Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

అనంత ఉద్రిక్తం

. కలెక్టరేట్‌ వద్ద సీపీఐ, రైతుసంఘం ఆందోళన
. అడ్డుకున్న పోలీసులు… తోపులాట
. రామకృష్ణ, జగదీశ్‌, నాయకుల అరెస్టు
. రాష్ట్రవ్యాప్తంగా రైతు ఉద్యమాలు: రామకృష్ణ

విశాలాంధ్ర – అనంతపురం అర్బన్‌:భారీ వర్షాలు, తుపాను వల్ల రైతులకు జరిగిన నష్టాలపై సీపీఐ, రైతుసంఘం ఆధ్వ ర్యంలో రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లో ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగా అనంతపురం కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ఎదుట సోమవారం సీపీఐ, రైతు సంఘం అధ్వ ర్యంలో ఆ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీశ్‌, జిల్లా కార్యదర్శి జాఫర్‌ హాజరయ్యారు. పురుగు పట్టిన పత్తి, కంది మొక్కలు ప్రదర్శిస్తూ కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించి వినూత్న నిరసనకు దిగారు. పంటనష్టపోయిన రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం అందించేందుకు కార్యాలయంలోకి వెళుతున్న సీపీఐ నేతలను పొలీసులు అడ్డుకున్నారు. ఆగ్రహించిన పార్టీ శ్రేణులు కలెక్టర్‌ ప్రధాన ద్వారం వైపు దూసుకెళ్లారు. పొలీసులు రంగంలోకి దిగి రామకృష్ణ జగదీశ్‌, జాఫర్‌, ఇతర నాయకులను అరెస్టు చేసి ఆయా పోలీస్‌స్టేషన్‌లకు తరలించారు. అనంతరం సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌ వద్ద ఉద్రిక్తత ఏర్పడిరది. అంతకుముందు కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం ముందు రామకృష్ణ మాట్లాడుతూ అతివృష్టి, అనావృష్టి, నకిలీ విత్తనాలతో రైతులు నష్టపోయారని చెప్పారు. అన్నదాతలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని, పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు రూ.50 వేలు, పండ్లతోటల రైతులకు లక్ష రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. సభలు, సమావేశాల పేరుతో ఎన్నికల కసరత్తు చేస్తున్న అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నాయకులు రైతు సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. అనంతపురంలో వేరుశనగ, పత్తి, వరి, కంది, మిరప తదితర వాణిజ్య పంటలు, కర్నూలు జిల్లాలో ఉల్లి, టమోటా సహా అన్ని రకాల పండ్ల తోటలతో రైతులు ఆదాయం కోల్పోయారని చెప్పారు. ఓవైపు ప్రకృతి వైపరీత్యాలు, మరోవైపు నకిలీ విత్తనాలతో పత్తి రైతులు పూర్తిగా నష్టపోయారన్నారు. వైసీపీ ఎంపీ బ్రహ్మానందరెడ్డి కనుసన్నల్లోనే 31 కంపెనీలు నకిలీ విత్తనాలు సరఫరా చేసినట్లు తెలిసిందన్నారు. దీంతో పత్తి రైతులు ఎకరాకు 30 వేల నుండి లక్ష రూపాయల వరకు నష్టపోయారన్నారు. ఇంత జరుగుతున్నా బాధిత రైతలను ఆదుకోవాలనే భావన అధికార పార్టీలో కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్యేలు గడప గడపకు కాదు…పొలం పొలంకి వెళ్లాలని హితవు పలికారు. రైతులు ఏ పంటలు వేశారో…ఎంత నష్టపోయారో స్వయంగా పరిశీలించాలని సూచించారు. వైసీపీ నాయకులకు ప్రజా సమస్యలు పట్టడం లేదన్నారు. అధికారులు సైతం పంట నష్టాలపై శ్రద్ధ వహించడం లేదని, నష్టం అంచనా నివేదికలు ప్రభుత్వానికి అందించడంలో ఘోరంగా విఫలమయ్యారని విమర్శిం చారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రైతు సమస్యలపై దృష్టి పెట్టాలన్నారు. గతంలో ఏదో ఒక ప్రాంతంలోనే రైతులు ఇబ్బందులు ఎదు ర్కొనేవారని, ప్రస్తుతం రాష్ట్రమంతా అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడ్డారని తెలిపారు. రైతు భరోసా కేంద్రాలు ఖాళీ కేంద్రాలుగా ఉన్నాయని, ఆక్వా రైతులు అప్పుల పాలై క్రాప్‌ హాలిడే ప్రకటిస్తామం టున్నారని చెప్పారు. ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో రైతుల దయనీయ స్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు రాష్ట్రవ్యాప్తంగా రైతుఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 20న కర్నూలు, 21న నంద్యాల జిల్లాల్లో ధర్నాలు, నిరసన కార్యక్ర మాలు చేపడతామన్నారు. అన్ని రాజకీయ పార్టీలు, రైతు సంఘాలను కలుపు కొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్‌బాబు, రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చెన్నప్ప యాదవ్‌, గోవిందు, నాయకులు సంజీవప్ప, రామకృష్ణ, శ్రీరాములు, లింగమయ్య, గోపాల్‌, రంగయ్య, రమణయ్య, కత్తి నారాయణస్వామి, పద్మావతి, కేశవరెడ్డి, మల్లికార్జున, నాగార్జున, నాగరాజు, కుల్లాయి స్వామి, చిరంజీవి, సంతోశ్‌ కుమార్‌, రామాంజనేయులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img