Friday, April 26, 2024
Friday, April 26, 2024

కార్పొరేట్‌కు దీటుగా…

ప్రభుత్వ పాఠశాలల ఆధునికీకరణ
విద్యారంగంలో పెనుమార్పులు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
రెండో విడతకు శ్రీకారం
మొదటి విడత నాడు`నేడు పాఠశాలలు ప్రజలకు అంకితం

అమలాపురం : విద్యారంగంలో మునుపెన్నడూ లేనివిధంగా తమ ప్రభుత్వం పెనుమార్పులు తీసుకొస్తోందని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ విద్యాసంస్థలకు దీటుగా మారుస్తామని చెప్పారు. చదవు కోసం ఏ విద్యార్థి బాధపడకూడదని ఆయన చెప్పారు. ప్రతి బిడ్డకు ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరం నియోజకవర్గంలోని సింగంశెట్టి ప్రభావతి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో సోమవారం నిర్వహించిన మనబడి నాడు-నేడు, జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం జగన్‌ పాల్గొన్నారు. మొదటి విడత మనబడి నాడునేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలను ప్రజలకు అంకితమిచ్చారు. రెండో విడత నాడునేడుకు శ్రీకారం చుట్టారు. తొలుత ఉన్నత పాఠశాల భవనాల నిర్మాణానికి స్థలమిచ్చిన దాత సింగంశెట్టి ప్రభావతిని సీఎం అభినందించారు. పదవ తరగతి విద్యార్థులతో ఆయన కాసేపు ముచ్చటించి నాడు నేడు పనులపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. బ్లాక్‌ బోర్డుపై ‘ఆల్‌ ది వెరీ బెస్ట్‌’ అని రాసి నూతన విద్యాసంవత్సరంలో అడుగు

పెడుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల ప్రాంగణంలో నాడు నేడు పనులకు సంబంధించిన ఫైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. అభివృద్ధి చేసిన పాఠశాల తరగతి గదులను, మరుగుదొడ్లను, పరిసరాలను జగన్‌ పరిశీలించారు. ఉన్నత చదవులు అందించడం ద్వారా మాత్రమే విద్యార్థులు ప్రతిభావంతులుగా ఎదుగుతారని సీఎం జగన్‌ అన్నారు. విద్యార్థుల్లో తగ్గిపోతున్న విద్యా ప్రమాణాలపై తమ ప్రభుత్వం సర్వే చేయించిందని, మూడో తరగతి విద్యార్థులు కనీసం రెండో తరగతి పుస్తకాలు చదవలేకపోవడాన్ని గుర్తించామన్నారు. అందుకే విద్యార్థుల్లో విద్యాప్రమాణాలు పెంచాలని నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి కొవిడ్‌ నిబంధనలతో పాఠశాలలు ప్రారంభించామన్నారు. తరగతి గదికి 20 మంది ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. ఒకే ఉపాధ్యాయురాలు అన్ని తరగతులకి పాఠాలు చెప్పటం వల్ల ఏకాగ్రత దెబ్బతింటుందని గుర్తించినట్లు జగన్‌ వెల్లడిరచారు. విద్యార్థుల్లో ప్రమాణాలు పెరిగేలా రాష్ట్ర ప్రభుత్వం నూతన తరగతులు, పరిశుభ్ర టాయిలెట్స్‌, రన్నింగ్‌ వాటర్‌ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నట్లు జగన్‌ చెప్పారు. రాబోయే కాలంలో పాఠశాలలను మరింత ఆధునీకరణ చేసి విద్యార్థుల్ని ఉత్తమంగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టంచేశారు.
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ మాట్లాడుతూ అంబేద్కర్‌ వంటి మహనీయుల ఆశయసాధనకు ముఖ్యమంత్రి జగన్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. పాఠశాలల అభివృద్ధి కోసం నాడు-నేడు పేరిట ప్రభుత్వం అప్పులు చేస్తోందని ప్రతిపక్ష నాయకులు ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ప్రతిపక్ష నాయకుల కళ్లకు కేవలం అప్పులు మాత్రమే కనిపిస్తున్నాయా? అభివృద్ధి కనిపించడం లేదా అని మంత్రి సురేశ్‌ ప్రశ్నించారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం పెరుగుతుందన్నారు.
వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్‌ బృహత్తర ప్రణాళికను రూపొందించారని తెలిపారు. జగనన్న విద్యా కానుక ద్వారా విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న కిట్లను ముఖ్యమంత్రి జగన్‌ పంపిణీ చేశారు. పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించారు. ముఖ్యమంత్రి దృష్టికి నియోజకవర్గ సమస్యలు తీసుకువచ్చారు. అన్ని సమస్యలు పరిష్కరిస్తానని సీఎం జగన్‌ హామీ ఇచ్చారు. ఉపముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్‌, వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఎంపీలు చింతా అనురాధ, మార్గాని భరత్‌, పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, కలెక్టర్‌ హరికిరణ్‌, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, జక్కంపూడి రాజా, పెండెం దొరబాబు, సత్తి సూర్యనారాయణ రెడ్డి, జ్యోతుల చంటిబాబు, పొన్నాడ సతీష్‌ కుమార్‌, చిర్ల జగ్గారెడ్డి, రాపాక వరప్రసాదరావు, ముదునూరి ప్రసాదరాజు, ఎమ్మెల్సీలు పండుల రవీంద్రబాబు, షేక్‌ షాబ్జి, ఇళ్ల వెంకటేశ్వరరావు, రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దవులూరి దొరబాబు, ప్రభుత్వ సలహాదారు తలశిల రఘురాం, ఎస్సీ మాల కార్పొరేషన్‌ చైర్మన్‌ పెదపాటి అమ్మాజీ, తాగునీటిపారుదల శాఖ ప్రభుత్వ సలహాదారు బొంతు రాజేశ్వరరావు, డీసీఎంఎస్‌ చైర్మన్‌ సాకా మణికుమారి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img