Saturday, May 4, 2024
Saturday, May 4, 2024

నిరంతర నిఘా

. ట్రిపుల్‌ సీతో అక్రమాలపై జల్లెడ
. వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా చెక్‌పోస్టుల్లో పర్యవేక్షణ
. సీఈఓ ప్రత్యేక దృష్టి

విశాలాంధ్ర బ్యూరో-అమరావతి: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్లను ప్రభావితం చేసే ఎలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలకు తావులేకుండా ఎన్నికలను స్వేచ్ఛగా, న్యాయంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఇంట్రిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ (ట్రిపుల్‌ సీి) ద్వారా రాష్ట్రాన్ని జల్లెడపడుతోంది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయంలో ఆధునిక సాంకేతికత అనుసంధానంతో దీనిని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఎంసీసీ ఉల్లంఘనలు, మద్యం అక్రమ రవాణా, సీజర్లపై పటిష్టమైన పర్యవేక్షణ, నియంత్రణపై నిఘా పెడతారు. అంతర్‌రాష్ట్ర సరిహద్దులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 424 చెక్‌ పోస్టుల్లో దాదాపు 358 చెక్‌ పోస్టుల (84.4 శాతం) నుంచి వెళ్లే వాహనాల కదలికలను వెబ్‌ కాస్టింగ్‌ ద్వారా ఈ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తారు. ఎన్నికల షెడ్యూలు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యధిక మొత్తంలో రూ.141 కోట్ల విలువకు పైబడి నగదు, లిక్కర్‌, డ్రగ్స్‌, ప్రెషస్‌మెటల్స్‌, ఫ్రీ బీస్‌, ఇతర వస్తువులను జప్తు చేశారు. ఓటర్లపై మద్యం ప్రభావం ఏమాత్రం ఉండకూడదన్న లక్ష్యంతో మద్యం అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలను ఎన్నికల సంఘం చేపట్టింది. రాష్ట్రంలో మద్యం తయారీ సంస్థల గోడౌన్ల ఎంట్రీ, ఎగ్జిట్‌ పాయింట్లలో ఏర్పాటు చేసిన వెబ్‌ కెమేరాల ద్వారా, మద్యం తయారీ సంస్థల నుంచి గోదాములకు, షాపులకు, బార్లకు లేదా ఇతర సంస్థలకు మద్యం సరఫరా చేస్తున్న వాహనాలను జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ఈ కేంద్రం నుంచి పర్యవేక్షిస్తుంది.
క్షేత్రస్థాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలన్న లక్ష్యంతో నిరంతరం పర్యటిస్తున్న ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ బృందాలు, సెక్టోరల్‌ అధికారులు వినియోగించే దాదాపు 1,680 వాహనాలు, ఈవీఎంల రవాణాకు వినియోగించే వాహనాల కదలికలను జీపీఎస్‌ ట్రాకింగ్‌ ద్వారా ఈ కేంద్రం నుంచి పరిశీలిస్తారు. ప్రముఖ ఎలక్ట్రానిక్‌ తెలుగు చానళ్లలో నిరంతరాయంగా ప్రసారం అయ్యే వార్తాంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఇందు కోసం ఇద్దరు ఏఎస్‌ఓలతో పాటు దాదాపు 25 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు షిప్టుల వారీగా పనిచేస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల, తెలుగు దిన పత్రికల్లో ప్రచురితమయ్యే ఎన్నికల ప్రతికూల వార్తాంశాలపైనా తగిన చర్యలు తీసుకునేందుకు దృష్టి సారించారు.
సీఈఓ ముఖేశ్‌ కుమార్‌ మీనా స్వయంగా వీటిని పర్యవేక్షిస్తారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img