Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

ఇకనైనా విధుల్లోకి తీసుకోండి

. 365 రోజులకు ఆసుపత్రి ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల ఉద్యమం
. కలెక్టరేట్‌ ఎదుట రాస్తారోకో… ఉద్రిక్తత
. భారీగా నిలిచిపోయిన వాహనాలు

విశాలాంధ్ర బ్యూరో`కర్నూలు : గత 20 సంవత్సరాల నుంచి ప్రభుత్వ వైద్యశాలలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందిగా విధుల్లో ఉన్న కార్మికులను తొలగించడం అన్యాయమని, వెంటనే వారిని విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీయూసీ, సీపీఐ నాయకులు డిమాండ్‌ చేశారు. శుక్రవారం ప్రభుత్వ వైద్యశాల నుంచి కలెక్టరేట్‌ వరకు ఏఐటీయూసీ నగర సమితి అధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటీయూసీ నగర కార్యదర్శి జి.చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించారు. కలెక్టరేట్‌ ఎదుట రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. దీంతో వందలాది వాహనాలు రోడ్డుపై నిలిచిపోయాయి. పోలీసులు రాస్తారోకోను విరమించాలని కోరినప్పటికీ నాయకులు ససేమిరా అని పట్టుబట్టారు. దానితో పోలీసులు కలెక్టరేట్‌ వద్దనున్న ధర్నా చౌక్‌ వద్ద నిరసన కార్యక్రమం చేసుకోవాలని సూచించడంతో అక్కడికి వెళ్లి ఆందోళన నిర్వహించారు. కలెక్టర్‌ డౌన్‌ డౌన్‌, కార్మికుల పొట్టకొడుతున్న కలెక్టర్‌ అంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనా కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.మునెప్ప మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి అనేక కష్టాలు పడి ఉద్యోగాలు చేస్తున్న 107 మంది కార్మికులకు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దుర్మార్గమన్నారు. గత ఏడాది నుంచి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని దశలవారీగా వివిధ రూపాల్లో నిరసన తెలియచేసినప్పటికీ అధికారులు కరుణించలేదన్నారు. ఉద్యోగుల తొలగింపుపై కలెక్టర్‌ ఆదేశాల మేరకు త్రిసభ్య కమిటీ వేశారని, ఆ కమిటీ తొలగించిన వారిని విధుల్లోకి తీసుకోవాలని నివేదిక ఇచ్చినా నేటి వరకు విధుల్లోకి తీసుకోలేదన్నారు. జిల్లా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజనీని కలసి విన్నవించామన్నారు. మంత్రి బుగ్గన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినా మంత్రి ఆదేశాలను కలెక్టర్‌ బేఖాతరు చేశారని విమర్శించారు. వైద్యశాల సూపరింటెండెంట్‌ ఒక్కో పోస్టుకు రూ.3 లక్షల చొప్పున లంచాలు తీసుకుని పోస్టులు భర్తీ చేశారన్నారు. ప్రభుత్వం వెంటనే విచారణ చేపట్టి, అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో జిల్లావ్యాప్తంగా ఏఐటీయూసీ కార్మికులను తరలించి ఆందోళనను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాగా పోలీసులు, డీఆర్‌ఓ నాగేశ్వరరావు కలెక్టరేట్‌ గేటు వద్దకు వచ్చి వినతిపత్రం ఇవ్వాలని కోరినా కలెక్టర్‌ రావాల్సిందేనని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్‌ చేయడంతో ఆయన వెనుదిరిగి వెళ్లారు. ఈ ఆందోళనా కార్యక్రమంలో ఏఐటీయూసీ సీనియర్‌ నాయకులు మనోహర్‌ మాణిక్యం, సీపీఐ నగర కార్యదర్శి రామకృష్ణారెడ్డి, ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ కార్యదర్శి కృష్ణ, నంద్యాల ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రఘరామ మూర్తి, ఏఐటీయూసీ జిల్లా ఆఫీస్‌ బేరర్‌లు రాజు, ఓబీ నాగరాజు, నగర అధ్యక్షులు వెంకటేష్‌, నగర డిప్యూటీ కార్యదర్శి రామాంజనేయులు, ఆటో వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు ఈశ్వర్‌, కృష్ణారెడ్డి, మాధవ స్వామి, ఈశ్వరరెడ్డి, రేణుక, ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి రహిమాన్‌, సీపీఐ నగర సహాయ కార్యదర్శి మహేష్‌, శ్రీనివాసరావు, నర్సారావు, పురుషోత్తం, రాము, రంగనాయకులు బాధితులు కుమార్‌, లక్ష్మన్న, కోటమ్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img