఏ కారణం చేతనైనా ఏ వైస్‌ చాన్సలర్నైనా తొలగించాలనుకుంటే దానికి నిర్దిష్ట విధి విధానం ఉంది. వైస్‌ చాన్సలర్‌ కనక విశ్వవిద్యాలయ నిధులను దుర్వినియోగం చేసినప్పుడో, లేదా అనైతికంగా ప్రవర్తిస్తేనో తొలగించవచ్చు. అప్పుడూ ఏకపక్షంగా తొలగించే వీలు లేదు. ఆ ఆరోపణలపై హైకోర్టు లేదా సుప్రీంకోర్టు దర్యాప్తు చేయాలి. ఆరోపణలు నిజమని రుజువైతే తప్ప తొలగించడం కుదరదు. విద్యారంగాన్ని కాషాయీకరించాలని మోదీ సర్కారు కుట్ర పన్నుతోంది కనక ఆ కుట్రకు తోడ్పడాలని అనుకోక పోతే ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడానికి వీలే లేదు.
కేరళ అభివృద్ధి పథంలో ముందంజలో ఉన్నందుకే బీజేపీకి ఇప్పటికే కంటగింపుగా ఉంది. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సంధాన కర్తగా వ్యవహరించవలసిన బాధ్యతను విస్మరించి ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పక్షపాత దృష్టితో ఇలా వ్యవహరిస్తున్నారనుకోవాలి. పనిలో పనిగా గవర్నర్‌ పత్రికా రచయితలు, టీవీ చానళ్ల మీద కూడా విరుచుకు పడ్తున్నారు. ఆయా పార్టీల కార్యకర్తలు పత్రికా రచయితలుగా చెలామణి అవుతున్నారని ఆయన నిరాధార ఆరోపణలకు దిగారు. పత్రికా రచయితల అర్హతలను తానే నిర్ణయించాలను కుంటున్నట్టుంది. మీడియా వారు ఆయనను కలుసుకోవడానికి రాజ్‌ భవన్‌ వెళ్లినప్పుడు వారిని రానివ్వక పోవడమే కాక నిరాధార ఆరోపణలకు దిగారు. తనను కలుసుకోవాలనుకునే మీడియా వారు అభ్యర్థన పంపితే దాన్ని పరిశీలించి అసలైన మీడియా వారెవరు, మీడియా ముసుగులో ఉన్న పార్టీల కార్యకర్తలు ఎవరు అని నిర్ధారించిన తరవాతే అనుమతిస్తా నంటున్నారు. అంటే వివిధ మీడియా సంస్థలు గవర్నర్‌ ఆమోదం పొందిన తరవాతే తమ సిబ్బందిని నియమించుకోవాలేమో. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని బేఖాతరు చేసేలా మాత్రమే కాకుండా ప్రభుత్వ అధికారాలను కాదనేలా గవర్నర్‌ వ్యవహార సరళి ఉంది. విశ్వ విద్యాలయాలు స్వతంత్ర వ్యవస్థలుగా పనిచేయాలన్న మౌలిక సూత్రాన్ని గవర్నర్‌ విస్మరించడం ఆందోళనకరమైందే.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img