Friday, May 3, 2024
Friday, May 3, 2024

జన నీరాజనం

రాజధాని పాదయాత్రకు ప్రకాశంలో మహాస్వాగతం
ఆకట్టుకున్న కోలాటం, డప్పు కళాకారుల నృత్యం
కిలోమీటర్ల మేర జనసందోహం

విశాలాంధ్ర`ఒంగోలు : జై అమరావతి…జయహో అమరావతి నినాదాలు మిన్నంటాయి. ఏకైక రాజధాని అమరావతి కావాలంటూ సేవ్‌ అమరావతి ప్లకార్డులతో యువత, ఆకుపచ్చ చీరలతో మహిళలు..ఆకుపచ్చ కండువాలు, ఆకుపచ్చ జెండాలతో రైతులు, రాజధానికి సంఫీుభావంగా తెలంగాణవాసులు మహా సంకల్పంతో మహాపాదయాత్రతో కదంతొక్కారు. ప్రకాశం జిల్లా సరిహద్దు చిన్ననందిపాడు సరిహద్దు వద్ద సీపీఐ, టీడీపీ, సీపీఎం, కాంగ్రెస్‌ అధ్వర్యంలో జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వేలాదిమంది కార్యకర్తలు మహా పాదయాత్రకు ఘనస్వాగతం పలికారు. రైతుల మహా పాదయాత్రకు వైసీపీ మినహా మిగిలిన రాజకీయ పక్షాలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు మద్దతు ప్రకటించాయి. గుంటూరు జిల్లా పెదనందిపాడు శివారు నుంచి పర్చూరు నియోజకవర్గ కేంద్రం వరకు కిలోమీటర్ల మేర రవాణా నిలిచిపోయింది. పర్చూరు నియోజకవర్గ రైతులు ట్రాక్టర్లు, నాగళ్లతో వినూత్నరీతిలో ప్రదర్శన నిర్వహించారు. అమరావతి నిర్మాణంతో వెనుకబడ్డ ప్రకాశం జిల్లా అభివృద్ధి చెందుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. పాదయాత్రలో మహిళలు కోలాటం ప్రదర్శించారు. పర్చూరు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి వేలాదిమంది మహిళలు పాదయాత్రకు సంఫీుభావంగా తరలివచ్చారు. మహా పాదయాత్రకు మద్దతుగా పర్చూరు రైతులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు లక్షలాది రూపాయలు విరాళంగా అందించారు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అధ్వర్యంలో ఆ విరాళాలను జేఏసీ నేతలకు అందజేశారు. సీపీఐ ప్రకాశం జిల్లా కార్యదర్శి ఎంఎల్‌ నారాయణ, కొండేపి శాసనసభ్యులు డోల బాల వీరాంజనేయస్వామి, మాజీ శాసనసభ్యులు దామచర్ల జనార్ధన్‌, ముత్తముల అశోక్‌రెడ్డి, జీవీ ఆంజనేయులు, డేవిడ్‌ రాజు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత, ఒంగోలు పార్లమెంట్‌ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, కేంద్ర మాజీమంత్రి జేడీ శీలం, మాజీమంత్రి రావెల కిషోర్‌ బాబు, తెలుగుదేశం పార్టీ నేతలు ఎరిక్షన్‌ బాబు, వేగేశన నరేంద్ర వర్మ, దామచర్ల సత్య, తెలుగు మహిళ బాపట్ల పార్లమెంటు అధ్యక్షురాలు పృథ్వీలత, గుంటూరు జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి, తెలుగురైతు అధ్యక్షుడు కొండ్రగుంట వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.
అమరావతే ఏకైన రాజధాని : ముప్పాళ్ల
రాష్ట్రానికి ఏకైక రాజధాని అమరావతి అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు. అమరావతి ఐక్య కార్యాచరణ సమితి, రాజధాని పరిరక్షణ సమితి అధ్వర్యంలో రైతులు నిర్వహిస్తున్న మహాపాదయాత్ర 6వ రోజున ప్రకాశం జిల్లా చిననందిపాడు వద్ద శనివారం ప్రవేశించింది. సీపీఐ, సీపీఎం, టీడీపీ, జనసేన, కాంగ్రెస్‌ పార్టీ సంఫీుభావం తెలిపాయి. మహాయాత్ర చిననందిపాడు నుండి అడుసుమల్లి చేరుకొని అక్కడ భోజన విరామం ఇచ్చారు. అక్కడి నుంచి పర్చూరు చేరుకున్నది. రాత్రికి పర్చూరులో బస ఉంటుంది. అమరావతికి ప్రత్యామ్నాయం లేదని, జగన్‌ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని ముప్పాళ్ల నాగేశ్వరరావు సూచించారు. యాత్రకు సంఫీుభావం తెలిపిన వారిలో సీపీఐ ప్రకాశం, గుంటూరు జిల్లాల కార్యదర్శులు ఎంఎల్‌ నారాయణ, జంగాల అజయ్‌కుమార్‌, పార్టీనాయకులు బత్తుల సామ్యూల్‌, శ్రీధర్‌, ముసునూరి రమేష్‌, నాగభైరవ రామసుబ్బాయమ్మ తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img