Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

మోదీ ప్రభుత్వాన్ని ప్రతిఘటిద్దాం

. కేంద్రం విధానాలపై కార్మిక ప్రతినిధుల మండిపాటు
. కమిషన్‌ చర్చలలో వెల్లువెత్తిన ఆగ్రహావేశాలు

అలప్పుళ (కేరళ) నుంచి డి.సోమసుందర్‌

గురుదాస్‌ దాస్‌ గుప్తా నగర్‌: ప్రజావ్యతిరేక, కార్మిక వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వంపై కార్మిక ప్రతినిధులు తీవ్రంగా విరుచుకుపడ్డారు. మోదీ ప్రభుత్వం పథకం ప్రకారం కార్మికహక్కులను, చట్టాలను నిర్వీర్యం చేస్తూ కార్పొరేట్‌ యాజమా న్యాలకు కార్మికులను బానిసలుగా మార్చేందుకు కంకణం కట్టుకున్నదని తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేశారు. మోదీని ప్రతిఘటించడం కార్మికవర్గ తక్షణ కర్తవ్యమని నొక్కి చెప్పారు. ఏఐటీయూసీ 42వ జాతీయ మహాసభల నాలుగోరోజు కార్యక్ర మాల్లో భాగంగా సోమవారం మొత్తం ప్రతినిధులు నాలుగు బృందాలుగా విడివడి వివిధ అంశాలపై చర్చలు జరిపారు. ఏఐటీయూసీ కేంద్రకమిటీ ఏర్పాటు చేసిన నాలుగు కమిషన్‌లు ఆయా అంశా లపై రూపొందించిన ముసాయిదా నివేదికలపై ప్రతి నిధులు పెద్దఎత్తున చర్చలలో పాల్గొని తమ అభిప్రా యాలు వెల్లడిరచారు. అనేక సూచనలు చేశారు.
ప్రభుత్వ రంగ పరిరక్షణకు పోరాటాలు
‘ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వరంగం’పై జరిగిన కమిషన్‌ చర్చలకు ఏఐటీయూసీ జాతీయ అధ్యక్షుడు రామేంద్రకుమార్‌, సీనియర్‌ నేతలు హెచ్‌.మహదేవన్‌, సి.శ్రీకుమార్‌, సీహెచ్‌ వెంకటాచలం, డి.ఆదినారాయణ, సీసీ సింగ్‌ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. రెండువందల మంది ప్రతినిధులు హాజరుకాగా 42 మంది మాట్లాడారు. ప్రభుత్వరంగ పరిరక్షణకు గట్టి పోరాటాలు చేపట్టాలని సూచించారు. ప్రైవేటీకరణ, ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్లకు ధారాదత్తం చేయడాన్ని ప్రతిఘటించాలని, ఆయా సంస్థల్లో ఉద్యోగులు చేసే పోరాటాలకు ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగులు మద్దతుగా ఉద్యమించాలని ప్రతినిధులు సూచించారు. ప్రభుత్వరంగ సంస్థల పరిరక్షణకు రాష్ట్రాలవారీ సదస్సులు జరపాలని, కేంద్రప్రభుత్వ సంస్థల యూనియన్లకు జాతీయస్థాయిలో సమాఖ్యను, రాష్ట్ర ప్రభుత్వసంస్థలలోని యూనియన్‌లకు రాష్ట్రాలస్థాయి సమాఖ్యలు ఏర్పాటుచేసి…మొత్తం ఉద్యమాన్ని సమన్వయంచేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రతినిధులు సూచించారు. చర్చలో ఆంధ్రప్రదేశ్‌ నుండి విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రతినిధులు జె.రామకృష్ణ, కె.సత్యనారాయణ, మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ నుండి ఎ.గిరిబాబు, తెలంగాణ నుండి డిఫెన్స్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ ప్రతినిధి బి.చంద్రయ్య, పోస్టల్‌ ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ నుండి పి.సురేశ్‌ మాట్లాడారు. సీనియర్‌ నాయకులు చలసాని వెంకట రామారావు, నెక్కంటి సుబ్బారావు, బీవీవీ కొండలరావు తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ బోర్డుల కోసం ఒత్తిడి పెంచుదాం
‘అసంఘటితరంగ కార్మికుల సంక్షేమ సమస్యలు-సవాళ్లు’ అంశంపై జరిగిన కమిషన్‌ చర్చలకు ఏఐటీయూసీ జాతీయకార్యదర్శి వహీదా నిజామి, విజయన్‌ కునిసెరి, కిష్టఫర్‌ సెనేకా, బబ్లీ రావత్‌, కవిత అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సమావేశంలో 230 మంది ప్రతినిధులు పాల్గొనగా 35 మంది మాట్లాడారు. హమాలీ, భవననిర్మాణ, స్కీమ్‌ వర్కర్ల, పారిశుద్ధ్య కార్మికుల, వీధి విక్రేతలు, ఉపాధిహామీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్త పోరాటాలు సాగించాలని ప్రతినిధులు కోరారు. అసంఘటితరంగ కార్మికులకు సంక్షేమ చట్టాలను, బోర్డులను ఏర్పాటు చేయాలని కోరుతూ ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచాలని సూచించారు. చర్చలలో ఆంధ్రప్రదేశ్‌ నుండి ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్‌ సెక్రెటరీ ఎస్‌.వెంకట సుబ్బయ్య, ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర సీనియర్‌ నేత వి.రత్నాకరరావు మాట్లాడారు.
ఏఐటీయూసీ విస్తరణకు కృషి
‘ఏఐటీయూసీ బలోపేతం- అభివృద్ధి’ అంశంపై జరిగిన కమిషన్‌ చర్చలకు ఏఐటీయూసీ జాతీయ కార్యదర్శులు సుకుమార్‌ దామ్లే, జి.ఓబులేసు, పీకే గంగూలీ, మోహన్‌శర్మ అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. సమావేశానికి 150 మంది ప్రతినిధులు హాజరుకాగా 21 మంది చర్చలో పాల్గొన్నారు. ప్రభుత్వ కార్మికవ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి, మతోన్మాద, ఫాసిస్టు శక్తుల కుట్రలను తిప్పికొట్టడానికిగాను ఏఐటీయూసీ నిర్మాణాన్ని విస్తరించాలని, బలోపేతం చేయాలని, కేంద్ర కార్యాలయాన్ని, రాష్ట్ర కార్యాలయాలను పటిష్ఠమంతం చేయాలని, అనుబంధ సంఘాలను నిర్మాణాత్మక పద్ధతిలో నిర్వహించాలని ప్రతినిధులు సూచించారు. అనుబంధ రుసుము పెంచాలని, సభ్యులు విధిగా ఏఐటీయూసీ నిధికి ఒకరోజు వేతనం ఇచ్చేటట్లుగా ప్రోత్సహించాలని సూచించారు. నిరంతర శిక్షణ, కొత్త కేడర్‌ రిక్రూట్‌మెంట్‌ జరగాలని, యూనియన్‌ల మధ్య సమాచార ఆదానప్రదానాలు మరింతగా పెరగాలని, ప్రచార పద్ధతులు వైవిధ్యంగా, ఆకర్షణీయంగా ఉండేటట్లు చూడాలని సూచించారు. ఏఐటీయూసీ జాతీయకార్యదర్శి జి.ఓబులేసు చర్చను ముగిస్తూ సంస్థకు ఎన్నో బలాలు ఉన్నాయని, అలాగే అవకాశాలు కూడా ఉన్నాయని, నిర్మాణంలో బలహీనతలను విడనాడితే ఏఐటీయూసీ నిర్మాణం పటిష్ఠమంతమవుతుందని, సంస్థ అభివృద్ధి చెందుతుందని అన్నారు. సవాళ్లను అవకాశాలుగా మార్చుకోవాలని ఓబులేసు అన్నారు. కార్మికవర్గ హక్కులను కాపాడుకోవడానికి, కార్మికవర్గ వాదనలను సమర్థవంతంగా వినిపించడానికి సంస్థాగత నిర్మాణమే మూలమని ఓబులేసు అన్నారు. జాతీయ కేంద్రంలో, రాష్ట్ర కేంద్రాలలో కార్యాలయాలను మరింత చలనశీలంగా పనిచేయించాలని, సభ్యుల నుండి క్రమం తప్పకుండా నిధులు, సభ్యత్వాలు వసూలు చేయాలని అన్నారు. చర్చలలో ఏఐటీయూసీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రసమితి అధ్యక్షుడు ఆర్‌.రవీంద్రనాథ్‌, తెలంగాణ రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఎస్‌.బాల్‌రాజ్‌ మాట్లాడారు. చర్చలు ముగిసిన అనంతరం ఆయా కమిషన్ల బాధ్యులు తుది నివేదికలను మహాసభ ముందు ఉంచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img