Friday, April 26, 2024
Friday, April 26, 2024

విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణ ప్రయత్నాలను విరమించుకోవాల్సిందే

. లేనిపక్షంలో కార్మికాగ్రహం చవిచూడక తప్పదు
. ఏఐటీయూసీ రాష్ట్ర నేతలు ఓబులేసు, రవీంద్రనాథ్‌ హెచ్చరిక
. 700 రోజులకు చేరిన ఉక్కు పరిరక్షణ ఉద్యమం
. సంఫీుభావంగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి : అనేక పోరాటాల ద్వారా తెలుగు ప్రజలు సాధించుకున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని, లేనిపక్షంలో కార్మికాగ్రహం చవిచూడాల్సి వస్తుందని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా విశాఖ నగరంలో గాంధీ బొమ్మ వద్ద నిరసన దీక్షలు 700 రోజులకు చేరుకున్న సందర్భంగా, ఆ ఉద్యమానికి సంఫీుభావంగా విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి ఆధ్వర్యంలో కార్మికసంఘాలు రాష్ట్రవ్యాప్తంగా వివిధ రూపాల్లో ఆందోళనా కార్యక్రమాలు చేపట్టాయి. దీనిలో భాగంగా విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌లో నిరసన ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఏఐటీయూసీ విజయవాడ నగర కార్యదర్శి మూలి సాంబశివరావు, సీఐటీయూ నగర కార్యదర్శి సుధాకర్‌ అధ్యక్ష వర్గంగా వ్యవహరించగా, ధర్నాను ఉద్దేశించి జి.ఓబులేసు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఇకనైనా కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమం మరింత ఉధృతమవుతుందని హెచ్చరిం చారు. విశాఖ స్టీల్‌ను దొడ్డిదారిన బలహీన పరచటా నికి మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టీల్‌ ప్లాంట్‌కు గుండెకాయ లాంటి బ్లాస్ట్‌ ఫర్నెస్‌3ను, 14 మాసాల నుంచి మూసేసి స్టీల్‌ ప్లాంట్‌లో అనేక విభాగాల్లో ఉత్పత్తి ఉద్దేశపూర్వకంగా తగ్గించిందన్నారు. ప్లాంట్‌ పూర్తి సామర్థ్యం తగ్గించడం వలన గత 11 నెలల్లో రూ.2,845 కోట్లు నష్టాలు వచ్చాయని తెలిపారు. ఇనుపఖనిజం, కోకింగ్‌ కోల్‌ ప్లాంట్లు కేటాయించకుండా అడ్డు పుల్లలు వేసిందన్నారు. ఏదో విధంగా నష్టాలు నమోదు చేయించడం ద్వారా స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరించాలని చూస్తున్నదని విమర్శించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాట కమిటీ చేసే ఉద్యమానికి రాష్ట్ర ఏఐటీయూసీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తోందన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రావులపల్లి రావీంద్రనాథ్‌ మాట్లాడుతూ గత 26 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటం విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ అమ్మకం దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డుకోగల్గిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖస్తుతి కోసం రెండు సార్లు విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపించిందన్నారు. 23 మంది అధికార పార్టీ పార్లమెంటు సభ్యులు లోక్‌సభలో ఉండి కూడా దీనిపై ఏనాడూ కేంద్రాన్ని నిలదీసిన దాఖలాల్లేవన్నారు. సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి యు.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు సొంత గనులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని కాపాడవలసిన సీఎం జగన్‌ స్టీల్‌ ప్లాంట్‌కు సంబంధించిన 4,000 ఎకరాల భూమి అమ్మకానికి బేరసారాలు ఆడటం దుర్మార్గమన్నారు. ఐఎఫ్‌టీయూ నాయకులు పోలారీ మాట్లాడుతూ కేంద్రం ప్రైవేటీకరణ విధానాలు వెనక్కి తీసుకోకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రఘురామరాజు, ఐఎఫ్‌టీయూ నాయకులు ఎం. రామకృష్ణ, ఏఐసీసీ నాయకులు ఈశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేటీకరణపై కేంద్రం దిగొచ్చేవరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు. టీయూసీఐ నాయకులు ప్రసాద్‌ వందన సమర్పణ చేశారు. ఏఐటీయూసీ నగర అధ్యక్షులు కె.ఆర్‌.ఆంజనేయులు, నాయకులు వియ్యపు నాగేశ్వరరావు, శ్రీరామచంద్రమూర్తి, ఎన్‌.శ్రీనివాస్‌ రెడ్డి, కోరే కొండలరావు, బలగాని శ్రీను, బి.రాంబాబు, కంచర్ల నాగేశ్వరరావు, మనం సుబ్బయ్య, సీహెచ్‌వీ రమణ, ప్రభుదాస్‌, శీను, కె.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్‌ రక్షణకు ఎన్నేళ్లయినా ఉద్యమిస్తాం`జేఏసీ నేతల హెచ్చరిక
విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పాటైన విశాఖ ఉక్కు పరిశ్రమ రక్షణకు మొక్కవోని దీక్షతో ఎన్నేళ్లయినా పోరాటం కొనసాగిస్తామని జేఏసీ నేతలు హెచ్చరించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షలు 700 రోజులకు చేరాయి. ఈ సందర్భంగా శనివారం శిబిరం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్దగల గురజాడ విగ్రహం వరకు కార్మికులు, ఉద్యోగులు భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం ఫ్లైఓవర్‌ కింద మానవహారం చేపట్టారు . ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్లు ఎం.జగ్గునాయుడు, జె అయోధ్య, వైస్‌ చైర్మన్లు పడాల రమణ, బి.నాగభూషణం అధ్యక్షతన సభ జరిగింది. ఈ సభలో ఏఐటీయూసీ ఉపాధ్యక్షులు డి.ఆదినారాయణ, సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్‌ నర్సింగరావు, ఐఎన్‌టీయూసీ రాష్ట్ర కార్యదర్శి మంత్రి రాజశేఖర్‌, సీిఎఫ్‌టీయూఐ జాతీయ అధ్యక్షులు ఎన్‌.కనకారావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.వెంకటేశ్వర్లు, టీఎన్‌టీయూసీి ప్రధాన కార్యదర్శి వి.రామ్మోహన్‌కుమార్‌, హెచ్‌ఎంఎస్‌ జిల్లా కార్యదర్శి డి.అప్పారావు, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.లోకనాధం, ఐద్వా జిల్లా కార్యదర్శి వై.సత్యవతి, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు యూఎస్‌ఎన్‌ రాజు తదితరులు మాట్లాడారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మికులు, ప్రజలు చేస్తున్న పోరాటం వృథా కాలేదని, రెండు సంవత్సరాలు పూర్తయినా మోదీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందన్నారు. కొనేందుకు ఏ ప్రైవేటు సంస్థ ధైర్యం చేయలేక పోయిందన్నారు. ఇంతవరకు ఏ ఒక్కరూ స్టీల్‌ప్లాంట్‌లో అడుగు పెట్టలేకపోయారన్నారు. ఇది కార్మికులు, ప్రజలు చేసిన పోరాట ఫలితమే అన్నారు. మోదీ ప్రభుత్వ మెడలు వంచి స్టీల్‌ప్లాంట్‌ అమ్మకం నిలిపివేసే వరకు మరింత ఉధృతంగా కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐసీటీయూ నాయకులు జె. రామకృష్ణ, కె.శంకరరావు, వామన మూర్తి, వైఎస్‌ఆర్‌టియుసి నాయకులు చంద్రశేఖర్‌, ఇన్సూరెన్స్‌ యూనియన్‌ నాయకులు బి.వి.గణేష్‌, రైతుసంఘం నాయకులు జి.నాయినబాబు, పెన్షనర్స్‌ యూనియన్‌ కార్యదర్శి కె.సుధాకర్‌, తదితరులు ప్రసంగించారు.
గుంటూరులో: గుంటూరు నగరంలో వివిధ కార్మిక సంఘాలు, విద్యార్ధి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సంఘాభావ ప్రదర్శన జరిగింది. ఏఐటీయూసీ నగర అధ్యక్షులు రావుల అంజిబాబు, సీఐటీయూ నగర పశ్చిమ ప్రధాన కార్యదర్శి బి.ముత్యాలరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర గౌరవాధ్యక్షులు వెలుగూరి రాధాకృష్ణమూర్తి, జిల్లా కన్వీనర్‌ మేడా హనుమంతరావు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి వై.నేతాజి, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఎన్‌వీ కృష్ణ, నల్లమడ రైతు సంఘం నాయకులు డాక్టర్‌ కొల్లా రాజమోహన్‌, ఎల్‌ఐసీ యూనియన్‌ నాయకులు వీవీకే సురేష్‌, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి ఎస్‌కే వలి, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.
ఏలూరులో: స్థానిక ఫైర్‌ స్టేషన్‌ సెంటర్లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏఐటీయూసి జిల్లా కన్వీనర్‌ బండి వెంకటేశ్వరరావు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి డీఎన్‌బీడీ ప్రసాద్‌, సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్‌, ఏఐటీయూసీ జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఎ. అప్పలరాజు, కడుపు కన్నయ్య,పోలా భాస్కర్‌, బళ్ల కనకదుర్గారావు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెంలో ఏఐటీయూసీ అనుబంధ కార్మిక సంఘాల కార్యకర్తలు ఆర్టీసీ డిపో ఎదుట భారీధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.సోమసుందర్‌, ఏరియా కార్యదర్శి ఓసూరి వీర్రాజు, కళింగ లక్ష్మణరావు, పాలూరి లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.
రాజమహేంద్రవరంలో: రాజమహేంద్రవరం శ్యామల సెంటర్లో సీఐటీయూ, ఏఐటీయూసీ, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, కెేవీపీఎస్‌, ప్రజా సంఘాలు, అభ్యుదయవాదులు, ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు టి.మధు, టి. అరుణ్‌, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ రాంబాబు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు ఎం. సుందర బాబు తదితరులు పాల్గొన్నారు.
కాకినాడలో: కాకినాడ జీజీహెచ్‌ ఎదురుగా పూలే విగ్రహం వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్‌, సీఐటీయూ అఖిలభారత ఉపాధ్యక్షులు బేబీ రాణి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షులు తాళ్లూరి రాజు, ఐఎఫ్‌టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఎం.యేసు, ఏఐటీయూసీ నాయకులు పీఎస్‌ నారాయణ, పెద్ది రెడ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఒంగోలులో: విశాఖ ఉక్కు అమ్మకానికి వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో స్ధానిక అద్దంకి బస్టాండ్‌ సెంటర్‌లో నిరసన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పీవీఆర్‌ చౌదరి, నగర కార్యదర్శి కొత్తకోట వెంకేటేశ్వర్లు, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు కాలం సుబ్బారావు, ఏఐఎఫ్‌టీయూ న్యూ జిల్లా కార్యదర్శి ఎంఎస్‌ సాయి, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి ఆర్‌ మోహన్‌, మెడికల్‌ రిప్స్‌ యూనియన్‌ జిల్లా అధ్యక్షులు సిహెచ్‌ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.
కర్నూలులో: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏఐటీయూసీ, సీఐటీయూల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్‌ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ పట్టణ అధ్యక్షులు వెంకటేశులు, సీఐటీయూ ఓల్డ్‌ సిటీ కార్యదర్శి ఎం.విజయ్‌ అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటీయూసీి జిల్లా కార్యదర్శి ఎస్‌.మునెప్ప, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ, వృత్తి దారుల సంఘం జిల్లా కార్యదర్శి సి.గురుశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img