Friday, April 26, 2024
Friday, April 26, 2024

గోదావరి ఉగ్రరూపం..

భద్రాచలంవద్ద రెండో ప్రమాద హెచ్చరిక
పోలవరం ప్రాజెక్టు వద్ద ప్రమాద ఘంటికలు

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నది నీటిమట్టం క్రమంగా పెరుగుతూ ప్రమాద స్థాయిని దాటిందని అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఏపీలోనూ ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి, కృష్ణా నదులలో వరద ఉధృతి పెరుగుతోంది. ఇదిలావుండగా, గోదావరి నదికి వరద నీరు పోటెత్తడంతో గోదావరి నది నీటిమట్టం పెరుగుతుందని భద్రాచలంలో స్థానిక పరిపాలన అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీంతో అధికారులు అప్రమత్తమై పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.
గోదావరి ఉధృతి ..
భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక సోమవారం ఉదయం 6 గంటలకు 48.60 అడుగులకు పైగా గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో భద్రాచలం సబ్‌ కలెక్టర్‌ రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద 11,39, 230 క్యూసెక్కుల నీటి ప్రవాహం కొనసాగుతోందని చెబుతున్నారు. వరద సహాయక చర్యల్లో ఉన్న అధికారులందరూ గోదావరి వరద కట్టడి చర్యల ప్రకారం పనిచేయాలని అధికారులను ఆదేశించారు
ధవళేశ్వరం ప్రాజెక్ట్‌ వద్ద పాక్షికంగా గేట్ల ఎత్తివేత
ఇక ఎగువన కురుస్తున్న వర్షాలతో రాజమండ్రి ధవళేశ్వరం బ్యారేజ్‌ వద్ద కూడా గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. దీంతో అధికారులు బ్యారేజీ 175 గేట్లను పాక్షికంగా ఎత్తివేసి 3, 22 వేల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలి వేశారు. ఇక భారీ వర్షాల కారణంగా పాపికొండలు విహార యాత్రకు అధికారులు తాత్కాలికంగా బ్రేక్‌ వేశారు. అంతేకాదు పోలవరం పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి నీటిమట్టం ప్రమాదం ఘటికలు మోగిస్తోంది. పోలవరం ప్రాజెక్టుకు ఆకస్మికంగా భారీ వరద వచ్చి పడటంతో ప్రాజెక్టు పనులకు ఆటంకం కలిగింది.

పోలవరం ప్రాజెక్ట్‌ వద్ద ప్రమాదకరంగా వరద..

పోలవరం స్పిల్‌ వే దగ్గర 30.1మీటర్లకు వరద నీరు చేరుకోవడంతో ప్రస్తుతం ప్రాజెక్ట్‌ నుండి నాలుగు లక్షల క్యూసెక్కుల కు పైగా దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ఈ అర్థరాత్రి సమయానికి 12 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తుందని అంచనా వేస్తున్నారు. గతంలో జూలై నెలలో 30 నుంచి 50 వేల క్యూసెక్కుల వరద మాత్రమే వచ్చిందని, అయితే ఈసారి పది లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీరు చేరుకోవడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. గంటగంటకు వరద ఉధృతి పెరుగుతున్న తీరు పోలవరం ప్రాజెక్టుకు గండం పొంచి ఉంది అన్న సంకేతాలను ఇస్తుంది. రాష్ట్రంలో మరో 3రోజుల పాటు ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రాణనష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవటం కోసం రెండు రాష్ట్రాలలోనూ అధికారులు రంగంలోకి దిగారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img