Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అగ్రి ప్రాజెక్టులకు పెద్దపీట

అన్నీ సకాలంలో పూర్తి చేయాలి
ఆర్బీకేల్లో 15 రకాల సదుపాయాలు
ఇందుకోసం రూ.16,236 కోట్లు ఖర్చు
సమీక్షలో సీఎం జగన్‌ వెల్లడి

అమరావతి :వ్యవసాయశాఖ ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యతనిచ్చి…సకాలంలో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ శాఖలు(హార్టికల్చర్‌, అగ్రి ఇన్‌ఫ్రా), పశుసంవర్ధకశాఖలపై క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సోమవారం సమీక్షించారు. మల్టీపర్పస్‌ సెంటర్లు, కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు, ఫుడ్‌ ప్రాసెసింగ్‌, ఫిషింగ్‌ హార్బర్లు, బల్క్‌మిల్క్‌ కూలింగ్‌ సెంటర్లు తదితర అంశాలపై సీఎం వరుసగా సమీక్ష జరిపారు. వీటన్నింటి కోసం రూ.16,236 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేసినట్లు అధికారులు వివరించారు. రైతులకు అండగా ఉండేందుకే రైతుభరోసా కేంద్రాల వద్ద మల్టీపర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, దీనిలో భాగంగా ఆర్బీకేల వద్ద 15 రకాల మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నట్లు సీఎం వెల్లడిరచారు. కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్ల వల్ల రైతులకు అందుబాటులో పరికరాలు ఉంటాయని, కూలీల కొరత సమస్య తగ్గుతుందన్నారు. పాల ఉత్పత్తి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సంబంధిత పరికరాలున్న కమ్యూనిటీ హైరింగ్‌ సెంటర్లు పెట్టాలని సీఎం ఆదేశించారు. సీడ్‌ కమ్‌ మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఒకటి ఏర్పాటు చేయాలని, కొన్నిచోట్ల అవసరాన్నిబట్టి మరో యూనిట్‌ ఏర్పాటుకు స్థలాలు గుర్తించాలని సీఎం సూచించారు. మత్స్యశాఖపై సమీక్షిస్తూ సముద్రతీర ప్రాంతాల్లో భారీగా ఫిషింగ్‌ హార్బర్లను, ఫిష్‌ల్యాండ్‌ సెంటర్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆక్వాలో 10 ప్రాసెసింగ్‌ యూనిట్లు, 23 ప్రీ ప్రాసెసింగ్‌ యూనిట్లు, 100 ఆక్వా హబ్స్‌ మొత్తంగా 133 ఏర్పాటు చేయనున్నామని, 2022 సెప్టెంబరు నెలాఖరునాటికి మొత్తం యూనిట్ల కార్యకలాపాలు ప్రారంభించేలా ప్రణాళిక సిద్ధం చేశామని అధికారులు తెలిపారు. మొత్తం 8 ఫిషింగ్‌ హార్బర్‌లలో నాలుగు చోట్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయని వివరించారు. పశుసంవర్ధకశాఖ అధ్వర్యంలో దేశీయ ఆవుల ఫార్మ్స్‌, ఆర్గానిక్‌ డెయిరీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆర్బీకేల స్థాయిలోనే పశుసంవర్ధక కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, దీనికోసం రూ.22.25 కోట్లు ఖర్చు కానున్నాయని అంచనా వేశారు. వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రి డాక్టర్‌ సీదిరి అప్పలరాజు, ఏపీ అగ్రికల్చర్‌ మిషన్‌ వైస్‌ చైర్మన్‌ ఎంవీయస్‌ నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్‌, ఆర్థికశాఖ కార్యదర్శి సత్యనారాయణ, మార్కెటింగ్‌, సహకారశాఖ ముఖ్యకార్యదర్శి వై.మధుసూధన్‌ రెడ్డి, అగ్రికల్చర్‌ మార్కెటింగ్‌శాఖ కమిషనర్‌ ప్రద్యుమ్న, ఏపీడీడీసీ డైరెక్టర్‌ డాక్టర్‌ అహ్మద్‌ బాబు, వ్యవసాయశాఖ కమిషనర్‌ హెచ్‌ అరుణ్‌ కుమార్‌, మత్స్యశాఖ కమిషనర్‌ కె కన్నబాబు, ఉద్యానవనశాఖ కమిషనర్‌ ఎఫ్‌ఎస్‌ శ్రీధర్‌, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్‌ అమరేంద్రకుమార్‌, ఏపీ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img