Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నీటి మీటర్లు తప్పదు

వీటివల్ల రైతులకే మంచిది
కరెంట్‌ లోడు, రీడిరగ్‌ తెలుస్తుంది
అధికారుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది
బిల్లు మొత్తం ప్రభుత్వం ద్వారా జమ
నాణ్యమైన,నిరంతర విద్యుత్‌ సరఫరాయే లక్ష్యం
వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం జగన్‌ స్పష్టీకరణ

అమరావతి : వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు అమర్చడం తప్పదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. వీటివల్ల రైతులకే ఉపయోగమన్నారు. మీటర్లు అమర్చడం ద్వారా ఎంత కరెంటు కాలుతుంది, ఎంత లోడ్‌ పడుతుందనే విషయం ఎప్పటికప్పుడు తెలుస్తుందన్నారు. ఈ విషయం రైతులకు అర్థమైనప్పటికీ, కొంతమంది కావాలనే రాద్ధాంతం చేస్తున్నారని ప్రతిపక్ష నేతలను విమర్శించారు. రాష్ట్రంలో వర్షపాతం, పంటలసాగు, ఈ-క్రాపింగ్‌, వ్యవసాయ సలహామండళ్ల సమావేశాలు, ఎరువుల పంపిణీ, వ్యవసాయ విస్తరణ కార్యక్రమాలు, ఆర్బీకేల నిర్మాణ ప్రగతి తదితర అంశాలపై సీఎం జగన్‌ బుధవారం అధికారులతో సమీక్షించారు. ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ నీటి మీటర్ల ఏర్పాటు వల్ల అధికారుల్లో సైతం జవాబుదారీతనం వస్తుందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు సహా మోటార్లు కాలిపోయిన పరిస్థితుల నుంచి బయటపడతామన్నారు. మోటార్లకు వచ్చే కరెంట్‌ బిల్లు మొత్తాన్ని ప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తుందని, ఆ తర్వాత ఈ డబ్బు నేరుగా కరెంటు పంపిణీ సంస్థలకు చేరుతుందన్నారు. రైతులకు నాణ్యమైన, నిరంతర విద్యుత్‌ సరఫరాయే ప్రభుత్వ లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. ఇందుకోసం ఫీడర్లను పెద్దసంఖ్యలో విస్తరించామని, ఉచిత విద్యుత్‌ కోసం ప్రత్యేకంగా 10వేల మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు తీసుకొస్తున్నామని సీఎం చెప్పారు. ఖరీఫ్‌పై సీఎం సమీక్షించారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 403.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా, 421.7 మిల్లీమీటర్లు కురిసిందని, నెల్లూరు మినహా అన్నిజిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైనట్లు అధికారులు వివరించారు. ఖరీఫ్‌లో ఈరోజు వరకు 76.65లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా, 67.41 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగయ్యాయని తెలిపారు. దీనిపై సీఎం మాట్లాడుతూ చిరుధాన్యాల సాగును ప్రోత్సహించాలని సూచించారు. అటువంటి రైతులకు మంచి గిట్టుబాటు ధర వచ్చేలా భరోసా కల్పించాలని, దీనివల్ల రైతులు మరింత ముందుకు వస్తారని సీఎం అన్నారు. రైతులతో ఏర్పడ్డ వ్యవసాయ సలహామండళ్లలో వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలు, సమస్యలు నేరుగా కలెక్టర్ల దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులు కోరిన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలను నిర్దేశిత సమయంలోగా అందజేయాలని, ఆ మేరకు ఆర్బీకేల పనితీరు, సామర్థ్యం మెరుగుపడాలని సీఎం స్పష్టం చేశారు. ప్రకృతి వ్యవసాయ విధానాలపై రైతులకు అవగాహన కల్పించాలని, ఆర్గానిక్‌ వ్యవసాయ ఉత్పత్తులకు సర్టిఫికేషన్‌ వచ్చేలా చూడాలన్నారు. డిసెంబరులో వైఎస్సార్‌ అగ్రి టెస్టింగ్‌ ల్యాబ్‌లు ప్రారంభించనున్నట్లు వెల్లడిరచారు. ఈ`క్రాపింగ్‌ చేసిన రైతులకు భౌతిక రశీదులు, డిజిటల్‌ రశీదులు ఇవ్వాలని, తద్వారా పూర్తి పారదర్శకత ఉంటుందన్నారు. జిల్లాస్థాయి వ్యవసాయ సలహా మండలి ప్రతినిధులతో రాష్ట్రస్థాయిలో సమావేశాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు. సమావేశంలో మంత్రి కురసాల కన్నబాబు, ప్రభుత్వ సలహాదారు (వ్యవసాయం) అంబటి కృష్ణారెడ్డి, ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img