Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

మహిళలను దగాచేసిన ‘చంద్రబాబు’

అక్కచెల్లెమ్మలపై భారం
‘సి’ గ్రేడ్‌లోకి వచ్చిన సంఘాలు
మహిళా ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం చర్యలు
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
వైఎస్సార్‌ ఆసరా, చేయూతలపై సమీక్ష

అమరావతి : గత చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మహిళలను ఆదుకోనందున మొత్తం వ్యవస్థ చిన్నాభిన్నమైందని, వారిపై ఆర్థిక భారం పెరిగిందని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ ఆసరా, చేయూతలపై క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి బుధవారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం మాట్లాడుతూ 2014లో చంద్రబాబు అక్కచెల్లెమ్మల రుణాలను మాఫీచేసి ఉండిఉంటే, అక్కడితో భారం పోయేదని, చంద్రబాబు కట్టవద్దని చెప్పి, హామీ ఇచ్చి,

వాటిని కట్టకపోవడంతో మహిళలపై ఆ భారం అమాంతంగా పడిరదని చెప్పారు. చివరకు వడ్డీలు కూడా చెల్లించలేక అక్కచెల్లెమ్మల పరిస్థితి దారుణంగా మారిందని, కట్టలేని ఆ రుణాలను నాలుగు దఫాలుగా ప్రభుత్వమే చెల్లిస్తోందని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఖరితోనే ‘ఎ’ గ్రేడ్‌లో ఉన్న సంఘాలన్నీ కూడా ‘సి’ గ్రేడ్‌లోకి పడిపోయాయని అన్నారు. ఈ సందర్భంగా ఆసరా రెండో విడత సన్నాహ కార్యక్రమం వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. మొదటి విడత ఆసరా కింద దాదాపు 8 లక్షల పైచిలుకు డ్వాక్రా గ్రూపులకు రూ.6,330.58 కోట్ల లబ్ధి చేకూరిందన్నారు. 2016లో రద్దయిపోయిన సున్నా వడ్డీ రుణాలను మళ్లీ తిరిగి పునరుజ్జీవింపచేసి, మహిళలను ఆదుకోవడమే కాకుండా, వారి కాళ్లమీద వాళ్లు నిలబడేట్టుగా ఐటీసీ, రిలయన్స్‌, అమూల్‌ లాంటి దిగ్గజ కంపెనీలను భాగస్వాములను చేసి, వారికి వ్యాపార మార్గాలను చూపించిందని వివరించారు. ఆసరా, చేయూత, సున్నా వడ్డీ రుణాల వంటి పథకాలతో నిజమైన మహిళా సాధికారతకు, ఆర్థిక స్వావలంబనకు ప్రభుత్వం దారులు పరుస్తోందన్నారు. మహిళల్లో స్థిరమైన ఆర్థిక అభివృద్ధి కోసం చేపడుతున్న కార్యక్రమాలను మళ్లీ ఒకసారి సమీక్షించి, మరింతమందికి లబ్ధి చేకూర్చేలా కార్యక్రమాలను చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వైఎస్సార్‌ చేయూతపై సీఎం సమీక్ష
వైఎస్సార్‌ చేయూతపై సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎంకు అధికారులు వివరాలు అందజేశారు. వైఎస్సార్‌ చేయూత మొదటి విడత ద్వారా దాదాపు 3 లక్షల మంది మహిళలకు సుస్థిర ఆర్థిక ప్రగతి కోసం ఉపాధి మార్గాలు ఏర్పాటు చేశామన్నారు. రిటైల్‌ షాపులు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలు పెంపకం తదితర ఉపాధి మార్గాలను కల్పించామని చెప్పారు. రెండో విడతలో 2,21,598 మంది మహిళలకు ఉపాధి మార్గాల కల్పనకు కొనసాగుతున్న కార్యక్రమాలను వివరించారు. మహిళలు చేస్తున్న వ్యాపారాలకు సంబంధించి మార్కెటింగ్‌ సమస్య ఉత్పన్నం కావొద్దని సీఎం స్పష్టం చేశారు. మనం ఎలాంటి ఉపాధి మార్గం చూపినా మహిళలు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా గతేడాది ప్రాక్టర్‌ అండ్‌ గాంబిల్‌, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌, రిలయన్స్‌ రిటైల్‌, అమూల్‌, అల్లానాలతో కలిసి సుస్థిర ఆర్థిక ప్రగతి కార్యక్రమాలు చేపట్టామని అధికారులు చెప్పారు. ఈ ఏడాది రిలయన్స్‌కు చెందిన అజియో, టనాజెర్‌, గ్రామీణ వికాస్‌ కేంద్ర, మహీంద్రా, గెయిన్‌, కల్‌గుడి కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదర్చుకుంటున్నామని వివరించారు. సీఎం మాట్లాడుతూ ఆసరా, చేయూత కింద మనం ఇచ్చే డబ్బును మహిళలు సుస్థిర జీవనోపాధి కోసం వినియోగించుకోవాలన్నదే ప్రధాన ఉద్దేశమని సూచించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.వి.సత్యనారాయణ, సెర్ఫ్‌ సీఈఓ ఏఎండీ ఇంతియాజ్‌, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి, స్త్రీనిధి ఎండీ నాంచారయ్య, పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌ ఆర్‌.అమరేంద్ర కుమార్‌, సెర్ఫ్‌ ప్రాజెక్టు మేనేజర్‌ ఎం.మహిత, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img