Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఆర్‌ – 5 జోన్‌ ఉద్రిక్తం

. పొలం చదును పనులు అడ్డుకున్న రైతులు
. పెట్రోలు బాటిళ్లతో మహిళల నిరసన
. పొక్లెయిన్లతో వెనుతిరిగిన అధికారులు
. తుళ్లూరులో అన్నదాతల భారీ ప్రదర్శన

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాజధాని పరిధిలోని ఆర్‌5 జోన్‌లో ఇతర ప్రాంతాల పేదలకు ఇంటిస్థలాలు ఇచ్చేందుకు సీఆర్‌డీఏ సిబ్బంది చేపట్టిన పొలం చదును పనులను దొండపాడు, నెక్కల్లు గ్రామ రైతులు అడ్డుకున్నారు.
వారం రోజులుగా పోలీసు భద్రతతో అధికారులు 50వేల ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్‌5 జోన్‌, ఆర్‌3 జోన్‌లో మొత్తంగా ఎన్టీఆర్‌, గుంటూరు జిల్లాలకు చెందిన ప్రజలకు సుమారు 50వేల ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన రాళ్లు వేసే కార్యక్రమంలో తలమునకలైంది. రాజధాని ప్రాంతంలో నాలుగేళ్ల క్రితం పేదల కోసం కట్టిన టిడ్కో ఇళ్లను ఇంతవరకు కేటాయించకుండా, ఈ ప్రాంతంలో ఉన్న పేదలను కాదని, ఇతర ప్రాంత పేదలకు ఇక్కడ ఇళ్ల స్థలాలు ఇవ్వడం వెనుక అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను చెడగొట్టే కుట్ర ఉందంటూ రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆర్‌`5 జోన్‌ ఏర్పాటును గ్రామసభలు వ్యతిరేకిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించినా, ఈ అంశం కోర్టు పరిధిలో ఉన్నప్పటికీ ప్రభుత్వం నియంతృత్వంగా వ్యవహరిస్తున్నదని అమరావతి ఐక్యకార్యాచరణ సమితి నేతలు మండిపడుతున్నారు. రైతులు ప్రతిరోజూ ఆందోళన చేస్తున్నా పట్టించుకోని సీఆర్‌డీఏ సిబ్బంది శుక్రవారం జేసీబీ, పొక్లయినర్లతో పనులు చేయటానికి దొండపాడు వచ్చారు. రైతులు పెద్దసంఖ్యలో అక్కడకు చేరుకుని పనులను అడ్డుకున్నారు. అధికారుల తీరును నిరసిస్తూ పెట్రోల్‌ బాటిళ్లు పట్టుకుని వాహనాలు వెనక్కి తీసుకెళ్లాలని డిమాండ్‌ చేస్తూ మహిళా రైతులు నిరసన చేపట్టారు. పెట్రోల్‌ బాటిళ్లను లాక్కునేందుకు పోలీసుల యత్నించారు. పోలీసులు, రైతుల మధ్య జరిగిన పెనుగులాటతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడగా, చేసేదిలేక సీఆర్‌డీఏ అధికారులు వెనుతిరిగారు.
ఆర్‌5జోన్‌ను వ్యతిరేకిస్తూ రైతుల భారీ ర్యాలీ అమరావతి రాజధాని మాస్టర్‌ప్లాన్‌ను విచ్ఛిన్నం చేసే కుట్రతో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆర్‌5 జోన్‌ను వ్యతిరేకిస్తూ తుళ్లూరులో రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు. దీక్షా శిబిరం నుంచి సీఆర్‌డీఏ కార్యాలయం వరకు పాదయాత్రగా వెళ్లారు. ‘సెంటు భూమి వద్దు, టిడ్కో ఇళ్లు ముద్దు’…‘అమరావతి రెండు జిల్లాలది కాదు… 5 కోట్ల ఆంధ్రులది’ అనే ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. సీఆర్‌డీఏ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు యత్నించగా, పోలీసులు గేట్లు వేసి అడ్డుకున్నారు. అయినప్పటికీ రైతులు నెట్టుకుంటూ లోపలకు వెళ్లి కార్యాలయం ఎదుట బైఠాయించారు. ఆర్‌`5జోన్‌ను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం మొండిగా ముందుకెళితే తీవ్రంగా ప్రతిఘటిస్తామని రైతులు హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img