Friday, April 26, 2024
Friday, April 26, 2024

కళారూపాలతో ప్రజాచైతన్యం

కళను మించిన ఆయుధం లేదు

వామపక్ష భావజాలం కలిగిన కళాకారులంతా ఏకం కావాలి
ప్రజానాట్యమండలి కళా ఉత్సవాల్లో ఇప్టా ఉపాధ్యక్షులు కందిమళ్ల్ల
జెండా ఆవిష్కరించిన అన్న

విశాలాంధ్ర బ్యూరో ` కడప : కళాకారులు తమ కళారూపాలతో ప్రజాచైతన్యానికి కృషి చేయాలని ఇప్టా ఉపాధ్యక్షులు కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి పిలుపునిచ్చారు. దాస్య శృంఖలాల నుంచి విముక్తి పొందేందుకు బ్రిటీష్‌, నిజాం పాలకుల గుండెల్లో నిలిచిన కళాకారులు తమ కళలతో ప్రజాచైతన్యానికి విశేష కృషి చేశారని, నేడు అదే స్ఫూర్తితో వామపక్ష భావజాలం కలిగిన కళాకారులంతా ఏకమై భవిష్యత్‌కు బాటలు వేయాల్సిన తరుణం ఆసన్నమైందని అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్యమండలి రాష్ట్ర మహాసభలు, రాష్ట్ర స్థాయి కళాఉత్సవాలు రెండవ రోజు శుక్రవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరం (కమ్ముసాహెబ్‌, శ్యామలదేవి కళా ప్రాంగణం)లో ప్రతినిధుల సభ ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి గౌరవాధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న), అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య నాయకురాలు విమలక్క, ప్రజానాట్య మండలి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేశు, మాజీ ఎమ్మెల్సీ పీజే చంద్రశేఖర్‌, మహిళా సమాఖ్య రాష్ట్ర అధ్యక్షురాలు వి.జయలక్ష్మి, ప్రజానాట్య మండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చంద్రానాయక్‌, అధ్యక్షులు గని తదితరులు పాల్గొన్నారు. ముందుగా నల్లూరి వెంకటేశ్వర్లు జెండా ఆవిష్కరణ గావించారు. అనంతరం అమరవీరుల స్థూపాన్ని ప్రతాప్‌రెడ్డి ఆవిష్కరించారు. ఫోటో ప్రదర్శనను విమలక్క ప్రారంభించారు. ప్రతినిధులనుద్దేశించి ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ ప్రజానాట్యమండలి చరిత్ర వివరించారు. సామాజిక రుగ్మతలను రూపుమాపేందుకు తమ కళారూపాల ద్వారా కళాకారులు విశేష కృషి చేశారని తెలిపారు. స్వాతంత్య్రం అనంతరం నిజాం, దొరల నిరంకుశ పాలనను ఎండగట్టడానికి, మూఢ నమ్మకాలను, రాజుల పాలనను రూపుమాపడానికి కళారూపాల ద్వారా ప్రజలను చైతన్యం చేశారని అన్నారు. కళారూపాల శక్తికి ఎలాంటి ఆయుధాలు ధీటు కావన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ప్రజలను అనేక సమస్యలను గురిచేస్తున్నాయని, వాటి కబంధ హస్తాల నుంచి ప్రజలను మేలు కొల్పడానికి కళాకారులు కృషి చేయాలని ప్రతాపరెడ్డి పిలుపునిచ్చారు.
నల్లూరి వెంకటేశ్వర్లు (అన్న) మాట్లాడుతూ ప్రజా సమస్యలను కళలు, పాటల రూపంలో తీసుకువచ్చి ప్రజల్లో జవసత్వాలు నింపడం ప్రజా కళాకారులకే చెల్లు అన్నారు. 1943లో బడుగు, బలహీనవర్గాల, కష్ట జీవుల కోసం ‘మా భూమి’ నాటికను ప్రదర్శించడం అప్పట్లో పెద్ద ఉత్సాహాన్నిచ్చిందన్నారు. జానపదాలు, బుర్ర కథల కళారూపాల ద్వారా బడుగు బలహీన తాడిత పీడిత ప్రజలలో ధైర్యాన్ని నింపి ముందడుగు వేసిందన్నారు. మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులు ఎందరో ఉన్నారని వారిలో అల్లు రామలింగయ్య, జమున, వంగపండు, నాగభూషణం తదితరులు అందరూ బతకాలి, భూభాగోతం వంటి నాటికల ద్వారా ప్రజలను చైతన్యపరిచారన్నారు. విమలక్క మాట్లాడుతూ శ్రీకాకుళం నుంచి నక్సల్‌బరి వరకు ఉద్యమాలకు ఊపిరి పోసింది కళాకారులేనన్నారు. ఫ్యాక్షనిజం, పీడిత తాడిత వర్గాలపై దాడులను అరికట్టడంలో ముందడుగు వేయడానికి కళలు ఎంతో ఉపయోగపడ్డాయని తెలిపారు.
సంస్కృతి, సంప్రదాయాలను ఛిద్రం చేస్తూ నేటి సమాజంలో ఆటవిక, అరాచక పాలన కొనసాగుతోందన్నారు. సమావేశం మధ్యలో విమలక్క పాడిన పాటలు ప్రతినిధులను ఆలోచింపచేశాయి. శ్రీనివాస్‌ మాట్లాడుతూ రజాకర్ల పాలనను అంతమొందించడానికి ప్రజానాట్య మండలి కళలు ఎంతో ఉపయోగపడ్డాయని, దానికి నిదర్శనం తెలంగాణ సాయుధ పోరాటమేనని అన్నారు. రాబోయే తరానికి కళారూపాలను అందించాలంటే పాఠశాలల నుంచే కళలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. వి.జయలక్ష్మి మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో కళలు అసలు రూపును కోల్పోయి పెడదారిన పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నేటి పాటలు, సినిమాలు, ప్రజలను రంజింపచేసేవి కాకుండా ప్రలోభాలకు లోనయ్యే విధంగా ఉండడం ఆవేదన కలిగిస్తున్నదన్నారు. నేడు సాహిత్యం భ్రష్టు పట్టిపోయి అశ్లీలతతో కూడుకున్నదని, దీన్ని అంతమొందించడానికి నేటి యువత కంకణబద్ధులై ముందుకు సాగాలన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి నాయకులు రామకృష్ణ, లక్ష్మణరావు, చంద్రశేఖర్‌, నిస్సార్‌, జాకబ్‌, సినీ దర్శకులు బాబ్జీ, సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు పులి కృష్ణమూర్తి, నాగసుబ్బారెడ్డి, బషీరున్నిసా, సుబ్బారెడ్డి, రమణ, రైతు సంఘం నాయకులు గాలిచంద్ర, నగర కార్యదర్శి వెంకటశివ, కమలాపురం ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌, వివిధ జిల్లాల నుంచి వచ్చిన కళాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img