Tuesday, May 28, 2024
Tuesday, May 28, 2024

నా సహనాన్ని పరీక్షించొద్దు..

మౌలిక వసతుల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలం
పోరాడేందుకు టీడీపీ వెనుకంజ వేస్తోంది..
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌
తూర్పుగోదావరి, అనంతపురం జిల్లాల్లో శ్రమదానం

విశాలాంధ్ర – రాజమహేంద్రవరం/అనంతపురం : పన్నులు చెల్లించే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయిందని జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ విమర్శించారు. వైసీపీ పరిపాలన అస్తవ్యస్తంగా మారిందని, అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో రహదారుల దుస్థితిని నిరసిస్తూ జనసేన పార్టీ చేపట్టిన శ్రమదానంలో భాగంగా ఆయన శనివారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం రూరల్‌ హుకుంపేటకు సమీపంలోని బాలాజీ పేట వద్ద, అనంతపురం జిల్లా నాగుల కనుమ వద్ద రహదారులకు మరమ్మతులు నిర్వహించారు. అనంతరం బాలాజీపేట, అనంతపురం జిల్లా కొత్త చెరువు వద్ద జరిగిన బహిరంగ సభల్లో పవన్‌ కళ్యాణ్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రహదారులు ఛిద్రమైనప్పటికీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అందుకే గాంధీ జయంతి రోజున మహాత్ముని విగ్రహానికి కేవలం దండలు వేసి చేతులు దులుపుకోకుండా శ్రమదానం ప్రారంభించామని తెలిపారు. తన సహనాన్ని పిరికితనం, చేతకానితనం అనుకోవద్దని.. ఒక్కొక్కరిని కింద కూర్చోబెట్టి తొక్కి నార తీస్తా అంటూ పవన్‌ కళ్యాణ్‌ విరుచుకుపడ్డారు. ఎవరెన్ని విమర్శలు చేసినా ప్రజల కోసమే వాటన్నింటిని భరిస్తున్నానని స్పష్టం చేశారు. ప్రశ్నించే వారుంటే అధికారంలో ఉన్నవారికి భయం ఉంటుందని, ఆ భయంతోనే తాను శ్రమదానం చేయడానికి వస్తున్నానని తెలిసి ధవళేశ్వరం బ్యారేజీ రహదారి, హుకుంపేట రోడ్డుకు మరమ్మతులు చేశారని తెలిపారు. పోలీసులు అడుగుడుగునా తమ కార్యక్రమానికి అంతరాయం కలిగిస్తూ జన సైనికులను అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాంగం కల్పించిన హక్కును ప్రజాస్వామ్యంలో అడ్డుకోవడం సరికాదన్నారు. ఏ ప్రభుత్వం కూడా రాజకీయ పార్టీలు నిర్వహించే నిరసన కార్యక్రమాలను నిలుపుదల చేయకూడదన్నారు. అయితే పోలీసులు బారికేడ్లు పెట్టి ఆపాలని ప్రయత్నించినా.. లాఠీచార్జ్‌ చేసినా వెనక్కి తగ్గేది లేదని, మరింతగా పైకి లేస్తామని చెప్పారు. ప్రభుత్వం పోలీసు వ్యవస్థను దుర్వినియోగం చేస్తూ తమ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేసిందని అన్నారు. ఆ తప్పు పోలీసులది కాదని.. వారికి ఆదేశాలు ఇచ్చి నడిపిస్తున్న ప్రభుత్వానిదని తెలిపారు. రాయలసీమ నుంచి ఎందరో యువత వలస పోతున్నారని, సీమ నుంచి ఎందరో ముఖ్యమంత్రులు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని అన్నారు. రాయలసీమకు పరిశ్రమలను రప్పిస్తానని, అభివృద్ధి చేస్తానని తెలిపారు. ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదని, పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ కూడా వెనుకంజ వేస్తోందని అన్నారు. రాష్ట్రంలో లక్షా 36 వేల కిలోమీటర్ల మేరకు రోడ్లు దెబ్బతింటే దాని గురించి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడకుండా తన గురించి ఇష్టమొచ్చినట్టు వ్యాఖ్యానించడం విడ్డూరంగా ఉందన్నారు.
అలాంటప్పుడు రాష్ట్రంలో ఒక్క గుంతను కూడా పూడ్చలేకపోవడం విచారకరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ముఖ్య నేతలు నాదెండ్ల మనోహర్‌, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్‌, అత్తి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img