Saturday, April 27, 2024
Saturday, April 27, 2024

నేటి నుంచి పది పరీక్షలు

. 3,349 పరీక్షా కేంద్రాలు
. అంధ విద్యార్థులకు కంప్యూటర్‌ సాయం
. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : పదో తరగతి పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పర్యవేక్షణలో ఈ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఈ నెల 3 నుంచి 18వ తేదీ వరకు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఉదయం 9.30 తర్వాత నిముషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతించబోరు. ఈ ఏడాది 6 సబ్జెక్ట్‌లకు ఆరు రోజుల పరీక్షలను రోజు విడిచి, రోజు సీబీఎస్‌సీ తరహాగా షెడ్యూలు విధించారు. ప్రభుత్వ, ప్రైవేట్‌, ఎయిడెడ్‌ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులు మాత్రమే ఇన్విజిలేషన్‌ నిర్వహిస్తారు. ఈ పరీక్షలకు మొత్తం 6,09,070 విద్యార్థులు హాజరు కానున్నారు. వారిలో బాలురు3,11,329, బాలికలు2,97,741 ఉన్నారు. పది సప్లిమెంటరీ పరీక్షలకు 53,410 మంది హాజరవుతారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో అత్యధికులు కాగా, అత్యల్పంగా పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు, బాపట్లలో ఉన్నారు. మొత్తం 3,349 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి గదికి కేవలం 24 మంది విద్యార్థులు మాత్రమే ఉండేటట్లు అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంది. మొత్తం 838 స్క్వాడ్‌లు నియమించగా, వారిలో సిట్టింగ్‌ స్క్వాడ్‌లు 682, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లు 156 ఉన్నాయి. సమస్యాత్మక పరీక్షా కేంద్రాలను గుర్తించి అవసరమైన చోట సిట్టింగ్‌ స్క్వాడ్‌ల ఏర్పాటుకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ ఏడాది నూతనంగా 104 పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుతోపాటు పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్థులు ఎలాంటి ఎలక్ట్రానిక్స్‌ పరికరాలు తీసుకువెళ్లేందుకు అనుమతించబోరు. ఉపాధ్యాయులు, సిబ్బంది సెల్‌ఫోన్‌లను పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మొబైల్‌ కౌంటర్‌లో ఇవ్వాలి. పరీక్షా కేంద్రాల్లో అక్రమాలకు పాల్పడితే 1997 నాటి యాక్ట్‌`25 (మాల్‌ ప్రాక్టీసెస్‌ నిరోధక చట్టం) ప్రకారం కఠిన చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీజేశారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డ 75 మంది ఉపాధ్యాయులపై ఇచ్చిన సర్య్కులర్‌ను ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థన మేరకు వెనక్కు తీసుకున్నామని, వారు పరీక్ష సమయంలో తహసీల్దార్‌ కార్యాలయంలో ఉండనవసరం లేదని, వారికి ఎలాంటి ఇన్విజిలేషన్‌ డ్యూటీలు వేయలేదని విద్యాశాఖ తెలిపింది. ప్రశ్నపత్రాన్ని ఎవరైనా సామాజిక మాధ్యమాల ద్వారా పరీక్షకు ముందుగానీ, పరీక్ష జరిగే సమయంలో కానీ బయటికి పంపితే ఆ ప్రశ్నపత్రం ఏ కేంద్రం నుంచి…ఏ విద్యార్థి వద్ద నుంచి వచ్చిందో తెలుసుకునేలా ఏర్పాట్లు చేపట్టారు. పరీక్షలకు హజరయ్యే విద్యార్థులందరికీ ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. దేశంలోనే తొలిసారిగా అంధ విద్యార్థుల కోసం వారే స్వయంగా కంప్యూటర్‌పై పరీక్ష రాసుకునే ఏర్పాట్లు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img