Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

అసమర్థ ముఖ్యమంత్రి జగన్‌

. విధ్వంసమే వైసీపీ అజెండా
. చంద్రబాబు విమర్శలు

విశాలాంధ్ర-పాతపట్నం (శ్రీకాకుళం): ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందని…అసమర్థ ముఖ్యమంత్రిగా జగన్‌మోహన్‌ రెడ్డి చరిత్రలో నిలుస్తారని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. పాతపట్నం, ఆమదాలవలసలో మంగళవారం ప్రజాగళం బహిరంగ సభలు నిర్వహించారు. పాతపట్నం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వండి అని అధికారంలోకి వచ్చిన జగన్‌కు అదే చివరి అవకాశం కావాలన్నారు. కనీస మౌలిక వస్తువుల కల్పనలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని, రాజకీయ దురుద్దేశంతో రాజధాని అమరావతిని విధ్వంసం చేసి రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మిగిల్చారని విమర్శించారు. అమరావతిని కూల్చి, పోలవరాన్ని ముంచేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్‌ కే దక్కిందన్నారు. కేంద్రంలో ఈసారి వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, రాష్ట్రం లో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నే రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందన్నారు. సంక్షేమ పథకాల పేరుతో బటన్‌ నొక్కి రూపాయి ఇస్తే… చెత్త పన్ను, ఆస్తి పన్ను, అధిక విద్యుత్‌ చార్జీల పేరుతో పది రూపాయలు లాక్కుంటున్నారని విమర్శించారు. సబ్సిడీపై రైతులకు ఇచ్చే యంత్రాలకు ఎగనామం పెట్టిన ఘనత వైసీపీదేనన్నారు. యువతకు ఉద్యోగాల కల్పన గాలికొదిలేశారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఉత్తరాంధ్ర నుంచి వలసల నివారణకు పాటుపడతామని హామీ ఇచ్చారు. ఉత్తరాంధ్రవాసులు టీడీపీకి బ్రహ్మరథం పడుతున్నారని, ఉత్తరాంధ్రను కూటమి క్లీన్‌స్వీప్‌ చేస్తుందన్నారు. వంశధార నిర్వాసితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామన్నారు. పాతపట్నంలో ఐటీడీఏను ఏర్పాటు చేస్తానని తెలిపారు. 100 పడకల ఆసుపత్రి తో పాటు, స్కిల్‌ డెవలప్మెంట్‌ సెంటర్‌ ను ఏర్పాటు చేసి యువతకు ఉపాధి అవకాశాలు సృష్టిస్తానని, స్థానిక వ్యవసాయరంగ ఉత్పత్తుల ఆధారిత పరిశ్రమల ఏర్పాటు చేసి స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతోపాటు రైతు సమస్యల పరిష్కారానికి పూర్తిగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తానన్నారు. విధ్వంసానికి మారుపేరయిన వైసీపీని చిత్తుగా ఓడిరచాలని కోరారు. పాతపట్నం నియోజవర్గ టీడీపీ అభ్యర్థి మామిడి గోవిందరావు మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇచ్చి నన్ను గెలిపిస్తే ఒక సామాన్యుడిగా సామాన్యుల కష్టాలు తెలిసినవాడిగా మీకు మేలు చేసి తీరుతానని తెలిపారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు గేదెల చైతన్య, బీజేపీ నాయకులు సలాన శరత్‌ కుమార్‌ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెత్తపన్ను రద్దు చేస్తాం…
ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ… జగన్‌ ఒక విధ్వంసకారి అని, రూ.13లక్షల కోట్లు అప్పు చేశారని విమర్శించారు. కూటమి అధికారంలోకి రాగానే పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పంటల బీమా అమలు చేస్తామన్నారు. ప్రతి ఎకరాకు నీరిస్తామని, వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తామని చెప్పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను రద్దు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img