Friday, April 26, 2024
Friday, April 26, 2024

ఉపాధి హామీ సక్రమ అమలుకు
ఏప్రిల్‌లో రిలేదీక్షలు

. జులైలో జాతీయ మహాసభలు
. బీకేఎంయూ జాతీయ కార్యవర్గం నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి/చెన్నై: కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తోందని భారతీయ ఖేత్‌ మజ్దూర్‌ యూనియన్‌ (బీకేఎంయూ) జాతీయ కార్యవర్గం విమర్శించింది. ఈ చర్యను నిరసిస్తూ దేశ రాజధాని దిల్లీలో ఏప్రిల్‌ నెలలో ఏడు రోజులు రిలే నిరహార దీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. బీహార్‌ రాష్ట్రం మధుబనిలో జులై నెలలో జాతీయ మహాసభలు జరపాలని తీర్మానించింది. బీకేఎంయూ జాతీయ కార్యవర్గ సమావేశాలు ఇక్కడి ఏఐటీయూసీ కార్యాలయంలో ఈ నెల 23, 24 తేదీల్లో జాతీయ అధ్యక్షులు పెరియా స్వామి అధ్యక్షతన జరిగాయి. బీకేఎంయూ జాతీయ నాయకులు, సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు నాగేంద్రనాథ్‌ ఓరaా ముఖ్య అతిథిగా హాజరై కేంద్రంలోని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తూర్పారబట్టారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పూర్తిగా మతతత్వ పోకడలతో ముందుకు పోతోందని, ఆరెస్సెస్‌ చేతిలో రిమోట్‌ కంట్రోల్‌గా మారిపోయిందని విమర్శించారు. భారత రాజ్యాంగ సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రాలకూ, కేంద్రానికీ పరస్ఫర సహకారం, సమన్వయం అవసరం ఉంటుందనీ, దానిని భేఖాతరు చేస్తూ రాష్ట్రాలపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. దేశాన్ని లూటీ చేసి…ప్రభుత్వ రంగ సంస్థలను ఆదానికి కట్టబెడుతూ దేశ సంపద అంతా దోచిపెడుతోందన్నారు. పేదలకు పట్టేడన్నం పెట్టే ఉపాధి హామీ, ఆహార భద్రత, సంక్షేమ పథకాలన్నింటికి బడ్జెట్‌లో భారీ కోత పెడుతూ…వారిని పథకాలకు దూరం చేస్తున్నారన్నారు. కేంద్రం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రాజకీయాలను గమనించాలని, సంఘం కార్యకర్తలు, నాయకులు ఎప్పటికప్పుడూ రాజకీయ చైతన్యం పొందుతూ వాటిని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. సామాజిక న్యాయం కోసం పోరాడాలని, ఫాసిజం విధానాల్ని అవలంబిస్తున్న మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించే తరహాగా ఉద్యమాలతోపాటు రాజకీయ ప్రచారం చేయాలన్నారు. నిత్యం పల్లెల్లో వుండే మనమంతా రాజకీయాలు మనకెందుకులే అనుకోకూడదంటూ హితవు పలికారు. గ్రామ సంఘాలు, సభ్యత్వం, నిత్యం జరగాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పేద మహిళలకు 32 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చినప్పటికీ, ఇప్పటివరకు పక్కా ఇళ్లు నిర్మించలేదన్నారు. దీనిపై సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘాలు నేతృత్వాన రెండు విడతలుగా ఆందోళనలు చేశామని వివరించారు. ఇదే సమస్యపై మార్చి రెండో తేదీన విజయవాడలో రాష్ట్ర స్థాయి ధర్నాకు పిలుపునిచ్చామన్నారు. పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇచ్చే వరకు ఆందోళన ఆగబోదని స్పష్టం చేశారు. జగన్‌ ప్రభుత్వం…ప్రభుత్వ భూములు పేదలకు పంచడంలో విఫలమైందని, వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వాన భూపోరాటాలు చేస్తున్నామన్నారు. ఉపాధి హామీ పథకానికి కేంద్ర బడ్జెట్‌లో నిధులు తగ్గించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ…ఇప్పటికే కేంద్ర కార్యాలయాలు ముందు ఆందోళనలు చేశామని, ఉపాధి హామీ పనులు చేసే ప్రదేశాలకు వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకుని ఎప్పటికప్పుడూ ఉన్నతధికారులకు తెలియజేస్తూ ఉపాధి కూలీలకు అండగా ఉంటున్నామని చెప్పారు. సంఘం సభ్యత్వం ఐదు లక్షలు ముద్రించి దిగువ విభాగాలకు పంపామని, గ్రామ సంఘాలతో పాటు సభ్యత్వమూ సకాలంలో చేర్పించి కేంద్ర కమిటీకి చెల్లిస్తామన్నారు. ప్రధాన కార్యదర్శి గుల్జార్‌ సింగ్‌ గోరియా కార్యకలాపాల నివేదిక ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో బీకేఎంయూ ఆఫీస్‌ బేరర్లు ఇస్మాయిల్‌, నిర్మల్‌, రామమూర్తి, జానకి పాశ్వాన్‌, పూల్‌ చందు యాదవ్‌, ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆర్‌.వెంకట్రావు, బి కేశవరెడ్డి, తెలంగాణ నుంచి బాలమల్లేష్‌, కాంతయ్య, తాటి వెంకటేశ్వర్లు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img