Sunday, April 28, 2024
Sunday, April 28, 2024

మాజీ న్యాయమూర్తులకు
పదవుల పందారం

కొత్త గవర్నర్ల నియామకం, బదిలీలు పైకి చూస్తే సాధారణ వ్యవహారంగా కనిపించొచ్చు. పదవీ విరమణ చేసిన నెల రోజులు తిరక్కుండానే న్యాయమూర్తి అబ్దుల్‌ నజీర్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నరుగా నియమించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ విరమణ చేసిన తరవాత రాజ్యసభ సభ్యత్వం స్వీకరించడానికి రంజన్‌ గొగోయ్‌కి మూడు నెలల సమయమైనా పట్టింది. కొత్త గవర్నరుగా నజీర్‌ను నియామకంలో అదీ లేదు. ఇదంతా చూస్తే తమకు అనుకూలంగా వ్యవహరించిన న్యాయమూర్తులకు ప్రభుత్వం అందించిన కానుక అనిపిస్తోంది. పదవీ విరమణ చేసిన న్యాయ మూర్తులను గవర్నర్లుగా నియమించడం కొత్త కాదు. 2014లో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొన్నాళ్లకే న్యాయమూర్తి పి.సదాశివన్‌ ను కేరళ గవర్నరుగా నియమించారు. అప్పుడూ విమర్శలు ఎదురైనాయి. కానీ ప్రస్తుతం మోదీ ప్రభుత్వం న్యాయవ్యవస్థతో కయ్యం పెట్టుకుంటున్న రీతిలో వ్యవహరిస్తోంది కనక న్యాయమూర్తి నజీర్‌ను ఆంధ్రప్రదేశ్‌ గవర్నరుగా నియమించడంలో రాజకీయకోణం బలంగా ఉందని పిస్తోంది. న్యాయమూర్తి నజీర్‌ ను గవర్నరుగా నియమించి మోదీ ప్రభుత్వం తాము ముస్లింలను విస్మరించడం లేదు అని చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తోంది. రాజకీయ రంగంలో మోదీ హయాంలో ముస్లింలను సంపూర్ణంగా పక్కకు తోసేశారు. బీజేపీ అభ్యర్థులుగా పోటీ చేయడానికి ఒక్క ముస్లింకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ఇంతకు ముందు ఉదాహరణప్రాయంగానైనా ముస్లింలు బీజేపీ తరఫున ఏదో ఓ పదవిలో ఉండేవారు. వారి సంఖ్య చాలా తక్కువే. ఇంతకు ముందు ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ, ఎం.జె.అక్బర్‌, సయ్యద్‌ జఫర్‌ ఇస్లాం వంటి వారు బీజేపీకి ప్రాతినిధ్యం వహించే వారు. వారి పదవీ కాలం ముగిసిన తరవాత వారి స్థానంలో ఒక్క ముస్లింకు కూడా బీజేపీ అవకాశం ఇవ్వలేదు. అంతే కాకుండా ఇటీవలి బడ్జెట్‌ లో అల్పసంఖ్యాక వర్గాలకు కేటాయించే బడ్జెట్‌లో 38 శాతం కోత పెట్టిన తరవాత బీజేపీ ముస్లింల విషయాన్ని పట్టించుకుంటుంది అని నమ్మడం అమాయకత్వానికి పరాకాష్ఠ. న్యాయమూర్తి నజీర్‌ ను గవర్నరును చేయడంవల్ల ముస్లింలకు చాలా చిన్న స్థాయిలోనైనా ప్రాతినిధ్యం ఇచ్చారనుకోవడానికీ అవకాశం లేదు. ఆయనను ఆంధ్రప్రదేశ్‌ గవర్నరును చేయడానికి ఇతరేతర కారణాలున్నాయి. అవి ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేవే. ఆయన మోదీ సర్కారుకు విధేయుడిగా ఉండి, ఆ ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులు ఇచ్చినందువల్లే గవర్నరు పదవి ఇచ్చినట్టు కనిపిస్తోంది. అయోధ్య కేసులో తీర్పు చెప్పిన అప్పటి ప్రధాన న్యాయమూర్తి రంజన్‌ గొగోయ్‌ నాయకత్వంలోని రాజ్యాంగ ధర్మాసనంలో న్యాయమూర్తి నజీర్‌ కూడా ఉన్నారు. ఆ తీర్పు సంఫ్‌ు పరివార్‌కు పూర్తిగా అనుకూలంగా ఉందనడానికి ప్రత్యేక తెలివితేటలు అవసరం లేదు. ప్రభుత్వానికి అనుకూలమైన తీర్పులిచ్చిన న్యాయమూర్తులకు ఉద్యోగ విరమణ తరవాత కష్టపడకుండా వేతనం తీసుకునే పదవులు ఇవ్వడం మోదీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచే ఉంది. తమకు మేలు చేసి ఉద్యోగ విరమణ చేసిన ఐ.ఎ.ఎస్‌., ఐ.పి.ఎస్‌., ఐ.ఎఫ్‌.ఎస్‌. అధికారులను ఏదో ఒక రూపంలో సత్కరించడం కూడా ఇంతకు ముందు కూడా ఉండొచ్చు. మాజీ సైనికాధికారులు కూడా ఉద్యోగవిరమణానంతర లబ్ధిని దృష్టిలో ఉంచుకునే పని చేస్తున్నారు. కానీ మోదీ హయాంలో ఈ పందారాల ప్రక్రియ మరింత వికృత రూపంలో వ్యక్తం అవుతోంది. అదృష్టవశాత్తు చాలా మంది న్యాయమూర్తులు ఉద్యోగానంతర పదవులు ఆశించకుండా పని చేసి ఉండొచ్చు. కానీ ఇలా ఆశపడడానికీ సుదీర్ఘచరిత్రే ఉంది. ఎమర్జెన్సీ సమయంలో ఇందిరా గాంధీ న్యాయవ్యవస్థను లొంగదీయడానికి చేసిన పని వల్ల కలిగిన దుష్పరిణామాల నుంచి న్యాయవ్యవస్థ ఇప్పటికీ కోలుకోనే లేదు. పైగా ఇప్పుడు ఆ రుగ్మతకు చాలా ప్రమాదకరమైన హిందుత్వ వాదం తోడైంది. న్యాయమూర్తులు పదవిలో ఉన్నప్పుడు రాజ్యాంగానికి, పౌరులకు బాధ్యత వహించి పని చేయవలసిన అగత్యం లేదనీ, కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వానికి నిబద్ధమై పని చేస్తే ఉద్యోగ విరమణ తరవాత కూడా తృణమో పణమో దక్కుతుందన్న అభిప్రాయం ఈ రోజుల్లో న్యాయమూర్తుల్లోనూ బలంగా నాటుకు పోయింది.
న్యాయమూర్తిగా ఉన్నప్పుడు నజీర్‌ కొన్ని కీలకమైన తీర్పులు చెప్పిన బెంచీల్లో సభ్యుడిగా ఉన్నారు. అయోధ్య వివాదాన్ని విచారించిన బెంచి, ముమ్మారు తలాఖ్‌ కేసు విచారించిన బెంచి, గోప్యత హక్కు అని తీర్పు చెప్పిన బెంచిలోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. వీటిలో చివరిది తప్ప మిగతా రెండూ ప్రభుత్వ అనుకూలమైన తీర్పులే. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పూర్తిగా హిందుత్వ వాదులకు అనుకూలమైందే. ఆ బెంచిలో న్యాయమూర్తి నజీర్‌ ఒక్కరే ముస్లిం. ఆ తీర్పు ముస్లింల హక్కులను కాల రాసింది. వివాదాస్పదమైన అయోధ్య కేసులో చెప్పిన తీర్పు ఏకాభిప్రాయంతో కూడిరది కావొచ్చు. కానీ న్యాయాన్యాలు ఏకాభిప్రాయం మీద ఆధారపడి ఉండవు. ఉండకూడదు. తలలు లెక్కించి న్యాయం ఏమిటో నిర్ధారించడం అంటే మెజారిటీ వర్గం ఆధిపత్యాన్ని అంగీ కరించడమే. అయోధ్య తీర్పులో ఏకాభిప్రాయం కుదరడం సెక్యులరిజం విజయానికి ప్రతీక అని అంటున్న వారికి అది సెక్యులరిజాన్నే కాదు సహజ న్యాయాన్ని సైతం వెయ్యి నిలువుల లోతున పాతి పెట్టిందన్న వాస్తవం తెలియక కాదు. హిందుత్వ వాదం శిరోధార్యం అని భావించే వారు ఇలాంటి వాదనలే చేస్తారు. రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత నుంచి, పౌరుల మౌలిక హక్కులను పరిరక్షించవలసిన బాధ్యత నుంచి న్యాయవ్యవస్థ క్రమంగా తప్పుకుంటున్న పోకడేలే ప్రబలంగా కనిపిస్తున్నాయి. ఈ మధ్యలో అక్కడో మెరుపు, ఇక్కడో మెరుపూ ఉండొచ్చుగాక. ప్రధాన న్యాయమూర్తిగా డి.వై. చంద్రచూడ్‌ బాధ్యతలు చేపట్టిన తరవాత న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్న జాడలు పొడసూపుతున్నాయి.
చంద్రచూడ్‌ పదవీ కాలం సాపేక్షికంగా ఎక్కువ కావడంవల్ల న్యాయవ్యవస్థ స్వతంత్రతను పరిష్కరించడం కుదురు తుందనుకోవడం అత్యాశ కాదు. కానీ ప్రధాన న్యాయమూర్తులుగా గొప్ప గొప్ప మాటలు చెప్పిన వారు కడకు సంఫ్‌ు పరివార్‌కు అనుకూలంగానే తీర్పులు వెలువరించిన వాస్తవం మన కళ్లముందే ఉంది. రాజ్యాంగ మౌలిక స్వరూపంతో సహా న్యాయమూర్తులను నియ మించడానికి ప్రస్తుతం అమలులో ఉన్న కొలీజియం వ్యవస్థను మోదీ ప్రభుత్వం ఇసుమంతైనా బిడియం లేకుండా ప్రశ్నిస్తోంది. ఇది కేవలం కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు లేక ఉపరాష్ట్రపతి ధన్కర్‌ వ్యక్తిగత అభిప్రాయమో కాదు. వారి వాదనలను మోదీ సర్కారు ఖండిరచిన పాపాన పోలేదు కనక అది ప్రభుత్వ వైఖరే అనుకోవాల్సిందే. ఉద్యోగ విరమణానంతరం న్యాయ మూర్తుల సేవలు అవసరమైనరంగాలు ఉన్నాయి. వివిధ ట్రిబ్యునళ్లకు వారిని నియమించడంలో అర్థం ఉంది. అందులోనూ అనుకూల మైన వారిని నియమించడం ఎటూ ఉంటుంది. కానీ సంపూర్ణంగా రాజకీయ నియామాకాలైన గవర్నరు పదవులలో మాజీ న్యాయమూర్తులను నియ మించడంలో కేవలం రాజకీయ కోణమే ఉంది. అధికార పార్టీ రాజకీయాలను ఆమోదించే వారికే ఈ పదవులు కట్టబెడ్తున్నారు. న్యాయ వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి, జీ హుజూర్‌ అనే వ్యవస్థగా మార్చడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నమే జరుగుతోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img