Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఈసారి భారీ బడ్జెట్‌

. 17న అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బుగ్గన
. ఎన్నికల బడ్జెట్‌ కావడంతో మరిన్ని పథకాలు
. పదిరోజుల్లోపే శాసనసభ సమావేశాలు
. 23న ఎమ్మెల్సీల ఎన్నికకు ఓటు వేయనున్న ఎమ్మెల్యేలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్ర బడ్జెట్‌ ఈసారి భారీగా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్తగా మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేయాలని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి యోచిస్తున్నారు. ఇందుకోసం బడ్జెట్‌ గతేడాది కంటే గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. 202223 వార్షిక బడ్జెట్‌ సుమారు 2లక్షల 40వేల కోట్ల రూపాయలు కాగా, ఈసారి దానికి మించనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈనెల 14వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమవుతాయి. అదే రోజు రాష్ట్ర మంత్రి మండలి సమావేశం జరగనుంది. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ ఉభయసభలనుద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం అసెంబ్లీ వాయిదా పడుతుంది. అయితే సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనేది ఆరోజు జరిగే బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం నిర్ణయిస్తుంది. ఈనెల 17న రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నట్లు అధికారపార్టీ నేతలు చెపుతున్నారు. ఇందుకోసం ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. మళ్లీ తాను సీఎంగానే అసెంబ్లీలో అడుగుపెడతానని ప్రతిపక్ష నేత చంద్రబాబు శపథం చేసిన విషయం తెల్సిందే. ప్రస్తుతం ‘రాష్ట్రానికి ఇదేం ఖర్మ’ పేరుతో ఆయన రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ఆయన కుమారుడు నారా లోకేశ్‌ యువగళం పేరుతో పాదయాత్ర చేస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు చంద్రబాబు మినహా టీడీపీ నుంచి కేవలం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాత్రమే హాజరవుతారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ సమావేశాలు ఎక్కువ రోజులు నిర్వహించే పరిస్థితుల్లేవని అధికారపక్ష సభ్యులు పేర్కొంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం వారం రోజుల్లో బడ్జెట్‌ సమావేశాలు ముగించినందున… తాము కూడా వారంలోనే ముగిస్తామని చెపుతున్నారు. ఈనెల 23వ తేదీన ఎమ్మెల్సీల ఎన్నికకు శాసనసభ్యులు ఓటు వేయాల్సి ఉన్నందున…24న బడ్జెట్‌ సమావేశాలు ముగించే అవకాశం ఉంది. ఈనెల 28, 29 తేదీల్లో విశాఖపట్నంలో జీ`20 సదస్సు జరగనున్నది. సదస్సు నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేపడుతోంది. దీంతో బడ్జెట్‌ సమావేశాలను ఒకవేళ పొడిగించినా ఎట్టిపరిస్థితుల్లో 26 లేదా 27న ముగించనున్నారు. గత మూడేళ్లుగా మూడు రాజధానుల పాట పాడుతున్న పాలక పెద్దలు…ఈసారి కనీసం సీఎం క్యాంపు కార్యాలయాన్ని అయినా విశాఖకు తరలించి ఉత్తరాంధ్ర ప్రజలకు పరిపాలనా రాజధాని విశాఖకు వచ్చేసినట్లు భ్రమ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై అసెంబ్లీలో ముఖ్యమంత్రి అధికారికంగా కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img