Friday, April 26, 2024
Friday, April 26, 2024

దేశరక్షణ కోసం యుద్ధం

ఇది వ్యక్తుల మధ్య పోరాటం కాదు
విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా
ఆత్మప్రబోధానుసారం ఓటేయండి సీఎం కేసీఆర్‌

విశాలాంధ్ర`హైదరాబాద్‌:
దేశంలో రోజురోజుకు పరిస్థితులు దిగజారిపో తుంటే చూస్తూ ఉండలేమని, అందుకే కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా చాలా రోజులుగా పోరాటాలు చేస్తున్నామని విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా అన్నారు. రాష్ట్రపతి ఎన్నికలు ఇద్దరు వ్యక్తుల మధ్య పోరాటమో లేదా ఇద్దరి గుర్తింపు కోసమో జరిగే పోరాటం కాదని, విశాల భారత పరిరక్షణ కోసమని పేర్కొన్నారు. ఒక వ్యక్తి చెబితే దేశం మొత్తం వినడం ఎక్కడి ప్రజాస్వామ్యమని సిన్హా ప్రశ్నించారు. శనివారం హైదరాబాద్‌ వచ్చిన సిన్హాకు విమానాశ్రయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుండి భారీ బైక్‌ ర్యాలీ ద్వారా నగరంలోని జలవిహార్‌కు చేరుకొని అక్కడ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. యశ్వంత్‌ సిన్హా మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ మద్దతు ఇస్తున్నందుకు సీఎం కేసీఆర్‌తో పాటు మంత్రి కేటీఆర్‌కు ధన్యావాదాలు తెలిపారు. కేసీఆర్‌ మాట్లాడుతూ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలక్టోరల్‌ సభ్యులంతా ఆత్మప్రభోదానుసారం ఓటు వేయాలని కోరారు. ఎన్నికల సమయంలో తియ్యటి మాటలు చెప్పే ప్రధాని మోదీ ఎన్నికల తరువాత అంతా రaూఠీ రaూఠీ మాటలు చెబుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. యశ్వంత్‌ సిన్హా ఉన్నత వ్యక్తిత్వం గలవారని, న్యాయవాదిగా కెరీర్‌ను ప్రారంభించిన ఆయన వివిధ హోదాల్లో దేశానికి అత్యుత్తమ సేవలందించారని కొనియాడారు. ఆర్థికమంత్రిగా పనిచేయడంతో పాటు వివిధ రంగాల్లో విశేష అనుభవముందని తెలిపారు. ఉత్తమ, ఉన్నత వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని చెప్పారు. మోదీ ప్రధానిగా తానే బ్రహ్మ అనుకుంటున్నారని, ఆ పదవి శాశ్వతం కాదని ఆయన గ్రహించాలని సూచించారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, రాజ్యాంగ విరుద్ధంగా తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలను కూలదోస్తున్నారని విమర్శించారు. మోదీని షావుకార్ల సేల్స్‌మన్‌గా కేసీఆర్‌ అభివర్ణించారు. అడ్డికి పావుసేరు ధరతో బయట నుండి బొగ్గు కోనుగోలు చేయాల్సిన అవసరం ఏముందో చెప్పాలని, సింగరేణి బొగ్గు టన్ను రూ.4వేలుకాగా, విదేశీ బొగ్గు రూ.30 వేలు ఉందని వివరించారు. మోదీ ఏ షావుకార్లకు ఏ మేరకు తినబెడుతున్నారో…ఏఏ దేశాల్లో ఆయన ఏజెంట్లు ఉన్నారో…తమవద్ద పూర్తి సమాచారం ఉందని కేసీఆర్‌ అన్నారు. సరైన సమయంలో వాటిన్నింటినీ బహిర్గతం చేస్తామన్నారు. అంతర్జాతీయ విపణిలో రూపాయి విలువనే ఎందుకు పడిపోతుందో ప్రజలకు బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనాను నియంత్రించడంలో విఫలమైన మోదీ లక్షలాది మంది శవాలను పవిత్రగంగలో కలిపారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహారాష్ట్ర తరహాలో తెలంగాణ ప్రభుత్వాన్ని కూలుస్తామని బీజేపి నాయకులు అంటున్నారని, దమ్ముంటే వచ్చి తన ప్రభుత్వాన్ని కూల్చాలని సవాల్‌ చేశారు. రాష్ట్రాలకు సంబంధించిన రూ.30లక్షల కోట్లు తన్నుకుపోయారని, చివరకు మహాత్మాగాంధీని అవమానించి భారతదేశ ప్రతిష్ఠను అంతర్జాతీయ స్థాయిలో దిగజార్చారని విమర్శించారు. దేశానికి సాగు, తాగునీరు, విద్యుత్‌ ఇవ్వలేకపోయారని, కనీసం దిల్లీలోనూ తాగునీరు అందించలేకపోయారని ఆరోపించారు. ఉద్యమాలతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని, అందుకే రాష్ట్రపతి ఎన్నికల్లో యశ్వంత్‌సిన్హాకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌ వస్తున్న మోదీ..తమ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా మోదీ నెరవేర్చలేదన్నారు. డీజిల్‌ సహా అన్ని ధరలు కేంద్రం పెంచేసిందని కేసీఆర్‌ మండిపడ్డారు. ఇవి చాలదన్నట్లు నల్లచట్టాలు తెచ్చి రైతులను ఇబ్బందిపెట్టిందని మండిపడ్డారు. ఉద్యమంలో కొందరు రైతులు మృతిచెందారని, వారి కుటుంబాలకు తాము రూ.3 లక్షలు చొప్పున ఇస్తే, బీజేపీ తమను చులకనగా చూసిందని సీఎం మండిపడ్డారు. మోదీ పాలనలో ఏ ఒక్కరూ సంతోషంగా లేరని, మోదీ తీరుతో శ్రీలంకలో ప్రజలు నిరసనలు తెలిపారని గుర్తుచేశారు. శ్రీలంక ఆరోపణలపై ప్రధాని మౌనమెందుకు వహిస్తున్నారని నిలదీశారు. శ్రీలంక విషయంలో స్పందించకుంటే మోదీని దోషిగానే చూడాల్సి వస్తుందన్నారు. మోదీ అవినీతిరహిత భారత్‌ అని పెద్దపెద్ద మాటలు చెప్పారని, ఎంత నల్లధనం వెనక్కి తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మోదీ పాలనలో అవినీతిపరులు పెరిగిపోయారన్నారు.
మోదీ విధానాల కారణంగా పెద్దపెద్ద పరిశ్రమలు పారిపోతున్నాయని విమర్శించారు. ఎనిమిదేళ్లలో దేశంలో భారీ కుంభకోణాలు జరిగాయని, రూపాయి పతనం చూస్తే మోదీ పాలన అర్థమవుతోందన్నారు. మేక్‌ ఇండియా అనేది శుద్ధ అబద్దమని, తనకు మోదీతో ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని, మోదీ విధానాలతోనే తమ అభ్యంతరమని పేర్కొన్నారు. ఇకముందు తాము మౌనంగా ఉండబోమని, మరిన్ని ఉద్యమాలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img