Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

కప్పన్‌కు ఊరట

కేరళకు చెందిన పత్రికా రచయిత సిద్ధిఖ్‌ కప్పన్‌కు ఎట్టకేలకు సుప్రీంకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని హత్రస్‌లో ఒక దళిత మహిళమీద జరిగిన అత్యాచారం గురించి సమాచారం సేకరించడానికి వెళ్తుండగా ఆ రాష్ట్ర పోలీసులు కప్పన్‌ సహా మరికొందరిని అరెస్టుచేసి అనేక కేసులు మోపారు. ఆయన మీద చట్టవ్యతిరేక కార్యకలాపాల కింద మోపిన కేసులో గత సెప్టెంబర్‌లో బెయిలు మంజూరు అయింది. కానీ అక్రమ పద్ధతుల్లో డబ్బు చెలామణి చేశారన్న ఆరోపణలపై ఎన్‌ఫోర్స్‌మెంటు డైరెక్టొరేటు కేసు దాఖలు చేసినందువల్ల ఆయన ఇంతవరకు విడుదల కాలేదు. శుక్రవారం ఆ కేసులో కూడా హైకోర్టు బెయిలు మంజూరు చేసింది. ఇక ఆయన స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవడమే తరువాయి. రెండేళ్లనుంచి ఆయన జైలులోనే ఉన్నారు. ఈ నెలారంభంలోనే లక్నోలోని కోర్టు కప్పన్‌ సహా మరో ఆరుగురిపై డబ్బు అక్రమ చెలామణికి పాల్పడ్డారని ఆరోపిస్తూ చార్జిషీటు దాఖలు అయింది. అంటే ఈ కేసులో ఇక విచారణ ప్రారంభంకావలసి ఉంది. రెండేళ్ల కింద అరెస్టుఅయినా చార్జిషీటు దాఖలుకు ఇంతకాలం పట్టినందువల్ల కప్పన్‌ తదితరులకు బెయిలు కూడా మంజూరు కానందువల్ల జైలులోనే మగ్గి పోవలసి వచ్చింది. కప్పన్‌తో పాటు కె.ఎ.రవూఫ్‌ షరీఫ్‌, అతీకుర్‌ రహమాన్‌, మసూద్‌ అహమద్‌, మహమ్మద్‌ ఆలం, అబ్దుల్‌ రజాక్‌, అష్రాఫ్‌ ఖదీర్‌ మీద కేసు దాఖలైనందువల్ల జైలులో మగ్గిపోవలసి వచ్చింది. వీరందరూ ముస్లింలే కావడం ప్రత్యేకంగా గమనించదగిన అంశం. వీరందరూ నిషేధిత పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పి.ఎఫ్‌.ఐ), దానికి అనుబంధంగా ఉన్న విద్యార్థి సంఘం కాంపస్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులని ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఆరోపణ. తమ మీద మోపిన ఈ ఆరోపణలతో తమకు ఎలాంటి సంబంధమూ లేదనీ, పత్రికా రచయితలుగా తమ వృత్తి ధర్మాన్ని నిర్వర్తించడానికి వెళ్తుండగా అక్రమంగా అరెస్టు చేశారని నిందితులు వాదించారు. ఈ ఆరుగురిలో కప్పన్‌, అతీకుర్‌ రహమాన్‌, మహమ్మద్‌ ఆలం, మసూద్‌ అహమద్‌ను ఉత్తరప్రదేశ్‌ పోలీసులు రెండేళ్ల కింద మథురలో అరెస్టు చేశారు. ఇతర కేసుల్లో గత సెప్టెంబర్‌లో కప్పన్‌కు బెయిలు మంజూరు అయినప్పుడు ఆయన ముస్లిం కనకే అక్రమ కేసులు మోపారని ప్రతిపక్షాలు వాదించాయి. దళిత మహిళలపై అత్యాచారాలు జరగడం కొత్తకాదు కానీ హత్రస్‌ సంఘటనలో అత్యా చారానికి గురైన మహిళ పదిహేను రోజులు దిల్లీలోని ఒక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె మరణించారు. మరీ విచిత్రం ఏమిటంటే 2020 సెప్టెంబర్‌లో అత్యాచారానికి గురైన ఆ మహిళ కుటుంబం వారికి కూడా చెప్పకుండా అర్థరాత్రి పోలీసులు ఆమె అంత్యక్రియలు నిర్వర్తించేశారు. దీనిమీద భారీఎత్తున నిరసనలు వ్యక్తం అయినాయి. ఉత్తరప్రదేశ్‌లో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంమీద తీవ్ర విమర్శలు చెలరేగాయి.
సెప్టెంబర్‌లో సిద్దిఖ్‌ కప్పన్‌కు బెయిలు మంజూరుచేసిన సమయంలో ‘‘ప్రతి మనిషికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉంటుంది’’ అని అప్పటి ప్రధాన న్యాయమూర్తి యు.యు.లలిత్‌ వ్యాఖ్యానించారు. అయితే ఆరువారాల పాటు కప్పన్‌ దిల్లీలోని పోలీసుల దగ్గర హాజరు వేయించుకోవాలన్న షరతు విధించారు. ఆ తరవాత కేరళలో హాజరు వేయించు కోవాలన్నారు. మూడురోజుల్లో ఆయనని ఈ కేసును విచారించవలసిన కోర్టు ముందు హాజరు పరచాలని కూడా సుప్రీంకోర్టు పోలీసులను ఆదేశించింది. ఆయన పాస్‌పోర్టు కూడా పోలీసులకు స్వాధీనం చేయాలన్న షరతు విధించారు. అయితే మరోకేసులో ఆయనకు అప్పుడు బెయిలు మంజూరు కానందువల్ల ఈ ఆదేశాలు పాటించే అవకాశమే రాలేదు. మలయాళ వార్తా పోర్టల్‌ అజీముఖం విలేకరి అయిన కప్పన్‌ హత్రస్‌లో శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని ఉత్తర ప్రదేశ్‌ పోలీసులు అప్పుడు ఆరోపించారు. కలహాలు రెచ్చగొట్టడానికి ఆయనకు డబ్బు అందుతోందని, ఆయన ప్రభుత్వ గుర్తింపుఉన్న (అక్రెడిటెడ్‌) పత్రికా రచయిత కూడా కాదన్నది ఉత్తరప్రదేశ్‌ పోలీసుల వాదన. ఆయన పేలుడు పదార్థాలు కూడా వినియోగించారన్న ఆరోపణ కూడా మోపారు. ఆయన సభ్యుడైన పి.ఎఫ్‌.ఐ తీవ్రవాద సంస్థ అని కూడా పోలీసులు ఆరోపించారని ఆయన తరఫున వాదించిన న్యాయవాది మహేశ్‌ జెత్మలానీ అన్నారు. అయితే కప్పన్‌ తీవ్రవాది అనడానికి సాక్ష్యాధారాలు ఏమిటి అని, ఆయన దగ్గర పేలుడు పదార్థాలు ఏవీ దొరకలేదు కదా అని గత సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి ఉత్తరప్రదేశ్‌ పోలీసులను నిలదీశారు. ఆయన దగ్గర అభ్యంతరకరమైన సాహిత్యంకూడా ఉందని ప్రాసిక్యూషన్‌ వాదించి నప్పుడు ఆయన దగ్గర దొరికిన సాహిత్యంలో ఏముందో చదవి వినిపించాలని సుప్రీంకోర్టులో ఆయన తరఫున వాదించిన మరో సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబాల్‌ సవాలు చేశారు. ఆయన దగ్గర దొరికిందని పోలీసులు చెప్తున్న సాహిత్యంలో ప్రమాదకరమైంది ఏముంది అని అప్పటి ప్రధానన్యాయమూర్తి లలిత్‌ ఎదురుప్రశ్న వేశారు. కప్పన్‌ కలహాలు రెచ్చగొడ్తున్నాడన్న తమ వాదనకు దన్నుగా ఉత్తరప్రదేశ్‌ పోలీసులు 2021లో అయిదువేల పేజీల చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఆ సమయంలోనే కప్పన్‌ తొమ్మిదేళ్ల కూతురు ‘‘సామాన్య పౌరుల స్వేచ్ఛ’’ అన్న అంశంపై పాఠశాలలో జరిగిన వక్తృత్వ పోటీలో మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాలలో బాగా ప్రచారంలోకి వచ్చి అందరి దృష్టిని ఆకర్షించింది.
‘‘నా భర్త నిర్దోషి అని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆయనను నెలల తరబడి నిర్బంధంలో ఉంచడంవల్ల మా కుటుంబం కష్టాల పాలు అవుతోంది’’ అని ఆయనభార్య రైహానాకప్పన్‌ అన్నారు. గత సెప్టెంబర్‌లో తీవ్రవాదకేసులో కప్పన్‌కు బెయిలు మంజూరు అయినందుకు న్యాయస్థానం విచారణలోఉన్న ఖైదీల హక్కులను కాపాడు తోంది అన్న వ్యాఖ్యలూ వినిపించాయి. పదేళ్ల కన్నా ఎక్కువ కాలం నుంచి జైళ్లలో మగ్గుతున్న విచారణలోఉన్న ఖైదీల విషయంలో ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాన్ని, అలహాబాద్‌ హైకోర్టును కూడా సుప్రీంకోర్టు తూర్పారబట్టింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఖాతరు చేయకపోవడాన్ని తీవ్రమైన అంశంగా ప్రకటించింది. ప్రభుత్వం న్యాయం చేయనప్పుడు ఆ బాధ్యత నెరవేర్చడానికి సుప్రీంకోర్టు సిద్ధంగాఉందని అప్పుడు బెయిలు అర్జీని విచారించిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు సంజయ్‌ కిషన్‌ కౌల్‌, ఎం.ఎం.సుంద్రేశ్‌ వ్యాఖ్యానించడంవల్ల విచారణలో ఉన్న ఖైదీల వెతలను అత్యున్నత న్యాయస్థానం పట్టించుకుంటోందన్న భరోసా కలిగింది. పథకం ప్రకారం మోపిన ఈ కేసులమీద సత్వరం విచారణ జరిగితేతప్ప అత్యున్నత న్యాయస్థానం కల్పించే ఆశలకు విలువ ఉండదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img