Friday, April 26, 2024
Friday, April 26, 2024

కమ్యూనిస్టు జర్నలిజం పితామహుడు మద్దుకూరి

పెట్టుబడిదారులతో మానవాళి మనుగడకు ముప్పు
మీడియాను నియంత్రిస్తున్న కేపిటలిస్టులు
‘మద్దుకూరి చంద్రం’ స్మారకోపన్యాసంలో ఈడ్పుగంటి
విశాలాంధ్ర వెబ్‌సైట్‌, యూట్యూబ్‌ చానల్‌ ఆవిష్కరణ

విజయవాడ : తెలుగునాట కమ్యూనిస్టు జరల్నిజానికి పితామహుడు విశాలాంధ్ర వ్యవస్థాపక సంపా దకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు అని కమ్యూనిస్టు సీనియర్‌ నాయకుడు ఈడ్పుగంటి నాగేశ్వరరావు కొనియాడారు. జర్నలిజాన్ని సాధనంగా చేసుకుని సోషలిజం, కమ్యూనిజం భావజాల వ్యాప్తి కోసం విస్తృతంగా కృషి చేశారని నివాళి అర్పించారు. ఆంధ్రా కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాతల్లో ఒకరు, స్వాతంత్య్ర సమరయోధులు మద్దుకూరి చంద్రశేఖరరావు(చంద్రం) 47వ వర్ధంతి సభ సోమవారం సాయంత్రం విజయవాడ చుట్టుగుంటలోని చంద్రం బిల్డింగ్స్‌లో నిర్వహిం చారు. విశాలాంధ్ర సంపాదకుడు ఆర్‌వీ రామారావు అధ్యక్షతన జరిగిన సభలో ‘ప్రపంచీ కరణ (గ్లోబలైజేషన్‌)కమ్యూనిస్టు జర్నలిజం’ అనే అంశంపై ఈడ్పుగంటి నాగేశ్వరరావు

స్మారకోపన్యాసం చేశారు. మద్దుకూరి చంద్రం ఫ్యూడలిజానికి, సామ్రాజ్యవాద విధానాలకు వ్యతిరేకంగానికి పోరాడుతూ సోషలిజం భావజాలం వైపు ఆకర్షితులయ్యారని తెలిపారు. పార్టీ, పార్లమెంటరీ పదవులను ఏనాడు ఆశించకుండా..తనకు వచ్చిన అవకాశాలను మరొకరికి త్యాగం చేశారని గుర్తుచేశారు. కమ్యూనిస్టు పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారని చెప్పారు. కమ్యూనిస్టు పార్టీ నడిపిన అన్ని పత్రికల్లో కీలక బాధ్యతలు చేపట్టారన్నారు. అదే తరహాలో కేరళలో నంబూద్రిపాల్‌, బెంగాల్‌లో సోమనాథ్‌ లాహిరి, మహారాష్ట్రలో పీసీ జోషి, అధికారి వంటి ప్రముఖ నాయకులు కమ్యూనిస్టు జర్నలిస్టులుగా సోషలిస్టు భావజాల వ్యాక్తి కోసం కృషి చేశారని వివరించారు. కారల్‌మార్క్స్‌, హోచిమిన్‌, రజనీపామీదత్‌, జాన్‌ రీడ్‌ వంటి మేధావులు సైతం వివిధ దేశాల్లో పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా జర్నల్స్‌ నడిపారని తెలిపారు. పెట్టుబడిదారులు ఉత్పత్తి, సరఫరాను తమ అధీనంలో పెట్టుకుని ప్రపంచాన్ని శాసిస్తున్నారని పేర్కొన్నారు. ఈ క్రమంలో మీడియా, సోషల్‌ మీడియా, ఇంటర్నెట్‌ వంటి వాటిని తమ నియంత్రణలో పెట్టుకుని ప్రజాభిప్రాయాలను సైతం మార్చివేస్తున్నారని చెప్పారు. ప్రపంచ దేశాలపై పూర్తి ఆధిపత్యం కోసం అమెరికన్‌ సామ్రాజ్యవాదులు హైబ్రీడ్‌ వార్‌ సాగిస్తున్నారని తెలిపారు. చైనాను నిర్వీర్యం చేస్తే సోషలిజం అంతమవుతుందని కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. ఫాసిజం, కమ్యూనిజం ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. పెట్టుబడిదారులు, సామ్రాజ్యవాదుల ఆధిపత్యపోరాటం వల్ల మానవాళి మనుగడకే ముప్పు ఉందని ఈడ్పుగంటి హెచ్చరించారు. సోషలిస్టు శక్తులన్నీ ఏకమై మానవాళిని రక్షించేందుకు కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించి సోషలిస్టు, కమ్యూనిస్టు ఉద్యమాలు, భావజాలాన్ని ప్రచారం చేయాల్సిన బాధ్యత విశాలాంధ్ర, వామపక్ష పత్రికలపై ఉందన్నారు.
‘రాంభట్ల’ పుస్తకాల ఆవిష్కరణ
మద్దుకూరి చంద్రం సహచరులు కీ.శే.రాంభట్ల కృష్ణమూర్తి రాసిన పుస్తకాలు ‘వేల్పుల కథ’, ‘జనకథ’, ‘వేదభూమి’ పుస్తకాలను అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి పెనుగొండ లక్ష్మీనారాయణ ఆవిష్కరించారు. లక్ష్మీనారాయణ మాట్లాడుతూ రాంభట్ల కృష్ణమూర్తి రచించిన పుస్తకాలను ఆయన శతజయంతి సందర్భంగా ఆవిష్కరించాలని భావించినా, కరోనా వల్ల సాధ్యం కాలేదని తెలిపారు. ఆయన రాసిన మిగిలిన పుస్తకాలను త్వరలోనే ఆవిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు. మద్దుకూరి చంద్రం తమ్ముడి కుమారుడు విజయకుమార్‌ విశాలాంధ్ర దినపత్రిక అభివృద్ధి నిధికి రూ.లక్ష విరాళం ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి తొలుత విశాలాంధ్ర ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌ కూన అజయ్‌బాబు స్వాగతం పలకగా, జీఎం పి.హరినాథరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చంద్రం చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img